Friday, May 16, 2025
Homeసినిమారచయిత బి.కె.ఈశ్వర్‌ కన్నుమూత

రచయిత బి.కె.ఈశ్వర్‌ కన్నుమూత

- Advertisement -

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌, సినీ రచయిత బి.కె.ఈశ్వర్‌ (77) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఈశ్వర్‌ హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్న సమయంలోనే సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. తనకున్న అవగాహనతో మద్రాస్‌కు చేరి, విజయచిత్ర పత్రికలో రెండు దశాబ్దాల పాటు ఉప సంపాదకునిగా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే పూణె ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్‌ అప్రిసియేషన్‌ కోర్స్‌ చేశారు. 1998 నుండి 2002 వరకూ ఈటీవీలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా సేవలు అందించారు. ఈటీవీ, తేజ టీవీలకు పలు సీరియల్స్‌ రాశారు. ఆయన రాసిన సీరియల్స్‌ పలు నంది అవార్డులను గెలుచుకున్నాయి. ‘గీతాంజలి’ ఫేమ్‌ గిరిజ నటించిన హృదయాంజలి’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, ‘కాలేజ్‌ డేస్‌ టు మ్యారేజ్‌ డేస్‌’, ‘చీకటిలో నేను’, ‘నగరంలో వినాయకుడు’, ‘సూపర్‌ హిట్‌ జంబో క్రైమ్‌ స్టోరీ’, ‘అజరు పాసయ్యాడు’, ‘నేను – ఆది – మధ్యలో మా నాన్న’ చిత్రాలకు మాటలు, పాటలు అందించారు. సినిమా జర్నలిస్ట్‌గా తన అనుభవాలను బి.కె.ఈశ్వర్‌ ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో 62 వారాల పాటు ‘అనగా అనగా ఒకసారి’ పేరుతో వ్యాసాలుగా రాశారు. వాటిని ‘విజయచిత్ర జ్ఞాపకాలు’ పేరుతో విజయ పబ్లికేషన్స్‌ సంస్థ ప్రచురించింది. ఆంధ్రప్రభ, విశాలాంధ్ర తదితర పత్రికల్లో రాసిన వ్యాసాలతో ‘ఈ దారి ఎక్కడికి?’ అనే పుస్తకం తీసుకొచ్చారు. సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ టూరిజం అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌, శ్రుతిలయ ఆర్ట్స్‌ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి. అలాగే ‘సూపర్‌ మూవీస్‌ అడ్డా’ పేరుతో సొంత యూ ట్యూబ్‌ ఛానెల్‌ను బి.కె.ఈశ్వర్‌ నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గురువారం ఆయన అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. బి.కె.ఈశ్వర్‌ కుమారుడు ప్రేమ్‌ చంద్‌ కూడా దర్శకుడిగా పలు చిత్రాలను రూపొందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -