నవతెలంగాణ-హైదరాబాద్ : తండ్రి మందలించాడని మనస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. యువతి ఆత్మహత్య ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రెండో పట్టణ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం సుభాష్‌నగర్‌బస్తీకి చెందిన లింగంపల్లి లావణ్య, శ్రీనివాస్‌లకు ఒక కుమారుడు, కూతురు వర్షిత(19) సంతానం. ఇటీవలే వర్షిత ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. స్నేహితుడికి ఇంట్లో నుంచి కొంత ఆర్థిక సాయాన్ని చేసింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి తమ ఆర్థిక పరిస్థితే బాగా లేనప్పుడు ఎందుకు ఇచ్చావంటూ మందలించాడు. ఏనాడూ మందలించని తండ్రి కోపగించుకోవడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాత్‌రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్‌ఐ వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జీవితాల్లో వెలుగులు నింపాలని నేత్రదానం
మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి వర్షిత కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి వివరించారు. కుటుంబసభ్యులు అందుకు అంగీకరించి నేత్రదానానికి ముందుకు వచ్చారు. సదాశయా ఫౌండేషన్ సహకారంతో ఎల్‌వీ.ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ ఆధ్వర్యంలో నేత్రాలను స్వీకరించారు. సమాజహితం కోసం పుట్టెడు దుఃఖంలోనూ వర్షిత తల్లిదండ్రులు ముందుకు రావడం హర్షణీయమని జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ తెలిపారు.



