నవతెలంగాణ – హైదరాబాద్ : ” నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే.. నా ప్రతిభ, కృషి కాదు.. నువ్వే అని చెబుతాను. ” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన భార్య సురేఖ అని అన్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫొటోలు పంచుకున్న చిరు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ” నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన నీకు శుభాకాంక్షలు. 1980 ఫిబ్రవరి 20న మనం వివాహం చేసుకున్న నాటినుంచి నువ్వే నా బలంగా మారావు. ఈరోజు నీ పుట్టినరోజుతో పాటు రెండు రోజుల ముందుగానే మన వివాహ వార్షికోత్సవం కూడా చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. నీ ప్రేమ, ఆప్యాయతలతో కుటుంబం మొత్తాన్ని నడిపిస్తున్నావు.
నా తల్లిని సొంత బిడ్డలా చూసుకుంటావు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే.. నా ప్రతిభ, కృషి కాదు.. నువ్వే అని చెబుతాను. నువ్వు కుటుంబ బాధ్యతను చూసుకున్నావు కాబట్టే నేను నటనపై శ్రద్ధ పెట్టాను. కష్టసుఖాల్లో మమ్మల్ని ఒకేతాటిపై నడిపించావు. నీవల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ” అని చిరు తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘మనశంకర వరప్రసాద్ గారు’తో సూపర్ హిట్‌ను అందుకున్న ఆయన ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా కనిపించనున్నారు. దీన్ని జులై 9వ తేదీన ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.



