Sunday, May 4, 2025
Homeఎడిట్ పేజినాడు పుల్వామా, నేడు పహల్గామ్‌: మిలటరీకి పూర్తి స్వేచ్ఛంటే ఏమిటి?

నాడు పుల్వామా, నేడు పహల్గామ్‌: మిలటరీకి పూర్తి స్వేచ్ఛంటే ఏమిటి?

- Advertisement -

భారత, పాక్‌ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కర్తవ్యం నిర్వర్తించాల్సిన బలగాలు ఏం చేస్తున్నాయో, ఎలా ఉన్నాయో తెలియదు గానీ టీవీ ఛానళ్లు ఊగిపోతున్నాయి. కొన్ని యుద్ధాన్ని కూడా ప్రారంభించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారి మీద పగతీర్చుకోవాలని దేశమంతా కోరుతోంది. ఈ పూర్వరంగంలోనే ”పహల్గాం దాడిపై ప్రధాని మోడీ పెద్ద సందేశం: సైనిక బలగాలకు ఎప్పుడు, ఎలా తిరిగి దెబ్బకొట్టాలన్న స్వేచ్చ ” ఇది హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2025 ఏప్రిల్‌ 30న పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2019 ఫిబ్రవరి 17న ” తిరిగి దెబ్బ కొట్టేందుకు సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్చ, పుల్వామా ఉగ్రదాడిపై చెప్పిన ప్రధాని మోడీ ” పేరుతో వార్త ఇచ్చింది.ఎలా, ఎప్పుడు, ఎక్కడ హంతకులను, వారిని ప్రోత్సహించిన వారి ఎవరు శిక్షించాలో నిర్ణయించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చామని మహారాష్ట్రలోని పంధకర్‌వాడలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో పుల్వామా దాడి జరిగిన రెండు రోజుల తర్వాత మోడీ ప్రకటించారు. ఇప్పుడు వారం రోజులు వ్యవధి తీసుకున్నారు. రెండింటికీ ఏమిటీ తేడా అంటే నేడు పహల్గాం, నాడు పుల్వామా తప్ప మిలిటరీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ రెండు సందర్భాల్లో ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేమిటో ఎవరైనా చెప్పగలరా ? అసలు మిలిటరీకి పూర్తి స్వేచ్చ అంటే ఏమిటి ? దేశమంతా పాకిస్తాన్‌ మీద నరేంద్రమోడీ యుద్దాన్ని ప్రకటించబోతున్నారని భావిస్తున్నది, కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించినట్లుగా మీడియా యుద్ధం ప్రారంభమైనట్లే చిత్రిస్తున్నది.నాడు బాలాకోట్‌పై మెరుపుదాడి చేశాయి మన బలగాలు, ఇప్పుడేం చేస్తాయో తెలియదు.మన మిలిటరీ మీద 2016 యురి దగ్గర దాడి జరిగినపుడు, ప్రభుత్వం విమానాలు ఇవ్వకుండా 78 బస్సుల్లో పంపినపుడు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై పుల్వామా దగ్గర జరిపిన దాడి సందర్భంగా మన మిలిటరీ మెరుపుదాడులు జరిపింది. ఇప్పుడు కూడా అలాంటి దాడులే జరగవచ్చని భావిస్తున్నారు.లేదూ యుద్ధమే చేస్తారా? తెలియదు.
పైకి ఏమి చెప్పినప్పటికీ మిలిటరీ చెప్పినట్లు పాకిస్తాన్‌లో ప్రభుత్వాలు వినాల్సిందే. లేకపోతే ప్రధానుల ఉద్యోగాలు ఊడతాయి, జైలు పాలవుతారు. కానీ మనదేశంలో అలా కాదు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలిటరీ వ్యవహరించాల్సి ఉంటుంది తప్ప రాజ్యాంగం ప్రకారం తనంతట తాను నిర్ణయాలు తీసుకోవటానికి లేదు. మిలిటరీకి పూర్తి స్వేచ్చ ఇచ్చి నట్లు మోడీ ప్రకటించేశారు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కారు. సామాజిక మాధ్యమంలో మరుగుజ్జుల గంతులు సరేసరి. మంత్రివర్గం ఆమోదించినట్లు గానీ, దీని గురించి ప్రజాస్వామ్య దేవాలయం అని మోడీ స్వయంగా చెప్పి మొక్కిన పార్లమెంటుకు చెప్పాలని గానీ, అందుకు గాను ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గానీ ప్రజాస్వామ్య పుట్టినిల్లు గురించి చెప్పుకొనే వారికి గుర్తు లేదు.అసలు అఖిలపక్ష సమావేశానికే హాజరుగాని ప్రధాని నుంచి ఇలాంటి వాటిని ఆశించటం దురూహే. