Magazines

జైళ్లలోనూ ‘కుల’ సంకెళ్లు!

17 నిమిషాల క్రితం

Caste
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 3 నిమిషాల చదవడం

నేరం చేసినందుకు కోర్టు శిక్ష విధిస్తుంది. కానీ జైలులో ఖైదీకి మరో శిక్ష ఎదురవుతోంది. అది చేసిన నేరానికి కాదు.. పుట్టిన కులానికి సంబంధించినది! పారిశుధ్య పనులు, మరుగుదొడ్ల శుభ్రతను కొన్ని కులాల ఖైదీలకే అప్పగించడం, ఆహారంలో వివక్ష చూపడం, కులం ఆధారంగా వేర్వేరుగా ఉంచడం వంటి అమానవీయ పద్ధతులు జైళ్లలో కొనసాగడం న్యాయవ్యవస్థకే అవమానం. స్వేచ్ఛను కోల్పోయిన వ్యక్తికి ఆత్మగౌరవాన్ని కూడా నిరాకరించడం ఎలాంటి న్యాయం? జైళ్లలో కులవివక్షను అంతం చేయాలని రెండేండ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకాకపోవడంపై నవంబరు 3న జరిగిన విచారణలో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాత్రికేయురాలు సుకన్య శాంతా పరిశోధనాత్మక కథనం ఆధారంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 అక్టోబరు 3న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివిధ రాష్ట్రాల జైలు నిబంధనల్లోని కులవివక్షపూరిత అంశాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చింది.

కులం ఆధారంగా పనులు కేటాయిం చడం, బారక్‌లలో వేర్వేరుగా ఉంచడం, కొన్ని తెగల వారిని పుట్టుకతోనే నేరస్తులుగా పరిగణించడం వంటి విధానాలను తప్పు బట్టింది. ఖైదీల రిజిస్టర్లలో కుల వివరాల నమోదు నిలిపివేయాలని, మూడు నెలల్లో జైలు మాన్యువళ్లను సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజ్యాంగంలోని 14, 15, 17 అధికరణలు జైళ్లకూ వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమానత్వపు హక్కు, అంటరానితనం నిర్మూలన, గౌరవంగా జీవించే హక్కు, వెట్టిచాకిరీ నిషేధం వంటి రాజ్యాంగ హామీలను ఖైదీలకూ వర్తింప జేయాల్సిందేనని తేల్చిచెప్పింది. జైలు శిక్ష వ్యక్తి స్వేచ్ఛను మాత్రమే పరిమితం చేస్తుందని, అతని మానవ గౌరవాన్ని హరించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. అయితే తీర్పు వెలువడి రెండేండ్లు కావస్తున్నా ఆదేశాల అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో నిర్దిష్ట కులాల ఖైదీలతోనే పారిశుధ్య పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి.

ఉన్నత కులాల వారికి మెరుగైన ఆహారం అందించడం వంటి వివక్ష పూరిత ఆచరణలు కూడా వెలుగు చూస్తున్నాయి. వలస పాలకుల కాలం నాటి నేరస్త కులాల భావజాలం జైలు నిబంధనల్లో కొనసాగడం ఆందోళ నకరం. ఇటీవల తమిళనాడులోని మదురై, తిరుచ్చి, తిరునల్వేలి జైళ్లలో అణగారిన వర్గాల ఖైదీలతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తు న్నారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు విచారణకు ఆదేశించడం పరిస్థితి తీవ్రతను తెలియ జేస్తోంది. జైలు నిబంధనలు సవరించారా? ఖైదీల రిజిస్టర్ల నుంచి కుల వివరాలను తొలగించారా? కులం ఆధారంగా పనులు కేటాయించే విధానాన్ని రద్దు చేశారా? వివక్షను పర్యవేక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వాల నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అందించలేదని పేర్కొంది. జనవరి 13న జరిగే తదుపరి విచారణలోగా స్పందించకపోతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సంబంధిత ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించాల్సి వస్తుందని హెచ్చరించింది.

జైళ్లలో కులవివక్షను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బోర్డులను ఏర్పాటు చేయాలన్న ఆదేశాల అమలులోనూ అనేక రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. ఖైదీల హక్కుల పరిరక్షణ, జైళ్లలో పరిస్థితుల పరిశీలన, వివక్షకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై పర్యవేక్షణ ఈ బోర్డుల బాధ్యత. అయితే ఈ వ్యవస్థలు పూర్తిస్థాయిలో ఏర్పాటుకాక పోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది కేవలం న్యాయస్థానం ఆదేశాల అమలులో జాప్యం మాత్రమే కాదు. అణగారిన వర్గాల హక్కుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతను ప్రశ్నించే అంశం. నేరం చేసిన వ్యక్తి ఏ కులానికి చెందినవాడైనా చట్టం ముందు సమానమే. శిక్ష అనుభవిస్తున్న సమయంలోనూ అతనికి ఆహారం, నివాసం, వైద్యం, పనుల కేటాయింపులో సమానత్వం, కనీస మానవ గౌరవం దక్కాలి. ఖైదీలను సంస్కరించి తిరిగి సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చిదిద్దాల్సిన జైళ్లు వివక్షకు నిలయాలుగా మారడం వాటి లక్ష్యానికే విరుద్ధం.

అందుకే సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలి. జైలు నిబంధనలను సవరించడంతోపాటు, కుల ఆధారిత పనుల కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలి. ఖైదీలు వివక్షపై నిర్భయంగా ఫిర్యాదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పర్యవేక్షణ బోర్డులు స్వతంత్రంగా పనిచేసేలా చూడటంతోపాటు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జైలు గోడల మధ్య కూడా రాజ్యాంగ విలువలు అమలయ్యేలా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. నేరానికి శిక్ష ఉండాలి తప్ప, పుట్టుకకు శిక్ష ఉండకూడదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా జైళ్లలో ఆచరణలోకి వచ్చినప్పుడే నిజమైన న్యాయం సాధ్యమవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్