నవతెలంగాణ-హైదరాబాద్ : భారత జట్టు హెడ్ కోచ్‌గా తన తొలి ఐసీసీ ట్రోఫీని గెలిచిన గౌతమ్ గంభీర్ ఈ చారిత్రక విజయాన్ని ఇద్దరు దిగ్గజాలకు అంకితమిచ్చాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లకు ఈ కప్‌ను అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో తన కష్టకాలంలో అండగా నిలిచిన ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడారు. “భారత జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచినందుకు రాహుల్ భాయ్‌కు, భవిష్యత్ తారలను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్‌కు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నా” అని ఆయన పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిజాయితీతో పనిచేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను కూడా ప్రశంసించాడు.
తన కోచింగ్ కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశ ఎదురైనప్పుడు జై షా తనకు ఎలా ధైర్యం చెప్పారో గంభీర్ గుర్తుచేసుకున్నారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయినప్పుడు తానెంతో కుంగిపోయానని, ఆ సమయంలో జై షా ఫోన్ చేసి తనపై నమ్మకం ఉంచారని గంభీర్ తెలిపాడు. ఆ నమ్మకమే ఈ విజయానికి కారణమని ఆయన పరోక్షంగా వెల్లడించాడు.
“మన దేశంలో వ్యక్తిగత మైలురాళ్లను ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. కానీ ట్రోఫీలే ముఖ్యం. ఆ మార్పు కోసమే నేను పనిచేస్తున్నా” అని గంభీర్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ పటిమ తన పనిని సులభతరం చేసిందని కొనియాడాడు.



