నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఎదురెదురు ఇండ్లలో ఉండే సంతోష్, గంగోత్రి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి కూడా చేసుకున్నారు. దసరా పండుగ కావడంతో ఈ నెల 2వ తేదీన దంపతులిద్దరూ గంగోత్రి ఇంటికి వెళ్లారు. అక్కడ మాంసం కూరలో కారం ఎక్కువైందని గంగోత్రిని సంతోష్ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి.. అదే రోజు రాత్రి అత్తారింటికి వెళ్లాక దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమించి పెళ్లిచేసుకున్న అమ్మాయి తన కారణంగానే తనువు చాలించిందని సంతోష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మనసు బాగోలేకపోవడంతో దీపావళి పండక్కి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉండే తన అక్క దగ్గరకు వెళ్లాడు. అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ కూడా నెలలోపే మరణించడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.