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌తో సమావేశమైన తరువాత ప్రధాని చేసిన ప్రకటన పార్లమెంటు ఉభయసభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రకటించి ఉంటే మన దేశం ఉగ్రదాడిపట్ల ఎంత సీరియస్‌గా ఉందో లోకానికి తెలిసేది కదా, ఎందుకు ఆ పని చేయలేదు? ఎవరైనా అంత సమయం ఎక్కడుంది, అసలు అవసరమా అని ప్రశ్నించవచ్చు. నిజమే మరణించిన వారి చితిమంటలు ఆరలేదు, ఆప్తుల కన్నీరు ఆగలేదు, మోడీ బీహార్‌ సభకు హాజరు కావటం అవసరమా ? దాడి జరిగింది ఏప్రిల్‌ 22న, ప్రధాని ప్రకటన చేసింది, 29వ తేదీన, పార్లమెంటును పిలవటానికి వారం రోజులు చాలవా? సౌదీ నుంచి ప్రధానే కొద్ది గంటల్లో వచ్చినపుడు ఎంపీలు రాలేరా, ప్రతి రాష్ట్ర రాజధానికి విమానాలు, 24 గంటల్లో వచ్చే రైళ్లు కూడా ఉన్నాయిగా! యావత్‌ దేశాన్ని కుదిపివేసిన ఉదంతం గురించి ప్రజాప్రతినిధుల సభలో చర్చించని ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? పార్లమెంటులో గానీ, మంత్రివర్గంలో గానీ మిలిటరీ ఎక్కడ,ఎలా దాడిచేయాలో పథకాలను వెల్లడించరు, బహిరంగంగా చర్చించరు, ఒక నిర్ణయం మాత్రమే చేస్తారు. దాన్ని అమలు జరిపే మిలిటరీకి పూర్తి స్వేచ్చ ఆ నిర్ణయంలోనే అంతర్భాగంగా ఉంటుంది. ఇన్ని బాంబులే వేయాలి, ఇన్ని రౌండ్లే కాల్చాలి, విమానాలను ఇన్నే వాడాలని, ఇన్ని గంటలు, రోజులు మాత్రమే దాడులు చేయాలని ఏ పార్లమెంటూ, మంత్రివర్గమూ నిర్ణయించదు. కానీ నిర్ణయం కంటే పూర్తి స్వేచ్చ అనే ప్రచార అంశానికి మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంటు నిర్ణయంగా ప్రకటిస్తే మోడీ ప్రత్యేకత ఏముంటుంది?
గుళ్లలో పూజారులను నియమిస్తారు. వారు రోజూ పూజలు ఎలా చేయాలో దేవస్థానం కమిటీ గానీ, ముఖ్యమంత్రి, ఇప్పుడు సనాతన డిప్యూటీలు కూడా వచ్చారు గనుక వారు గానీ మీకు స్వేచ్చ ఇచ్చామని ప్రకటించటం లేదు కదా. ఏ పూజకు, ఏ దర్శనానికి, లడ్డు, ప్రసాదానికి ఎంత అన్న వ్యాపార ధరల నిర్ణయం(వీటికి మాత్రం పవిత్రత ఉండదు) అమలు మాత్రమే చూస్తారు. అలాగే సరిహద్దు భద్రతా దళాలంటూ మనకు ప్రత్యేక విభాగాలే ఉన్నాయి. సరిహద్దులు దాటి అనుమతి లేకుండా ఇతర దేశాలకు చెందిన సాధారణ పౌరులు, చివరకు ఆవులు, గేదెలు పొరపాటున రావటాన్ని కూడా వారు అనుమతించరు, అలాంటిది ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని, మీకు ఈ రోజువరకు స్వేచ్చ నిస్తున్నామని ప్రతిరోజూ ఉదయమే నరేంద్రమోడీ కార్యాలయం ఆదేశాలు జారీ చేస్తుందా ? చేయదు కదా, అది ప్రతిక్షణం వారివిధి. ఎలా చేయాలో స్వేచ్చవారికి ఉంటుంది. అలాంటి విధి నిర్వహణలో నిఘా ఒకటి. దానిలో వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే పహల్గాంలో అమాయకులు బలయ్యారు.ఉగ్రవాదులు సరిహద్దు దాటి రాకుండా లేదా అంతర్గతంగా ఉన్న వారిని నిరోధించాలని వారి మీద అవసరమైతే చర్యలకు స్వేచ్చ ఇచ్చినట్లు, ఉగ్రవాదాన్ని అణచివేయాలని నిర్ణయిం చినట్లు మాత్రమే మోడీ చెప్పారు. అంతే తప్ప దాని కోసం యుద్ధం చేయాలని చెప్పలేదు. శత్రు సైనికులు సరిహద్దులో దాడులకు తెగబడితే తిప్పికొట్టాలని ప్రత్యేకంగా నిర్ణయించి చెప్పాల్సినపని లేదు. అంతే తప్ప యుద్ధాలకు మిలిటరీకి అనుమతి ఉండదు, అవసరమని మిలిటరీ సిఫార్సు చేస్తే మంత్రివర్గం, పార్లమెంటు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. మిలిటరీకి అలాంటి విచక్షణ అధికారాలు ఇస్తే ఏం జరుగుతోందో అనేక దేశాల్లో చూస్తున్నాం. హమాస్‌ సాయుధులను పట్టుకోవాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఆదేశిస్తే అది చేతగాక గాజాలో పిల్లలు, మహిళలను, నిరాయుధులను చంపుతూ ఆసుపత్రా, స్కూలా అనేదానితో నిమిత్తం లేకుండా కనిపించిన ప్రతిభవనాన్ని కూల్చుతున్నారు.
