Friday, July 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలు ఆత్మగౌరవంతో జీవించాలి

మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలి

- Advertisement -

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మహిళలే 10 మందికి ఉపాధి కల్పించాలి: మంత్రి సీతక్క
జిల్లాలో త్వరలో ఐటీ హబ్‌ ప్రారంభిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
పెద్దపల్లిలో వడ్డీలేని రుణాలు, లోన్‌, బీమా చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-పెద్దపల్లి
మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలో జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ(సీతక్క), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో కలిసి బుధవారం మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్‌ బీమా, ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తు న్నామని తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్‌ పంపులు, ధాన్యం కొనుగోలు, రైస్‌ మిల్లులు వంటి అనేక వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా అందించే రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీదే మంజూరు చేస్తుందన్నారు. వడ్డీ లేని రుణాలను ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించిందని అన్నారు. సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు జమ చేశామని, రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచి 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేశామని తెలిపారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంథని, కాల్వ శ్రీరాంపూర్‌ మండలాల్లో మహిళా సంఘాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరతో మహిళల ద్వారా కొనుగోలు చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు పెద్దపల్లి పట్టణంలో వీ-హబ్‌ మంజూరు చేశామని, మరో నెల రోజుల్లో దీనిని ప్రారంభిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన చర్చలు జరిపి గోదావరి, కృష్ణా నది జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు, వాటిని పూర్తి స్థాయిలో వినియోగిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘అందుకున్న విజయం అందరికీ పంచుదాం’ అనే నినాదంతో మహిళా సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ వికలాంగ సంఘం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘా లకు అందించిన రుణాలను 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని, బ్యాంకులు నేడు మహిళా సంఘాలకు క్యూకట్టి రుణాలు అందిస్తున్నాయని అన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ వంటి వివిధ వ్యాపారాలు చేయడం వల్ల నెలకు మహిళలకు అదనపు ఆదాయం లభిస్తోందన్నారు. మహిళా సంఘాలు వారికి అందే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించా లని సూచించారు. సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్ప నూనెతో లడ్డూలు తయారు చేసి పంపిణీ చేస్తే ప్రధానమంత్రి సైతం ‘మన్‌ కీ బాత్‌’లో పొగిడారని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు డ్రోన్‌ వ్యాపారం కూడా చేస్తున్నాయని, మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సెర్ఫ్‌ సీఈఓ డి.దివ్య, జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్‌ సింగ్‌రాజ్‌ ఠాకూర్‌, అదనపు కలెక్టర్లు పి.వేణు, జె.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్‌ అధికారులు బి.గంగయ్య, సురేష్‌, జెడ్పీ సీఈఓ నరేందర్‌, డిఆర్డీఓ ఎం.కాళిందిని, డీనీఓ వీర బుచ్చయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అన్న ప్రసన్నకుమారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -