Magazines

​కరువు సహాయక చర్యలు చేపట్టాలి

25 నిమిషాల క్రితం

Drought relief measures must be undertaken.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

​డిసెంబర్‌లో ‘మార్చ్ టు గోడౌన్స్’...గోడౌన్లు బద్దలు కొట్టి పేదలకు బియ్యం పంచుతాం

‘​పీపుల్స్ ఎగైనెస్ట్ సర్‌’' పేరుతో విశాల ఐక్యవేదిక : ​అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్

​నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

దేశంలో గత 50 ఏండ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే డిసెంబర్ నెలలో ‘మార్చ్ టు గోడౌన్స్’ పేరుతో గోడౌన్లను ముట్టడించి, వాటిని బద్దలు కొట్టి ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కరువు నివారణ, సహాయక చర్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నిత్యావసర సరుకుల కోటాను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు.

ఎఫ్‌సీఐ గోడౌన్లలో 6 కోట్ల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ ప్రజలకు ఉచితంగా లేదా రాయితీకి ఇవ్వకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ ధరల పెంపునకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందని, రైతులకు ఇచ్చే సబ్సిడీలను క్రమంగా కోత విధిస్తోందని అన్నారు. నాలుగేళ్ల క్రితం బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ. 2.95 లక్షల కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం దాన్ని రూ. 1.90 లక్షల కోట్లకు తగ్గించి రైతాంగంపై తీవ్ర భారం మోపారని తెలిపారు. ఒకవైపు వ్యవసాయ దిగుబడి 34 నుండి 35 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగినప్పటికీ, బహిరంగ మార్కెట్లో బియ్యం ధర రూ. 60 నుండి రూ. 95కి చేరడం, మిగిలిన నిత్యావసరాల ధరలు 200 నుండి 300 శాతం పెరగడం ప్రభుత్వాల వ్యాపార సానుకూల విధానాల ఫలితమేనని అన్నారు.ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి పడిగల నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సారంగి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

​కార్పొరేట్ వ్యతిరేక పోరు

​​దేశంలో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా, జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ 'పీపుల్స్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్' పేరుతో విశాల ఐక్యవేదికగా సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తామని వెంకట్ తెలిపారు. ఎస్ఐఆర్ వల్ల దేశవ్యాప్తంగా రద్దయిన 13 కోట్ల ఓట్లలో అత్యధికంగా వ్యవసాయ కార్మికులు, దళితులు, వలస కార్మికులు, ముస్లింలవే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న నల్గొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం మహాసభలకు తెలంగాణ నుండి లక్ష మంది రైతులు, వ్యవసాయ కార్మికులు తరలివస్తారని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి 14 నుండి 17 వరకు బెంగళూరులో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సంఘం సంతాపాన్ని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్