పహల్గామ్‌ దాడి సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఏమన్నాడు ” నేను భారత్‌కు ఎంతో సన్నిహితుడిని, అలాగే పాకిస్తాన్‌కూ ఎంతో దగ్గర.వారు కాశ్మీరు సమస్య మీద వెయ్యి సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుం టున్నారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాల నుంచే ఉండవచ్చు, సరిహద్దుల గురించి 1,500 సంవత్సరా లుగాగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాదదాడి చెడ్డది, భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నవే. ఏదో విధంగా వారే పరిష్కరించుకుంటారు. ఇద్దరు నేతలూ నాకు తెలుసు” అన్నాడు.అదే పుల్వామా దాడి సమయంలో అదే ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు ఏమన్నాడు. మన అజిత్‌ దోవల్‌తో ఫోన్లో మాట్లాడాడు.” జైషే మహమ్మద్‌కు పాకిస్తాన్‌ సురక్షిత స్వర్గంగా ఉండకుండా చూసేందుకు చూస్తామని ” జాన్‌ బోల్టన్‌ చెప్పినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆత్మ రక్షణ చేసుకొనే హక్కు భారత్‌కు ఉందని కూడా చెప్పాడు. ఇప్పుడు ఇద్దరూ కావాలని, వారే పరిష్కరించుకుంటారని ట్రంప్‌ అన్నాడు.మన భాగస్వామి, మిత్రదేశం, నా స్నేహితుడు అని నరేంద్రమోడీ కీర్తించిన పెద్దమనిషి. అలాంటి దేశం మనకు మద్దతు ఇస్తుందా? అమెరికా ఇచ్చిన విమానాలనే ఇప్పుడు పాకిస్తాన్‌ మనమీద మోహరిస్తున్నది, వాటికి మరమ్మతులు, నవీకరణ చేస్తున్నది అమెరికా.అరుణాచల్‌లో గ్రామాలను, లడక్‌లో నిర్మాణాలు చేస్తున్నది అంటూ నిరంతరం మనకు సమాచారం అందించే అమెరికా సంస్థలు పహల్గాం దాడి విషయంలో హెచ్చరికలు చేయలేదేం!
కాశ్మీరుకు ఆర్టికల్‌ 370, అదే విధంగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల నిచ్చే చట్టాన్ని(ఎఎఫ్‌ఎస్‌పిఏ) సవరిస్తామని వాగ్దానం చేయటం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ భద్రతా దళాలకు ముప్పు కుట్ర తలపెట్టిందని, జమ్మూ-కాశ్మీరు ఇతర ఉగ్రవాదులున్న ప్రాంతాల్లో భద్రతా దళాల చేతులు కట్టివేసిందని 2019 ఏప్రిల్‌ మూడవ తేదీన పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఆ కాంగ్రెస్‌ అధికారానికి రాలేదు, అదే మోడీ రెండోసారి పదవిని చేపట్టి ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు అసలు కాశ్మీరు రాష్ట్రాన్నే రెండుగా చీల్చి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు, మూడవసారి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యత కేంద్రానిదే.
భద్రతా దళాలకు పూర్తి అధికారాలను ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ గత ఐదేండ్లలో ఉగ్రవాదులు పహల్గాంతో సంబంధం లేకుండా అరవైమందికి పైగా పౌరులను చంపారు. కేంద్రం ఎందుకు విఫలమైనట్లు? తాజా దాడికి బాధ్యత ఎవరిది? మోడీ చెప్పిన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా! 2019 ఆగస్టు ఎనిమిదవ తేదీన ఆర్టికల్‌ 370 రద్దు గురించి టీవీలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. కాశ్మీరులో ఒక నూతన యుగం ప్రారంభమైందన్నారు. ఈ ఆర్టికల్‌ను ఒక సాధనంగా చేసుకుని భయాన్ని వ్యాపింపచేశారని కాశ్మీరు అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.ఆర్టికల్‌ 370, 35ఏ వేర్పాటువాదాన్ని ఇచ్చాయన్నారు. అందుకే వాటిని రద్దు చేసినట్లు చెప్పారు. అవేవీ లేవు, ఉగ్రవాదుల ముప్పు తప్పిందా, భయం తొలిగిందా! తొలిగితే కాశ్మీరుకు రాష్ట్ర హోదాను పునరుద్దరించకుండా భద్రతాపరమైన అధికారాలన్నీ కేంద్రం తన చేతుల్లోనే ఎందుకు పెట్టుకుంది? ఈ ప్రశ్నలకు బదులుందా?

  • సత్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -