Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

- Advertisement -

గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌
ఇబ్రహీంపట్నంలో ర్యాలీ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

విద్యార్థులు, యువత గంజాయికి, డ్రగ్స్‌కి బానిసలై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, వాటి నిర్మూలనకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ కోరారు. డీవైఎఫ్‌ఐ అధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయికి అలవాటుపడి మంచి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని, ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి మత్తులో జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై, నిస్తేజంగా మారుతున్నారని అన్నారు. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించినా గంజాయి, డ్రగ్స్‌ వినియోగం తగ్గడం లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలన్నారు. నిరంతరం నిఘా పెట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం కలిసికట్టుగా పోరు చేస్తేనే మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమేయడం సాధ్యం అవుతుందన్నారు. డీవైఎఫ్‌ఐ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి పి.జగన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నా స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతోనే యువత చెడు వ్యసానాల వైపు మళ్లుతున్నారని చెప్పారు. ప్రభుత్వాలు సరైన అవకాశాలు కల్పించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆలంపల్లి జంగయ్య, పి.శివశంకర్‌, ఆర్‌.స్వామి, రాఘవేందర్‌, శివ, చైతన్య, మహేష్‌, ప్రభాకర్‌, లెనిన్‌, వినోద్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -