– తీసుకున్న రుణాలను 98.6 శాతం చెల్లించడం గొప్ప విషయం
– మహిళా సంఘాల తరఫున బ్యాంకులకు మేం గ్యారెంటీ ఇస్తున్నాం
– సెర్ప్‌వార్షిక ప్రణాళిక విడుదలలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలోనూ, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ కొనియాడారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న పెద్దపెద్దోళ్లు ఎగ్గొడుతుంటే మహిళా సంఘాల సభ్యులు మాత్రం 98.6 శాతం తిరిగి చెల్లించడం గొప్ప విషయమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సెర్ప్ వార్షిక ప్రణాళిక 2025-26ను ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎమ్‌డీ విద్యాసాగర్‌రెడ్డి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..మహిళా ఆర్థిక సాధికారతకు ఆలంబనగా నిలుస్తున్న సెర్ప్ బ్యాంకు లింకేజీ వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అదనంగా గతేడాది రూ. 5 వేల కోట్ల రుణాలను ఇప్పించామని తెలిపారు. ఇది మహిళా సంఘాల చరిత్రలో ఒక రికార్డు అని చెప్పారు. యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకారం ఉండాలని కోరారు. ఎస్‌హెచ్‌జీలు 98.5 శాతం లోన్లను రీపే చేసి రికార్డు సృష్టించాయని తెలిపారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు రుణాలు ఎగవేస్తున్నాయనీ, స్వయం సహాయక సంఘాలు మాత్రం నిజాయితీగా చెల్లిస్తున్నాయని చెప్పారు. అయినప్పటికీ మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు భయపడటం సరిగాదన్నారు. మహిళా సంఘాల తరఫున బ్యాంకులకు తాము గ్యారెంటీ ఉంటామని హామీనిచ్చారు. ఎస్‌హెచ్‌జీలు స్వయం ఉపాధి నుంచి పదిమందిక ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీలో మహిళల భాగస్వామ్యం 40 శాతం ఉందనీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది 18 శాతమే ఉందని గుర్తుచేశారు. సంపద సృష్టిలో మహిళల పాత్ర పెంచేలా బ్యాంకర్లు, ప్రభుత్వం పనిచేయాలని కోరారు. లోన్ తిరిగి కట్టలేని మహిళా సభ్యులకు ప్రభుత్వం రెండు లక్షల లోన్ బీమా తీసుకొచ్చిందనీ, లోన్ బీమా స్కీం బ్యాంకులకు ధీమాగా నిలుస్తోందని చెప్పారు. గతేడాది మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడంలో టార్గెట్ రీచ్ అయిన బ్యాంకర్లను మంత్రి సీతక్క ప్రత్యేకంగా సన్మానించారు.
ఆదర్శంగా మహిళా సంఘాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES