- – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం
– ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం :మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
– నల్లగొండలో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. తెలంగాణ దేవత సోనియా గాంధీ అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో చెప్పి.. కుటుంబ సమేతంగా సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కిన విషయాన్ని మరిచిపోయావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నేడు విలన్ అయిందా?. అది నోరా.. డ్రయినేజీనా..” అని రోడ్డు భవనాలు సినిమా ఫొటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో రూ.20 కోట్లా 22 లక్షలతో నిర్మించనున్న బక్కతాయకుంట లిఫ్ట్ ఇరిగేషన్‌కు, రూ.6 కోట్లా 8 లక్షలతో నిర్మించే పొనుగోడు ఎత్తిపోతల పథకానికి, రూ.19.95 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్‌బట్ల ఎత్తిపోతల పథకాలకు సోమవారం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.36 కోట్లతో జిల్లా కలెక్టరేట్‌లో నిర్మించనున్న అదనపు బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ”పది సంవత్సరాల్లో పది లక్షల కోట్లు సంపాదించావు.. సగం మంది జైల్లో ఉన్నారు.. సగం మంది అమెరికాలో ఉన్నారు.. కొంతమంది ఎక్కడున్నారో తెలియదు.. వాళ్లందరినీ పట్టుకోవాలంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది” అని అన్నారు. అసెంబ్లీకి రావడం చేతకాని ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలు పెట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తావా.? తన పాలన గురించి ప్రజలందరికీ తెలుసునన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏనాడైనా ఒకటో తారీకు జీతం ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని, ఇంకా వారికి ఇవ్వాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని తెలిపారు. 100 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, డబుల్ బెడ్ రూమ్ అన్నావు, కేజీ టు పీజీ విద్య అన్నావ్ ఏదైనా అమలు జరిగిందా? అని ప్రశ్నించారు. తాము అబద్ధాలు చెప్పం చెప్పిందే చేస్తాం.. చేసేదే చెప్తాం.. సన్నబియ్యాన్ని పండించాలని రైతులకు సూచించాం.. కొనుగోలు చేశాం. అదనంగా రూ.500 బోనస్ కూడా ఇచ్చామని వివరించారు.
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి ఇరిగేషన్ పనులు చేపట్టలేదన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి రైతులు ఎదురుచూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎదుల ద్వారా నీరు అందించేందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టామని చెప్పారు. అలాగే హై లెవెల్ కెనాల్‌కు రూ.442 కోట్లు మంజూరు చేశామని, పిల్లాయిపల్లి కాలువ, శివన్నగూడెం నుంచి నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు. మూసీని పునరుద్ధరించి ఉమ్మడి రైతులకు మేలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు నేతావత్ బాలూనాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవర్, ఇన్‌చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ అజరు కుమార్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి, జవహర్, ఇన్‌చార్జి డిఆర్‌ఓ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ నీది నోరా.. డ్రయినేజీనా..
RELATED ARTICLES