నవతెలంగాణ-హైదారాబాద్: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారని సుప్రీంకోర్టు శుక్రవారం రాజస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది. పరిస్థితి తీవ్రమైనదని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 14 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని, అక్కడే ఎందుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని జస్టిస్ జె.బి.పార్థివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ”రాష్ట్రప్రభుత్వంగా మీరు ఏంచేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కోటాలో మాత్రమే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు” అని ప్రశ్నించింది. ఆత్మహత్యల కేసులను పరిశీలించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఖరగ్‌పూర్‌లోని ఐఐటిలో చదవుతున్న 22ఏళ్ల విద్యార్థి మృతిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మే 4న ఘటన జరగగా, మే 8న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, నాలుగు రోజులు ఎందుకు తీసుకున్నారని సంబంధిత పోలీస్ అధికారులను ప్రశ్నించింది. చట్ట ప్రకారం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఆత్మహత్య గురించి తెలుసుకున్న తర్వాత ఐఐటి ఖరగ్‌పూర్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఖరగ్‌పూర్ న్యాయవాది మరియు పోలీస్ అధికారుల వివరణలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ”మీరు మా తీర్పుని ధిక్కరిస్తున్నారు. మీరు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు” అని రాజస్తాన్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. కోటాలో నీట్ అభ్యర్థి తన తల్లిదండ్రులతో కలిసి నివసించిన గదిలోనే చనిపోయి కనిపించిన మరో కేసు గురించి కూడా ధర్మాసనం ప్రశ్నించింది. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి తన విధి నిర్వహణలో విఫలమయ్యారని, కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ధర్మాసనం పేర్కొంది. పరిస్థితిని వివరించాల్సిందిగా ఆ పోలీస్ అధికారికి సమన్లు జారీ చేసింది.