నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల రిజర్వేషన్, (డీలిమిటేషన్) నియోజకవర్గాల పునర్విభజనపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. శుక్రవారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు సీట్ల తప్పనిసరి చేస్తూ ప్రవేశపెట్టిన రిజర్వేషన్‌కు పార్టీ కట్టుబడి ఉంది, ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఈకారణంగానే 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియం’లో ప్రతిపాదించినట్లుగా మహిళా రిజర్వేషన్‌ను జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకించినప్పటికీ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి, రాజ్యాంగలోని 108వ సవరణకు మత్దతునిచ్చామని పేర్కొంది. అదే సమయంలో ఈ అనుసంధానంతో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు, 2029 ఎన్నికల్లో కూడా మహిళలు ప్రయోజనం పొందలేరని అప్పుడే హెచ్చరించామని పొలిట్‌బ్యూరో తెలిపింది. రెండేళ్లయినా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను నియమించలేదు, జనగణన చేపట్టలేదని పేర్కొంది.
ప్రతిపక్ష పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండా మోడీ ప్రభుత్వం మరోసారి కొత్త ప్రతితపాదనలతో ముందుకు వచ్చిందని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పదేపదే డిమాండ్లు వచ్చినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం ఆక్షేపణీయం, అంగీకారయోగ్యం కాదని తెలిపింది. తాజా ప్రతిపాదన మహిళా రిజర్వేషన్‌ను మరో కొత్త అంశంతో ముడిపెడుతోందని, 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని, దీని ద్వారా పార్లమెంట్, అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచేందుకు మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోందని మండిపడింది. ఇది పలు సమస్యలను లేవనెత్తుతోందని, వీటిని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దలేమని, అన్ని రాష్ట్రాలతోనూ చర్చలు, సంప్రదింపులు చేపట్టడం తప్పనిసరని హెచ్చరించింది.
సీట్ల సంఖ్య పెంపు వల్ల ఎదురయ్యే పర్యవసానాల దృష్ట్యా రాజకీయ పార్టీలు, రాష్ట్రాలతో విస్తృత చర్చలు జరిపే వరకు ఈ ప్రతిపాదనను నిలిపివేయాలని సిపిఐ(ఎం)డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్లను జనగణన, పునర్విభజన ప్రక్రియల నుండి వేరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని స్పష్టం చేసింది. దీంతో 2029 సార్వత్రిక ఎన్నికల నుండే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యమవుతుందని పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది. ఈ సవరణ చేపట్టడంలో మోడీ ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి కొరవడిందని మండిపడింది.



