నవతెలంగాణ -హైదరాబాద్
హాజరు శాతం నిబంధనల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. యూనివర్సిటీ నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేవని స్పష్టం చేసింది. పరీక్షలు రాయడానికి అవసరమైన హాజరు శాతం నిర్ణయాన్ని యూనివర్సిటీలు రూపొందిస్తాయనీ, ఇంజినీరింగ్ కోర్సు సాంకేతిక వ్యవహార అంశమని పేర్కొంది. ప్రాక్టికల్, థియరీ తరగతుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిబంధనలు రూపకల్పన ఉంటుందని అభిప్రాయపడింది. సాధారణంగా 75 శాతం హాజరు అవసరమనీ, అనారోగ్యం, క్రీడలు, ఎన్సీసీ వంటి ప్రత్యేక పరిస్థితుల్లో 10 శాతం మినహాయింపు వరకే అవకాశం ఉంటుందని తెలిపారు. దానికి మించి అనుమతించేందు వీల్లేదనే నిబంధనలను గుర్తు చేసింది. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థిని పరీక్షలకు అనుమతిస్తూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. హాజరు తక్కువగా ఉన్న విద్యార్థి నిర్ధిష్ట విద్యా సంవత్సరంలోగా సెమిస్టర్ పూర్తి చేయాల్సిందేనని వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన కె. మాన్విత అనారోగ్యంతో హాజరు శాతం తక్కువగా ఉన్న కారణంగా బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలని సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గీతాంజలి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఇలాంటివి అనుమతిస్తే విద్యార్థులందరూ ఇదే తరహా అభ్యర్థనలతో కాలేజీకి రాకుండా పరీక్షలకు అనుమతించాలని కోర్టులకు వస్తారని తెలిపారు. ప్రస్తుత పిటిషనర్‌తో పాటు హాజరు తక్కువగా ఉన్న మరో అయిదుగురిని పరీక్షలకు అనుమతించలేదన్నారు. విద్యార్థి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అనుమతించాలని కోరారు. మేఘాలయ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని నిర్ధిష్ట కారణాలతో కాలేజీకి వెళ్లలేకపోయిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, జీవితంలో ఎన్నో ఒడిదుడికలు ఎదురౌతుంటాయనీ, అనేక అడ్డంకులు వస్తుంటాయని పేర్కొంది. వాటిని దీటుగా ఎదుర్కొని పరీక్షలకు హాజరుకాలేకపోతే ఎలాగని ప్రశ్నించింది. యుపీఎస్సీ తదితర పోటీ పరీక్షల్లో కూడా మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులు కాలేనివారు చాలా మందే ఉంటారనీ, ఆ తర్వాత ప్రయత్నాలు చేసి అగ్రస్థానంలో నిలిచిన వారు ఉన్నారని గుర్తు చేసింది. అనారోగ్యం కారణంగా విద్యార్థిని పరీక్షలకు అనుమతిస్తే రేపు మరొకరు ఇలాగే ప్రత్యేక కారణాలతో కాలేజీ, యూనివర్సిటీ నుంచి వచ్చే అవకాశం ఉండే ప్రమాదం లేకపోలేదని ఎత్తిచూపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే జనవరి నుంచి ప్రారంభమయ్యే మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో జూనియర్ విద్యార్థులతోపాటు చదవాలని స్పష్టం చేసింది.
మైనర్‌కు గర్భస్రావ అనుమతికి హైకోర్టు నిరాకరణ
బాలికకు గర్భస్రావం చేయడానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ అరుదైన కేసును జస్టిస్ నగేష్ భీమపాక విచారించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, తన కుమార్తెకు గర్భస్రావం చేయడానికి నిలోఫర్ ఆస్పత్రి వైద్యులకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ (సవరణ) యాక్ట్-2021 ప్రకారం బోర్డును ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ జులై 22న నివేదిక సమర్పించారు. బాలిక ఏడో నెల(28 వారాలు) గర్భాన్ని తొలగిస్తే ఆమె ప్రాణాలకు ముప్పు ఉంటుందని నిలోఫర్ మెడికల్ బోర్డు స్పష్టం చేసింది. బాలిక గర్భంలో ఉన్న కవలల వయస్సు ట్విన్-27 వారాలు, ట్విన్ -25 వారాలుగా ఉందని పేర్కొంది. గర్భస్రావం వల్ల బాలిక ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. బాలిక ఆరోగ్య భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు. ఆమెను ప్రసవం వరకు డిశ్చార్జ్ చేయకుండా నిత్య వైద్య పర్యవేక్షణలో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే, మహిళా, శిశు సంక్షేమ, పోలీసు శాఖల సమన్వయంతో సఖి కేంద్రం సహాయం పొందాలని సూచించారు. విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేశారు.
నందగిరి హిల్స్ నిర్మాణాలపై హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశం
హైదరాబాద్‌లోని షేక్‌పేట, నందగిరి హిల్స్ ప్రాంతాల్లో నెట్‌నెట్ వెంచర్స్ సంస్థ చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని బెంచ్ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. నందగిరి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సర్వే నెంబర్లు 3/2, 4/7, 7/పి, 403/10 ఎస్(కొత్త సర్వే నెంబర్ 120)లోని 4.69 ఎకరాల్లో అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపింది. అగ్నిమాపక, ఎయిర్‌పోర్ట్ అథార్టీల నుంచి ఎన్‌ఓసీలు, మున్సిపల్ శాఖ అనుమతులు పొందిన విషయాలపై లోతైన విచారణ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన అమ్రపాలి, 2024 అక్టోబర్ 9న ఏపీ కేడర్‌లో చేరిన తరువాత రోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఉపసంహరణకు లేఖ రాశారు. అయితే, ఆమె కమిషనర్‌గా ఉన్న సమయంలో రెండు సార్లు ఇచ్చిన ఉత్తర్వుల్లో విజిలెన్స్ నివేదిక ప్రస్తావన లేకపోవడం గమనార్హం. 2024 మార్చిలో నందగిరి హిల్స్ సొసైటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ శాఖ, నెట్‌నెట్ వెంచర్స్ నిర్మాణాలపై విచారణ జరిపి, అనుమతులకు భిన్నంగా నిర్మాణాలున్నాయని నివేదికలో పేర్కొంది. ఆ నివేదికను నెట్‌నెట్ వెంచర్స్ సవాల్ చేయకపోవడంతో అదే అంతిమంగా పరిగణించబడింది. సంస్థ తరఫున సీనియర్ అడ్వకేట్ డి. ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, విజిలెన్స్ సిఫార్సుల మేరకు నిర్మాణాల్లో సవరణలకు అనుమతించాలని కోరారు. హైకోర్టు, గతంలో జారీ చేసిన స్టేటస్‌కో ఉత్తర్వులు, హైదరాబాద్ సివిల్ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ ఆరోతేదీకి వాయిదా వేసింది.
విద్యార్థుల హాజరు శాతం నిబంధనల్లో జోక్యం చేసుకోం : హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES