Friday, May 2, 2025
Homeతాజా వార్తలుకార్మికులూ సంఘటితంగా ఉద్యమించాలి

కార్మికులూ సంఘటితంగా ఉద్యమించాలి

– ఐక్యతను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు
– ప్రొఫెసర్‌ హరగోపాల్‌
– బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ రంగ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మేడే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నెరిపిన చారిత్రాత్మక ఉద్యమం మాదిరిగా కార్మికులూ సంఘటితంగా ఉద్యమించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. ఐక్య ఉద్యమాల ముందు ప్రపంచంలో ఏ శక్తి నిలబడలేదని తెలిపారు. అందుకే రైతు ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ రంగ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయంలో ఎల్‌ఐసీ జోనల్‌ లీడర్‌ జి.తిరుపతయ్య అధ్యక్షతన మేడే ఉత్సవాలు నిర్వహించారు. జెండావిష్కరణ అనంతరం ”నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు- మేడే ప్రాముఖ్యత” అనే అంశంపై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశాన్ని కూడా రైతులు తిప్పికొట్టారని గుర్తు చేశారు. యూనియన్ల ప్రాధాన్యతను తగ్గించాలన్న కార్పొరేట్ల కోరికను తీర్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ముందుకు తెస్తున్నదని తెలిపారు. పాత పెట్టుబడిదారీ విధానానికి భిన్నంగా స్థిరత్వం లేని పెట్టుబడితో ఆర్థికంగా ఎదిగిన వారు ఎక్కువగా ప్రపంచంలో పాలకులుగా మారుతున్నారని ప్రస్తుత పరిణామాలను వివరించారు. వస్తు తయారీతో సంబంధం లేకుండా రియల్‌ ఎస్టేట్‌ లాంటి వాటితో వస్తున్నారని అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ను ఉదహరించారు. ఇలాంటి వారు తీసుకునే నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండటం లేదని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారులంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికీ సంఘటిత రంగంలో మూడు శాతం మంది ఉండగా, అసంఘటిత రంగంలో 97 శాతం మంది ఉన్నారని గుర్తు చేశారు. విశాల ప్రాతిపదికన కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. యూనియన్లు కేవలం వర్కర్ల హక్కుల సాధన కోసమే పరిమితం కాకుండా ప్రజల దుస్థితికి – పాలకుల విధానాలకు మధ్య ఉన్న సంబంధాలపై ప్రజలను చైతన్యం తెచ్చే దిశగా కృషి చేయాలని కోరారు. పోరాట ఫలితంగా వచ్చిన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన పరిస్థితి తిరిగి వచ్చిందని తెలిపారు. సంపద ఒకే దగ్గర కేంద్రీకృతం కావడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకోవచ్చనేందుకు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయమే తార్కాణమని తెలిపారు. కులగణన చేస్తే దేశమే విచ్ఛిన్నం అవుతుందని గగ్గోలు పెట్టిన పాలకులు ఐక్యంగా వచ్చిన డిమాండ్‌కు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దేశంలో ఏదో ఒక చోట ఎన్నికలున్న సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులుంటున్నాయని హిందీ కవి రాసిన కవితను వినిపించారు. ప్రజలపై ఆర్థికంగా, రాజకీయంగా, భావజాలపరంగా మూడు రకాల దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఏర్పడితే వాటిని భర్తీ చేయడం లేదన్నారు. కార్మికులకు హక్కుల్లేకుండా చేస్తున్న ఈ లేబర్‌ కోడ్‌లను ఆపి తీరుతామని హెచ్చరించారు. యూనియన్ల హక్కులపై, ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను చవకగా అమ్మేస్తున్నారనీ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రశ్నించకుండా కులం, మతం, ప్రాంతం, భాష తదితరాల పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము దైవంగా భావించే రాముడిని బీజేపీ రాజకీయ పెట్టుబడిగా భావిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికలకు ముందు అయోధ్య రాముడు, పంజాబ్‌ ఎన్నికలకు ముందు రాం రహీం, గుజరాత్‌ ఎన్నికలకు ముందు ఆశారాం బాపు… ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ఉప యోగించుకుంటుందని మండిపడ్డారు. అనంతరం మే 20న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో 20 రోజుల పాటు నిర్వహించనున్న ఆన్‌లైన్‌ క్విజ్‌ లింక్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఐఈఏ జాయింట్‌ సెక్రెటరీ టీవీఎన్‌ఎస్‌ రవీంద్రనాథ్‌, వెంకట్రామయ్య (బెఫీ), సతీష్‌ (బెఫీ), సుబ్బారావు (జీఐసీ), రవికాంత్‌ (ఆర్బీఐ), నాగేశ్వర్‌ రావు (ఆర్బీఐ), శ్రీనివాస్‌ (యూబీఐ), మహేశ్‌ (నాబార్డ్‌) తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు ఉద్యోగులు చైతన్య గీతాలను ఆలపించారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు వస్తే ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందో వివరించే స్కిట్‌ను ప్రదర్శించి ఆలోచింపజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img