– ఆదాయ వనరులు పెంచకుండా పన్నుల భారం పెంచుతున్న కేంద్రం
– సమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-రామాయంపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల మెడలు వంచేలా ఉద్యమాలు నిర్మించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి అధ్యక్షతన రెండవ రోజు ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేటలో సీఐటీయూ జిల్లా మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ముందుగా పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మహేష్ సాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ పథకాలపై కోత విధిస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం దుర్మార్గమన్నారు. నిత్యవసర ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, జీఎస్టీ పేరుతో సామాన్యులపై పన్నుల భారం వేస్తున్నారన్నారు. మన ఆదాయాలు పెంచకుండా, మన సొమ్మును పన్నుల పేరుతో కొల్లగొట్టడం దారుణమన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలో తీవ్రంగా పెరిగిందని, నూటికి 90శాతం మంది అసంఘటిత కార్మికులుగానే ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే, హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. బీడీ కార్మికులు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా జీవనం కోసం ఆ వృత్తిని కొనసాగిస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించక పోవడం దుర్మార్గమమన్నారు.
కుటుంబానికి రూ.178లు ఆదాయం సరిపోతుందని కేంద్రంలోని మోడీ అంటే, ఇక్కడ కార్మికులకు వేతనాలు పెంచాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖండించకుండా తప్పించుకుంటుందని ఆరోపించారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగాల కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు వేసవి సెలవులు కావాలంటే, సెలవులు ఇచ్చామని చెప్తూ జీవోలో మాత్రం, సెంటర్ తెరిచి ఉండాలని తిరకాసు పెట్టారన్నారు. ఆశా వర్కర్లు పోరాడగా పెంచిన వేతనాలను, ఇప్పటికీ వారికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్న నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి, జిల్లా అధ్యక్షకార్యదర్శులు సర్దార్, ఏ.మల్లేశం,ఉపాధ్యక్షులు అన్నపూర్ణ, మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు నాగరాజు, లాహెర్, నాగిరెడ్డి, ఆసిఫ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్లేశం, సంగారెడ్డి సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు పలు రంగాల కార్మికులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES