నవతెలంగాణ-దుబ్బాక
పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పులు చేసి రెండు బోర్లు వేసినా అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి 4వ వార్డులో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 4వార్డులో నివాసం ఉంటున్న రవీందర్(36) తనకున్న ఎకరంన్నర భూమితో పాటు కొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండేవాడు. అయితే నీటి సౌకర్యం లేకపోవడంతో తమ పొలంలో రెండు బోర్లు వేశాడు. వాటి కోసం అప్పు చేశాడు. అలాగే కుటుంబ పోషణకు కూడా కలిపి మొత్తంగా రూ.4లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో రవీందర్ భార్య రమ్యకృష్ణ తన సోదరునికి కూతురు పుట్టిందని.. చూసి వస్తానని ఈనెల 3న వెళ్లింది. అలాగే పిల్లలను తీసుకుని రవీందర్ తల్లి విజయ కొండపాకలోని బంధువుల ఇంటికి ఈనెల 5న వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్‌రెడ్డి ఇంట్లోని ఓ గదిలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
బోర్లు వేసి అప్పులపాలై.. యువరైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -