Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంభద్రాద్రి జిల్లాలో రిజర్వాయర్లు లేకుండా చేస్తారా?

భద్రాద్రి జిల్లాలో రిజర్వాయర్లు లేకుండా చేస్తారా?

- Advertisement -

– ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లా రైతాంగానికి అన్యాయం
– కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణాలు..ముఖ్యమంత్రి స్పందించాలి
– సాగునీటి సాధనకు మరో ఉద్యమం చేద్దాం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి, పోతినేని
– జిల్లాకు గోదావరి జలాల సాధన కోసం కొత్తగూడెంలో భారీ ప్రదర్శన, సభ
నవతెలంగాణ-కొత్తగూడెం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ భద్రాద్రి జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శనివారం సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని, పాత డిజైన్‌ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ కొత్తగూడెం పాతబస్‌ డిపో నుంచి పద్మశాలి కళ్యాణ మండపం వరకు వందలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సులో జూలకంటి మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో రిజర్వాయర్లు లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తున్నారే తప్పా, సాగు, తాగు నీటి కోసం కాదని అన్నారు. ప్రాజెక్టు కోసం సాగు భూములు ఇచ్చిన రైతులకే సాగునీరు ఇవ్వకుండా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్లు ఎవరి ప్రయోజనం కోసం మారుస్తున్నారని, మంత్రి భూముల కోసం జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్‌ మార్చడం వల్ల జిల్లాలో నిర్మించాలనుకున్న రిజర్వాయర్లు లేకుండా పోయాయని, ఇది జిల్లా ప్రజలకు చేసిన తీవ్ర అన్యాయమని అన్నారు. జిల్లా రైతాంగం రాజకీయాలకతీతంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి పాత డిజైన్‌ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పోతినేని మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అన్యాయం జరుగుతుంటే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల సాధన కోసం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో మహాప్రస్థానం పేరుతో వందరోజులు 2600 కి.మీ పాదయాత్ర చేశామని గుర్తుచేశారు. పోతినేని సుదర్శన్‌ నాయకత్వంలో మహారైతు పాదయాత్ర చేశామని తెలిపారు. తలాపునే గోదావరి పోతుంటే జిల్లా రైతులు సాగు నీరు లేక అవస్థలు పడుతున్నారని, సీపీఐ(ఎం) సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందన్నారు. సీతారామ ప్రాజెక్టు వచ్చిందని సంతోషపడ్డ ప్రజలకు మిగిలింది విషాదమేనని అన్నారు. డిజైన్‌ మార్చి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకోవద్దని, సాగునీటి సాధనకు మరో ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న చెరువులన్నింటికీ సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలను పూర్తి చేయాలని, జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా తరలిస్తే చూస్తూ ఊరుకోమని, జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్‌ ధర్మ, కొండపల్లి శ్రీధర్‌, ఎస్‌ఏ నబీ, గడ్డం స్వామి, నిమ్మల వెంకన్న, భూక్యా రమేష్‌, కొండబోయిన వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, యాసా నరేష్‌, సత్రపల్లి సాంబశివరావు, మోరంపూడీ శ్రీనివాసరావు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -