నవతెలంగాణ హైదరాబాద్: భర్త నుంచి విడాకులు కోరిన ఒక మహిళ భరణంగా భర్త నుంచి రూ.12 కోట్లు, ముంబయిలో ఇల్లు, ‘బీఎండబ్ల్యూ’ కారు కావాలని డిమాండ్ చేయడంతో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన సీజేఐ జస్టిస్ గవాయ్ మహిళ డిమాండ్‌ను విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి, సొంతంగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదని సీజేఐ సదరు మహిళకు సూచించారు.
పెండ్లి అయ్యి 18 నెలలు మాత్రమే అయ్యాయని అప్పుడే విడాకులు తీసుకునే వారు ‘బీఎండబ్ల్యూ’ కారు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. ఎందుకు మీరు ఉద్యోగం చేసి అవన్నీ సంపాదించుకోకూడదని మహిళను ప్రశ్నించారు.
దానికి ఆమె బదులిస్తూ..తన భర్త ధనవంతుడని తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నందుకు అతడే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని తెలిపింది. వైద్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతుందనే కారణంతోనే భరణం అడుగుతున్నట్లు వివరించింది.
తన బిడ్డను కూడా తనకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో గతంలో ఉద్యోగం మానేశానని పేర్కొంది. వాదనలు విన్న సీజేఐ.. భరణంగా భర్త నుంచి ముంబయిలో ఇల్లు, రూ.4 కోట్ల నగదు ఇప్పిస్తామని.. బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగం చేసుకోవాలని మహిళకు సూచించారు. కేసుపై ఆర్డర్‌ను రిజర్వ్ చేశారు.