Tuesday, April 29, 2025
Navatelangana
Homeతాజా వార్తలుయువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలి

- Advertisement -

– ప్రభుత్వ విధానాలపై చర్చించాలి
– ప్రతిపక్షాలకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం లేకుండాపోయింది
– ప్రపంచ వ్యాప్తంగా అణచివేత కొనసాగుతోంది
– ప్రజలతో ఎలా మాట్లాడాలో భారత్‌ జోడో యాత్ర నేర్పింది : భారత్‌ సమ్మిట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశ రాజకీయాల్లో పాతతరం అంతరించిపో యిందనీ, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయన్నారు. గడిచిన పదేండ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాల్సి ఉందని చెప్పారు. చట్టసభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు. విపక్షాలు తమ గొంతు వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సి వస్తోందని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో రెండోరోజు భారత్‌ సమ్మిట్‌ ముగింపులో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, దేశం, ప్రజల పట్ల కాంగ్రెస్‌ పార్టీకున్న ప్రేమ, ప్రజలకు ఏం చేయాలని పార్టీ అనుకుంటుందో ఆ విషయాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోయాయనీ పదేండ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. మోడ్రన్‌ సోషల్‌ మీడియాతో అంతా మారిపోయిందనీ, ఇప్పుడంతా మోడ్రన్‌ రాజకీయమేనని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టానని గుర్తు చేశారు. పాదయాత్ర మొదట్లో తనతో కొద్ది మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రోజులు గడుస్తున్న కొద్దీ తనతో వేలాది మంది నడిచారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించి విజయం సాధించినట్టు తెలిపారు. దేశ ప్రజలకు ప్రేమను పంచేందుకు పాదయాత్రను మొదలు పెట్టామన్నారు. ‘విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం’ అని తెలిపారు. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టు చెప్పారు. సగం దూరం నడిచేటప్పటికీ తాను గతంలోలా లేనన్నారు. ‘ప్రజలతో ఎలా మాట్లాడాలో… వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా. తాను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు. కానీ, యాత్రలో నేను ప్రజలపై నా ప్రేమను వ్యక్త పరచగలిగాను. నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపరిచానో అప్పట్నుంచి అందరూ స్పందిస్తున్నారు’ అని గుర్తు చేశారు. దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారని చెప్పారు. రాజకీయాలు కూడా ప్రజల ఇష్టానుసారంగానే ఉండాలని సూచించారు. భారత్‌ సమ్మిట్‌కు తాను మొదటి రోజు రావాల్సి ఉందనీ, కానీ కాశ్మీర్‌కు వెళ్లడంతో రాలేక పోయానని, తనను క్షమించాలని కోరారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారండి
ఈ రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి
ప్రజల జీవితాలు మార్చేందుకు సర్కారు చేపట్టిన మిషన్‌లో చేరండి
అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోండి : విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌ కోసం బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారత్‌ సమ్మిట్‌లోని విదేశీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలను మార్చేందుకు రాష్ట్ర సర్కారు చేపట్టిన మిషన్‌లో చేరాలని కోరారు. మీకున్న అనుభావాలను, పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను తమ ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు. భారత్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టిన పథకాలను వివరించారు. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతోపాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో దశాబ్దాలపాటు పోరాడిందని గుర్తు చేశారు. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారనీ, వారి పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేండ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తమ ఆకాంక్షల సాధన కోసం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. 15 ఆగస్టు 2024న రూ. 20,617 కోట్లు చెల్లించి 25 లక్షలా 50 వేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేసిందన్నారు. తమ రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్టు వివరించారు. రైతుభరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నట్టు చెప్పారు. భూమిలేని రైతుకూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో భూమిలేని, భూమి కలిగిన రైతులకు కలిపి ఏటా రూ.20,000 కోట్లకు పైగా నిధులు ఇస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తున్నామన్నారు. రైతుబీమా, పంటల బీమాలతో రైతులకు లబ్ది చేకూరుస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీని ప్రారంభించామని తెలిపారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. ఐదు లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి సారించారనీ, ఇందిరాగాంధీ రోటీ, కపడా ఔర్‌ మకాన్‌ అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని అన్నారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఆధునీకీకరణ, అభివృద్ధి, టెలికామ్‌, సాఫ్ట్‌వేర్‌ వంటి ప్రపంచ సాంకేతిక విప్లవాలపై దృష్టి పెట్టారని గుర్తు చేశారు. ప్రయివేటు రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్‌ బంకులకు మహిళలను యజమానులను చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మహిళను ఇంటి యజమానిని చేయనున్నట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. న్యూయార్క్‌లోని హడ్సన్‌నది, లండన్‌లోని థేమ్స్‌నది, టోక్యోలోని సుమిదాతోసహా అనేక నగరాలను అధ్యయనం చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అనేక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు చేపడుతున్నట్టు చెప్పారు. 30 వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి నగరం ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 370 కిమీ పొడవైన రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంలో థర్డ్‌ జెండర్‌ను రిక్రూట్‌ చేసుకున్న తొలి ప్రభుత్వం తెలంగాణ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు