నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రేమించానన్నాడు… పెండ్లి చేసుకుందామని చెప్పాడు. పెద్దలూ అంగీకరించాక.. ఆ యువకుడు తనను అనుమానించటంతో ఆ యువతి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నాగోలు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై దశరథ కథనం ప్రకారం… ఖమ్మం సమీపంలోని కొత్తగూడేనికి చెందిన ఐశ్వర్య(19) తన అన్న అరవింద్‌తో కలిసి నాగోలు సమీపంలోని తట్టిఅన్నారం వైఎస్‌ఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేస్తోంది. అన్న ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన వీరి దూరపు బంధువైన మహేశ్ అలియాస్ ఆనంద్(23) హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఏడాది క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ఐశ్వర్యను చూసిన మహేశ్.. బంధుత్వంతో తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. పెండ్లి చేసుకుంటానంటూ వెంటపడటంతో ఆమె సరేనంది. మొదట పెద్దలు నిరాకరించినా తరువాత అంగీకరించారు. ఇటీవల ఆమెతో చనువుగా ఉంటున్న ఆనంద్.. ఆమె మరెవరితోనో ఫోన్లో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు. ఈనెల 5న హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్దకు ఇద్దరూ చేరుకున్నారు. ఫోన్ల విషయంపై ఆనంద్ నిలదీయటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి దూకింది. ఆమెను నాగోలులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఐశ్వర్య బుధవారం మృతిచెందింది. ఆమె ఆత్మహత్యకు కారణమైన మహేశ్‌ను నాగోలు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అనుమానం..వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



