గాజా : దక్షిణ గాజా స్ట్రిప్‌లోని నాసర్ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు మరణించగా, సుమారు 30 మంది గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సర్జికల్ వార్డులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉన్న భవనంపై రెండు క్షిపణులు పడ్డాయని, అయితే వాటిలో ఒక క్షిపణి పేలలేదని ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. నాసర్ మెడికల్ కాంప్లెక్స్ ఖాన్ యూనుస్ నగరంలో ఉంది . ఇది దక్షిణ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి, ఇది దాదాపు పది లక్షల మందికి సేవలు అందిస్తోంది. ఇజ్రాయిల్ దాడిలో వైద్య సిబ్బంది, రోగులు, వారి సహచరులు మరణించారని, మృతులలో సర్జన్ డాక్టర్ రిజ్క్ అబు షైరా కూడా ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని "అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల దారుణ ఉల్లంఘన"గా అది ఖండించింది. తమ దళాలపై దాడులకు ప్రణాళికలు రచించడానికి ఆస్పత్రిని 'ప్రధాన కార్యాలయం'గా ఉపయోగించుకున్న హమాస్ సాయుధ విభాగపు కమాండర్‌ను, ఇతర యోధులను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ' యుద్ధ నేరాన్ని కప్పిపుచ్చుకునే బరితెగించిన ప్రయత్నంలో' ఇజ్రాయిల్ 'తప్పుడు కథనాలను' వ్యాప్తి చేస్తోందని హమాస్ పేర్కొంది.అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆస్పత్రులకు రక్షిత హోదా ఉంది, కానీ గాజా యుద్ధ సమయంలో అవి పదేపదే లక్ష్యంగా చేసుకున్నాయి.
ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-ఫారా మాట్లాడుతూ, ఇజ్రాయిల్ దళాలు అల్-యాసిన్ సర్జరీ భవనంపై రెండు క్షిపణులను ప్రయోగించాయని, అయితే అందులో ఒకటి మాత్రమే పేలిందని తెలిపారు.
"నాసర్ మెడికల్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ దాడి ప్రధానంగా ఆరోగ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ వైద్యులు, పౌరులు, రోగులు ఉన్నారు," అని ఆయన వివరించారు. మరణించిన వారిలో సర్జన్ డాక్టర్ రిజ్క్ అబు షైరా కూడా ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.





కామెంట్‌లు (0)