నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ శాఖ మందుబాబులకు షాకిచ్చింది. ఈనెల 13వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజులపాటు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం షాపులు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాలతో హైదరాబాద్ సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్ పల్లి, మహంకాళి, రామ్ గోపాల్ పేట్, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులు రెండ్రోజులు మూతపడనున్నాయి.
ఈ ఆదివారం బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లో పటిష్ట బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. నాలుగు రోజుల ముందు నుంచే పోలీసులు గస్తీ పెంచారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక ఉజ్జయిని మహంకాళి బోనాల్లో కీలక ఘట్టం భవిష్యవాణి. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి చెప్పే భవిష్యవాణి నిజమవుతుందని భక్తుల నమ్మకం. ఈ రంగం చూసేందుకే భక్తులు ఆలయానికి తరలివస్తారు.