Saturday, May 10, 2025
Homeరాష్ట్రీయంరిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించరా?

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించరా?

- Advertisement -

– ఆలస్యంపై హైకోర్టు ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రాట్యుటీతో పాటు పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు జాప్యం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సకాలంలో చెల్లించకపోవడంతో పదవీ విరమణ చేసిన వారి సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్థికంగా సమస్యలున్నాయని చెప్పడానికి నిరదర్శమని చెప్పింది. చెల్లింపులో జాప్యానికి కారణాలు ఏవైనా కావచ్చనీ, అయితే ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని అభిప్రాయపడింది. ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పింది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఉచిత పథకాలపై పునరాలోచన చేయాలని సూచించింది. ఉచిత పథకాల వల్ల ఎదురయ్యే సమస్యలను కూడా పరిశీలించాలని కోరింది. ఇది విధాన నిర్ణయం కాబట్టి సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేదనీ, తాము కూడా ఉత్తర్వులు ఇవ్వడం లేదని పేర్కొంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ప్రభుత్వం ఇవ్వలేదంటూ రిటైర్డు ఏ.ఈ ఎ.నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారించారు., ఎలాంటి మచ్చ లేకుండా పిటిషనర్‌ 40 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారని లాయర్‌ చెప్పారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, ఆర్థిక సమస్యలు ఉన్నమాట నిజమేననీ, చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. వాదనల తర్వాత న్యాయమూర్తి పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యంపై రోజు రోజుకు పెరుగుతున్న పిటిషన్లను పరిశీలిస్తే ఆందోళన కలుగుతోందన్నారు. నిర్ధిష్ట కాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌లపై విచారణను మూసివేస్తున్నా రోజు రోజుకు పెరుగుతున్న పిటిషన్‌లను చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ పరిస్థితు ల్లో కొన్ని వ్యాఖ్యలు చేయకుండా ఉండలేకపోతున్న ట్టు చెప్పారు. గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు దానం కాదని వ్యాఖ్యానించారు. పదవీ విరమణ కోసం దాఖలవుతున్న పిటిషన్‌లపై విచారణ సందర్భంగా ఉచిత పథకాల పేరుతో నిధులను మళ్లిస్తున్నట్టు లాయర్లు చెబుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ విధాన నిర్ణయాల పరిధిలోకి వస్తాయని చెప్పారు. దీనిపైఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని పేర్కొన్నారు. పిటిషనర్‌కు పదవీ విరమణ ప్రయోజనాలను రెండున్నర నెలల్లోపు చెల్లించాలని ఆదేశించారు. పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తిరిగి సర్వీసులోకి తీసుకోండి
ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (ఏపీవీసీసీ)కి చెందిన ఏడుగురు దృష్టిలోపం ఉన్న ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. రెండు దశాబ్దాల క్రితం చేరిన ఉద్యోగులకు వయస్సు నిర్ధారణ పరీక్షల ద్వారా 2012లో నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబట్టింది. ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ వారిని సర్వీసులోకి తీసుకోవడంతోపాటు తదనంతర ప్రయోజనాలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 1988, 1990ల మధ్య కాలంలో వికలాంగుల కోఆపరేటివ్‌ సంస్థలో చేరిన తమను ఉస్మానియా ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం నిర్వహించిన వయస్సు నిర్ధారణ పరీక్ష ద్వారా ఆగస్టు 2012లో తొలగించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.మల్లేష్‌, ఇతరులు 2017లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నగేష్‌ భీమపాక ఇటీవల పైవిధంగా తీర్పు చెప్పారు. నోటీసు కూడా ఇవ్వకుండా వారికి వైద్య పరీక్షలు చేసి ఉద్యోగాల నుంచి తొలగించడం చెల్లదన్నారు. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా, వైద్య పరీక్షలపై వివరణ తీసుకోకుండా ఉద్యోగులను తొలగించడం చెల్లదన్నారు. తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వారికి రావాల్సిన వేతన బకాయిలతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -