నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో రోజురోజుకు గాలి నాణ్యత పడిపోవడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఇకపై 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని ఆదేశించారు. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఇంటి నుండి పని (వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆదేశించింది.
గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్నందున, చిన్నారులను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వకుండా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు కొన్ని ఆంక్షలు ప్రకటించింది. గ్రాప్-3 ఆంక్షలలో అత్యవసరం కాని నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమలులో ఉంటుంది. ఇందులో పునాది తవ్వడం, కందకాలు తవ్వడం, పైలింగ్, వెల్డింగ్, ప్లాస్టరింగ్, ఇసుక, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రవాణాపై కూడా ఆంక్షలు ఉన్నాయి. అలాగే బీఎస్ III పెట్రోల్, బీఎస్-IV డీజిల్ ఫోర్ వీలర్లను ఢిల్లీ, ఎన్‌సీఆర్ జిల్లాలలో నిషేధించారు.



