నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురిసినా వర్షాలకు యుమునా నది పొంగిపొర్లుతోంది. క్రమేణా వరద ప్రవాహాం పెరిగిపోవడంతో యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది నీటి మట్టం ఓల్డ్ రైల్వే బ్రిడ్జికి 207 మీటర్లు పెరిగింది. గతంలో రాజధాని నగరంలో యమునా నీటి మట్టం ఆల్-టైమ్ 208.66 మీటర్ల పెరుగుదలను నమోదు చేసింది.

బుధవారం వరద పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఈక్రమంలో యమునా నదికి సమీపంలోని ఓల్డ్ ఉస్మాన్‌పూర్, ఓల్డ్ గర్హి మెండు రెండు గ్రామాలలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ముంపు బాధిత ప్రజలను పునరావాసా కేంద్రాలకు తరలించడానికి ఢిల్లీ ప్రభుత్వం ముమ్మరం ప్రయత్నాలు చేస్తుంది. కానీ సహాయక కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని బాధితులు వాపోతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా కంటితుడుపుగా నివాసాలు ఏర్పాటు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
