Friday, May 9, 2025
Homeఎడిట్ పేజిబౌద్ధం మతం కాకుండా ధమ్మం ఎందుకయ్యింది?

బౌద్ధం మతం కాకుండా ధమ్మం ఎందుకయ్యింది?

- Advertisement -

మనుషుల్ని చంపి మతాన్ని రక్షించడంకంటే-
మతాన్ని చంపి మనుషుల్ని రక్షించడమే మంచిది.
– గౌతమ బుద్ధుడు.

అలెగ్జాండర్‌ ఐదుశాతం ఆసియా భూభాగాన్ని గెలుచుకున్నాడు. తధాగతుడు మొత్తం ఆసియాను గెలుచుకున్నాడు. మరి ప్రపంచ విజేత ఎవరన్నది మనం కదా నిర్ణయించుకోవాలి! మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ (1879 – 1355) బుద్ధుడి గురించి ఏమన్నాడో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇలా అన్నాడు- ”తమ తెలివితేటలు అవగాహన ద్వారా ప్రపంచంలో ఆత్మవిశ్వాసం గల వారె వరూ చేయలేనిది బుద్ధుడు చేశాడని నేను అర్థం చేసుకున్నాను. శాంతిని నెలకొల్పగల శక్తి ఒక్క బోధిసత్యుడికి మాత్రమే ఉంది. మిగతా మతాల్లో ఎక్కువ తక్కువలూ, నలుపూ తెలుపూ వంటి తారతమ్యాలు ఉన్నాయి. బుద్ధుడు కూడా ఏసుకు గురువు.ఏసు కశ్మీర్‌లో పదమూడేళ్లు నివసించి, బౌద్ధ జీవనవిధానం నేర్చుకున్నాడు. యూరోప్‌లో ఏసును ‘దేవుని కుమారుడు’ అని పిలుచుకున్నారు. అతని ద్వారానే బుద్ధుడి బోధనలు యూరోపియన్‌లకు చేరాయి. అయితే ఇప్పుడు యూరోపియన్లు ఆ విషయం ఒప్పుకోరు. కొట్టి పారేస్తారు -మళ్లీ అది వేరే విషయం!” ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా దయ, జాతి, కరుణ, క్షమల గురించి మొట్టమొదట ప్రపంచానికి చెప్పింది బుద్దుడే.
బౌద్ధం ఒక సామాజిక దర్శనం! సకల శాస్త్రాల, సకల ధర్మాల సార సంగ్రహం. మొత్తం సమాజానికీ, దాని మనుగడకూ నాయకత్వం వహించే బాధ్యత బౌద్ధ ధమ్మం (ధర్మం)లో కనిపిస్తుంది. సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేసే నవీన మార్గం బౌద్ధం! బౌద్ధం మతం కాకుండా ధమ్మం (ధర్మం) ఎందుకయ్యిందంటే- ఇందులో దేవాలయం గానీ, దేవుడుగానీ లేడు. నైతిక వర్తనంతో కూడిన జీవనశైలి ఉండడం, యజ్ఞయాగాల్లాంటి కర్మకాండలు లేకపోవడమే. బుద్ధుడి బోధనల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉండేదంటే, బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వారికి వారే ముందుకొచ్చేవారు. ఈ విషయం మనం సమాజంలో స్పష్టంగా గమనిస్తున్నాం. వేల ఏండ్ల నాడే కాదు, ఇప్పుడు సమకాలీనంలో కూడా బౌద్ధం స్వీకరిస్తున్న వారు, స్వచ్ఛందంగానే స్వీకరిస్తున్నారు తప్ప, ఎవరో వారిని బలవంతంగా అందులోకి లాక్కునిపోతున్న వారు లేరు.
బౌద్ధంలో ఎదుటివారిని గౌరవంగా సంభోదించే పదం- భదంత- భంతే, భగవంత, భదంత.. వంటి పదాలన్నీ సమానార్థకాలు. గౌరవనీయులైన వారిని సంభోదించే పదాలు. మహా పరినిబ్బాన సూత్రంలో తమకంటే పెద్దవారైన భిక్కులను భంతే’ అని పిలవాలన్నాడు బుద్ధుడు. సమవయస్కులు, స్నేహితులూ అయితే, వారిని ‘ అవుసో ‘ అని పిలవాలని చెప్పారు. ‘భగవాన్‌’ అనేది బుద్ధుడికి బిరుదు. ‘భగవా’-ఆంటే పరిపూర్ణుడు అని అర్థం! ఈ పదాన్ని తస్కరించిన వైదికులు, కనిపించని కల్పిత దేవునికి అంటగట్టి దాని అర్థాన్నే మార్చేశారు. జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుణ్ణి శిష్యులూ, అనుయాయులూ అంతా భగవాన్‌ అని పిలిచేవారు. రెండవ సంగీతి తర్వాత భిక్కులంతా ఆయన్ను ‘బుద్ధుడు’ అని పిలిచుకున్నారు. ధమ్మపదంలో ఉన్న ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఈ విధంగా చెపుతుంది.
”మనో పుబ్బంగమా ధమ్మా (సర్వధర్మాలు మనసులో పుడతాయి)
మనో సెఠా మనోమయా (సర్వధర్మాలకూ మనసే మూలం)
మనసా చే పదుఠేన (చెడు సంకల్పంతో ఆలోచించినా)
భా సతివా కరోతివా (మాట్లాడినా, పనులు చేసినా)
తతోనం దుఖ:మన్వేతి (ఎద్దు పాదాలను వెంబడించే)
చక్రం వవహతో పదమ్‌ (బండి చక్రంవలె దు:ఖం వెంబడిస్తుంది) కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు – అని స్థూలంగా దీని అర్థం. మనసులోని ఆలోచనలను బట్టి ఫలితాలు ఉంటాయన్నాడు బుద్ధుడు. ఏ విత్తనాలు నాటితే, ఆ పంటే కదా వస్తుందీ? అందువల్ల ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలిగి, మంచి పనులు చేస్తూ ఉండాలన్నది దీని సారాంశం, చెడు ఆలోచనలు చేస్తూ, మంచివారిలా నటించే వారి వల్ల మంచి జరగదు. చెడే జరుగుతుంది. ఫలితంగా దు:ఖం కలుగుతుంది. (ఉదాహరణ-పైన చెప్పిన విధంగా ఎడ్లబండి). మనస్ఫూర్తిగా మంచి ఆలోచనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ఉండే వారికి మంచి ఫలితాలు వస్తాయి. దు:ఖం వారికి దూరంగా ఉంటుంది వారి దరికి చేరదు, మానవవాదులుగా, హేతువాదులుగా ఇప్పుడు మనం ఆలోచిస్తే- స్వర్గం కోరుకునే వారికి మెదడు సున్నా శాతం, విశ్వాసం వందశాతం ఉంటుందని తేలుతుంది. అలాగే స్వర్గాన్ని తిరస్కరించే వారికి మెదడు వందశాతం విశ్వాసం సున్నా శాతం- అని తెలుస్తుంది. దేవుడున్నాడా లేడా? అన్న సంశయంలో కొట్టుకుంటూ ఉండే కంటే ఎవరికి వారు తను మనిషినేనా? కాదా? అనేది ఆలోచించుకుంటే మంచిది. తన ఆలోచనలన్నీ మనిషి కేంద్రంగా, వైజ్ఞానికంగా సాగుతున్నాయా లేదా? అనేది ఆలోచించుకుంటే మంచిది. ఆ దిశలో తనను తాను మార్చుకుంటే మంచిది. బతికి ఉన్నప్పుడు బాధల్ని, వేదనల్ని, కష్టాల్ని తగ్గించేందుకు ఒక్క మతం కూడా లేదు. కానీ, మరణం తర్వాత మాత్రం సుఖవంతమైన జీవితం, స్వర్గసుఖాలు అందించడానికి అన్ని మతాలూ పోటీ పడుతున్నాయి. జీవితంలో దు:ఖం ఉంది. దానికి నివారణ ఉంది – అని చెప్పింది ఒక్క బౌద్ధ ధమ్మం మాత్రమే !
ఒకనాడు బౌద్ధ భిక్కులు ఆరామాలలో ప్రజలకు నీతికథలు, జాతక కథలు బోధించేవారు. తర్వాత తరాలలో బౌద్ధరాజులు, బౌద్ధ జాతక కథల సారాంశాన్ని, నీతిని ప్రచారం చేయడానికి శిల్పాలు చేర్పించారు. ఆ తరువాత వచ్చిన వైదికులు ఆశిల్పాలకు కొత్త కథలు అల్లి- ఈ దేశం ఒకప్పుడు బౌద్ధ దేశమంటే, విని భరించలేకపోతున్నారు. అంధ విశ్వాసాల్లో మునిగిపోయి, ఆనందిస్తున్నామన్న భ్రమలో బతుకుతున్నారు. మతం మత్తు-జనాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో సమకాలీనంలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వజ్రపాణి, ధమ్మపాణి, మహామాయ, తారాదేవి, మంజుశ్రీ హారిక, అపరాజితల కోసం కట్టిన మందిరాలను, ఆరామాలను హిందూ దేవాలయాలుగా మార్చేశారు. బోధి సత్వ వజ్రపాణిని బ్రాహ్మణులు విష్ణుమూర్తిగా మార్చి – ఆయననే వజ్రపాణిగా ప్రచారం చేశారు. అసలు విషయమేమంటే – ఉదర పోషణార్థం బహుకృత వేషం! కాయకష్టం చేయకుండా బతుకుదెరువు చూసుకున్నారు.
బౌద్ధ స్థూపమని తెలిసి కూడా సనాతన శివలింగమని పూజలు చేస్తున్న మూర్ష శిఖామణులు, అస్థూపం మీద వరుసగా చెక్కి ఉన్న బుద్ధుడి బొమ్మలు చూడలేకపోతున్నారు. పసుపు, కుంకుమ, పూలదండలు, అలంకారాలు, ధూపాలు, సాంబ్రాణి వగైరా ఎందుకయ్యా? అంటే-అవన్నీ బౌద్ధ విగ్రహ రూపురేఖలు దాచేయడానికే! సోమనాథ్‌ ఆలయానికి దిగువన బౌద్ధ గుహలు ఉన్నాయి. మరి బ్రాహ్మణ మతస్థులు ఈ ఆలయాన్ని బౌద్ధులకు ఇచ్చేస్తారా? ”కీర్తి ముఖ’ అనేది బౌద్ధ శిల్పాలలో కనిపించే ఒక లక్షణం. దాని పేరు మార్చి వైదికులు దాన్ని దిష్టిబొమ్మ’గా ప్రచారం చేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ బొమ్మను ఇళ్లముందు పెట్టుకుంటున్నారు. అది దిష్టిబొమ్మ కాదు. బౌద్ధ శిల్పం నుండి తస్తరించిన ‘కీర్తిముఖ’- అని జనం తెలుసుకోలేకపోతున్నారు. అంటే తప్పుడు ప్రచారం ఏస్థాయిలో జరిగిందన్నది మనం గ్రహించుకోవాలి.
1954వ సంవత్సరం డిసెంబర్‌ 25న పూనా దగ్గర్లో దేహూ రోడ్డులో కొత్తగా నిర్మించిన బుద్ధ విహారంలో బుద్ధవిగ్రహాన్ని ఆవిష్కరిస్తూ, అంబేద్కర్‌ ఇలా అన్నారు. ”పండరీపూర్‌లోని విఠోబా విగ్రహం నిజానికి బుద్ధ విగ్రహమే.” – అని! ‘పాండురంగ’ అనే పదం ‘పుండాలిక్‌’ అనే పదం నుండి ఆవిర్భవించింది. పుండాలిక్‌-అంటే పద్యం. పాలిభాషలో పద్యాన్ని ‘పాండురంగ్‌” అంటారు. కనుక, పాండురంగడు బుద్ధుడు తప్ప మరెవరో కాదు. భారతదేశంలో బౌద్ధం అంతరించిపోవడానికి ఇక్కడి సామాన్య ప్రజల అమాయకత్వం, చంచల స్వభావం, అజ్ఞానం కారణాలు. బ్రాహ్మణులు రూపొందించిన చాలామంది దేవీ దేవతల్ని వారు ఆరాధిస్తారు. వాస్తవాలు తెలుసుకోరు. బౌద్ధాన్ని నాశనం చేయడానికి వైదిక మతస్థులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు- ( హైదరాబాదు బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించిన ”భారత దేశంలో బౌద్ధం” అనే గ్రంథం నుండి)
బౌద్ధానికీ, బ్రాహ్మణిజానికీ మధ్య జరిగిన ఘర్షణ ఫలితంగానే దేశంలో అంటరానితనం వచ్చింది. తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి వైదికులు అస్పృశ్యతను పెంచి, పోషించి, సమాజాన్ని ధ్వంసం చేశారు. మానవీయ విలువలకు విలువ లేకుండా చేశారు. నలందా విశ్వవిద్యాలయానికి కూతవేటు దూరంలో ఒక బుద్ధ విగ్రహం లభిస్తే వైదికులు దాన్ని ”రుక్మిణీ దేవి” ఆలయంగా తీర్చిదిద్దారు. అక్కడే మరికొంత దూరంలో లభించిన బుద్ధుడి విగ్రహం తలమీద నూనె పొసి ”తేలి బాబా” (నూనె బాబా)గా ప్రచారం చేసి, కొందరు అక్కడ పూజలు ప్రవేశపెట్టి తమ పూట గడుపుకున్నారు. మధుర- కృష్ణుడి నగరమని చెపుతారు కదా? మరి అక్కడ ఒక్కటంటే ఒకటి కృష్ణుడి విగ్రహం ఎందుకు దొరకలేదూ? మధురలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సుమారు ఐదువేల బుద్ధుడి విగ్రహాలు బయటపడ్డాయి. అవే మధుర మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఇది బౌద్ధులదేశమని, ఇది బౌద్ధ వారసత్వమని ఈ దేశపు నేల శతాబ్దాలుగా ఘోషిస్తోంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా, బౌద్ధ వారసత్వమే బయటపడుతూ ఉంది. మధుర – కృష్ణుడనే కల్పిత పాత్రకు అంటగట్టి, కట్టు కథలు ప్రచారం చేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు. కావాలంటే మధురలో మ్యూజియం సందర్శించే వారు ఈ విషయం గమనించొచ్చు. మ్యూజియం నిండా బౌద్ధ శిల్పాలు తప్ప కృష్ణుడి ప్రతిమ మచ్చుకైనా కనిపించడు. సత్యం తానే సత్యాన్నని ప్రగల్భాలు పలకదు. కానీ, అబద్ధానికే ఆ అవసరం ఉంటుంది-తానే సత్యాన్నని ఊరూ, వాడా గగ్గోలు పెడుతుంది!
(12 మే, బుద్ధ పూర్ణిమ సందర్భంగా)
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత.
– డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -