Tuesday, April 29, 2025
Homeమానవిరోద‌సిలోకి మ‌హిళ బృందం

రోద‌సిలోకి మ‌హిళ బృందం

అది ఏప్రిల్‌ 14, 2025… ఒక చారిత్రాత్మక ప్రయోగాన్ని తిలకించేందుకు చాలా మంది అక్కడ గుమ్మిగూడారు. అదే ఆరుగురు మహిళలతో కూడిన బృందం ఇటీవల రోదసిలోకి ప్రయాణించే సమయం. ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి. ఈ ఆరుగురు ఎంతో ఉత్సాహంగా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకున్నారు. వీరు ప్రయాణించిన న్యూ షెపర్డ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ పైలట్‌ లేకుండానే పని చేస్తుంది. సబ్‌ ఆర్బిటల్‌ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణిలకును తీసుకెళ్లే సామర్థ్యం మాత్రమే వుంది. ఈ బృందం సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్‌ రేఖను దాటి వచ్చింది.

బ్లూ ఆరిజన్‌ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్‌ వ్యోమనౌక ఎన్‌.ఎస్‌-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్‌ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్‌ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. మొత్తం ఆరుగురు మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరిలో శాంచెజ్‌తో పాటు అమెరికన్‌ గాయని కేథీ పెర్రీ, ప్రముఖ జర్నలిస్టు గేల్‌ కింగ్‌, చిత్ర నిర్మాత కెరియాన్‌ ఫ్లిన్‌, అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాలో ఇంజినీర్‌గా పనిచేసి, ఆ తర్వాత సైన్స్‌ విద్యను ప్రోత్సహించడానికి సొంత కంపెనీలను ప్రారంభించిన అయిషా బోవ్‌, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపై పరిశోధనలు చేసిన అమండా ఎంగుయెన్‌ ఉన్నారు. ఈ ప్రయాణంలో వీరంతా గాలిలో తేలిపోయిపోతున్నట్టుగా అనుభూతి పొందారు. క్యాప్సూల్‌కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదించారు.


లారెన్‌ సాంచెజ్‌
ప్రముఖ జర్నలిస్ట్‌ అయినటు వంటి లారెన్‌ సాంచెజ్‌ 1969లో న్యూ మెక్సిలోని అబ్బుకెర్కీలో పుట్టారు. ఏవియేషన్‌ వ్యాపారవేత్త రే సాంచెజ్‌, లాస్‌ ఏంజిల్స్‌ మాజీ అసిస్టెంట్‌ డిప్యూటీ మేయర్‌ ఎలియనోర్‌ సాంచెజ్‌ ఈమె తల్లిదండ్రులు. 1987లో పాఠశాల విద్య పూర్తి చేసి న్యూ మెక్సికో విశ్వవిద్యాలయంలో యాక్టింగ్‌ కోర్సును పూర్తి చేశారు. తర్వాత ఎల్‌ కామినో కాలేజీలో చేరారు. అక్కడ ఒక ప్రొఫెసర్‌ ఆమెలోని అభ్యాస మార్పులు గమనించి డైస్లెక్సియా ఉన్నట్టు గుర్తించారు. తర్వాత ఆమె ఎంతో పోరాటం చేశారు. తన జీవితాన్ని తనే ప్రేరణగా తీసుకున్నారు. ఈ రోగ నిర్ధారణ తర్వాత ఆమె అంతర్జాతీయ డైస్లెక్సియా అసోసియేషన్‌కు సహకరించేందుకు, రోగులకు విద్యలో సహాయం చేసేందుకు సహాయం చేస్తున్నారు. 1990లో ఆమె అంతర్జాతీయ మోడల్స్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ కవర్‌ గర్ల్‌ పోటీని గెలుచుకున్నారు. ఓ టీవీలో డెస్క్‌ అసిస్టెంట్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. అలాగే యాంకర్‌, రిపోర్టర్‌గా కూడా పని చేశారు. తన 40 ఏండ్ల వయసులో ఆమె విమానయానం నేర్చుకుని పైలెట్‌ లైసెన్స్‌ పొందారు. తర్వాత బ్లాక్‌ ఆప్స్‌ ఏవియేషన్‌ను స్థాపించారు. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహించబడుతున్న మొదటి ఏరియల్‌ ఫిల్మ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ. అంతే కాదు ఆమె 2024లో పిల్లల కోసం మొదటి పుస్తకం ‘ది ప్లై హూ ఫ్లూ టు స్పేస్‌’ రచించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌గా ఇది నిలిచింది.
కెథీ పెర్రీ
కాలిఫోర్నియాకు చెందిన ఈమె ప్రముఖ పాప్‌ సింగర్‌, పాటల రచయిత. ఆల్‌ టైం బెస్ట్‌ సెల్లింగ్‌ మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌లలో పాప్‌ స్టార్‌ కెథీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్‌ రికార్డ్‌లు బ్రేక్‌ చేసింది. 13 గ్రామీ అవార్డ్‌లకు కేథీ నామినేట్‌ అయ్యారు. బిల్‌బోర్డ్‌ ‘విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2012’ అవార్డ్‌ సైతం అందుకున్నారు. ‘ఫైర్‌ వర్క్‌ ఫౌండేషన్‌’ మొదలుపెట్టి యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అండాసిడర్‌గా సేవలు అందిస్తున్నారు. చిన్నతనం నుండి ఈమె చర్చిలో పాటలు పాడుతుండేవారు. 16 ఏండ్ల వయసులో ఆమె తన పాటలను రికార్డ్‌ చేయడం ప్రారంభించారు.
అయిషా బోవ్‌
యునైటెడ్‌ స్టేట్స్‌లో కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగారు ఆయిషా బోవ్‌ నాసా మాజీ రాకెట్‌ శాస్త్రవేత్త. మిచిగన్‌ యూనివర్సిటీ నుండి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్పేస్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పని చేసే ‘స్టెమ్‌ బోర్డ్‌’ అనే ఇంజనీరింగ్‌ కంపెనీకి ఆయేషా సీఈవోగా ఉన్నారు. ఈమె నాసా ఈక్వల్‌ ఎంప్లారుమెంట్‌ ఆపర్చునిటీ మెడల్‌, యూఎస్‌ ఉమెన్స్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎమర్జింగ్‌ స్టార్‌ అవార్డు, వర్జీనియా బిజినెస్‌ మ్యాగజైన్‌ వారి బ్లాక్‌ బిజినెస్‌ లీడర్స్‌ అవార్డులు పొందారు.
అమండా ఎం గుయెన్‌
ఈమె ఒక అమెరికన్‌ సామాజిక కార్యకర్త. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు. హార్వర్డ్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌లో పని చేశారు. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన ఈమె నోబెల్‌ శాంతి బహుమతికి నామినెట్‌ అయ్యారు. అంతే కాదు ఆసియా అమెరికన్లపై హింసను ఆపడానికి ఆమె ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఆమె మహిళల ఆరోగ్యం, రుతుస్రావంపై పరిశోధన చేస్తున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌లో శాస్త్రవేత్త వ్యోమగామి సభ్యురాలిగా ఉన్నారు. తొలి వియత్నామీస్‌, ఆగేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో అమండా చరిత్ర సృష్టించారు. ‘సేవింగ్‌ ఫైవ్‌: ఎ మెమోరియల్‌ ఆఫ్‌ హౌప్‌’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేశారు.
కెరియానే ప్లిన్‌
కెరియానే ప్లిన్‌ ఓ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీశారు. హాలీవుడ్‌లో ఆమె తీసిన, ది ఆటోమేటిక్‌ హేట్‌(2015), దిస్‌ చేంజెస్‌ ఎవ్రీ థింగ్‌(2018), లిల్లీ(2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమె తీసే చిత్రాలన్నీ సామాజిక అంశాలకు సంబంధించే ఉంటాయి. ఎన్నో స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. కెరియానేకు మొదటి నుండి అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి ఎక్కువ. 2011లో వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష విమానంలో ప్రయాణించారు. ఈ ఉత్సాహంతోనే ఆమె మళ్లీ అంతరిక్ష ప్రయాణంలో పాల్గొన్నారు.
గేల్‌ కింగ్‌
గేల్‌ కింగ్‌ మేరీల్యాండ్‌లోని చెవీ చేజ్‌లో జన్మించారు. ఆమె తండ్రి ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పని చేశారు. మేరీల్యాండ్‌ యూనివర్సిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్‌ కింగ్‌కు రేడియో, టెలివిజన్‌, ప్రింట్‌ మీడియాలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఈమె రచయిత కూడా. ‘గేల్‌ కింగ్‌ ఇన్‌ ది హౌజ్‌’ అనే రేడియో షోని హౌస్ట్‌ చేశారు. ఉత్తమ రేడియో టాక్‌ షో కోసం ఇచ్చే ‘అమెరికన్‌ ఉమెన్‌ ఇన్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌ గ్రేసి అవార్డ్‌’ను ఆమె సొంతం చేసుకున్నారు. టైమ్‌ మ్యాగ జైన్‌ ‘అత్యంత ప్రభావంతమైన వ్యక్లు జాబితా-2019లో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img