Magazines

డిస్మిస్డ్‌ కార్మికులకు పునర్నియామక ఊరట

17 నిమిషాల క్రితం

Relief for dismissed workers: Reinstatement granted
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

విధివిధానాలు విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం

ఈ నెల 14 వరకు 
దరఖాస్తులకు అవకాశం

అర్హతల సడలింపు, 
పాత సర్వీసుపై స్పష్టత కరువు

లబ్ది పొందేది వంద మంది లోపే

​నవతెలంగాణ - కోల్‌‌సిటీ

గైర్హాజరు కారణంతో ఉద్యోగాలు కోల్పోయిన సింగరేణి కార్మికులకు పునర్నియామక అవకాశం కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం విధివిధానాలు విడుదల చేసింది.. ఇది కోల్ బెల్ట్ ప్రాంతంలో ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ విధించిన కఠిన నిబంధనలు సగటు కార్మికుడికి మింగుడుపడటం లేదు. సంస్థ విధించిన వయస్సు, మస్టర్లు, అండర్ గ్రౌండ్ పని నిబంధనల వల్ల మొత్తంగా 100 మందికి మాత్రమే లబ్ది చేకూరే అవకాశం ఉంది. మిగతా వేలాది మంది బాధితులు, 2023కి ముందు ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.సింగరేణి సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య గైర్హాజరుతో డిస్మిస్ అయిన వారు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 2026 ఏప్రిల్ 1 నాటికి 46 ఏండ్లలోపు వయస్సు ఉండి, ఉద్యోగ విరమణకు ముందు ఐదేండ్లలో ఏవైనా రెండు క్యాలెండర్ సంవత్సరాల్లో కనీసం వంద మస్టర్లు పూర్తి చేసిన వారే దీనికి అర్హులుగా పేర్కొంది. వీటితోపాటు భూగర్భ గని (క్యాటగిరీ-1)లో పనిచేసేందుకు వైద్యాధికారుల నుంచి ఫిట్‌నెస్ సాధించాలనే నిబంధన ఉంది. వీటి ప్రాసెస్ కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఇన్ని కఠిన షరతుల వల్ల అతికొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​సీనియారిటీ, వేతనాలపై కొరవడిన స్పష్టత

ప్రస్తుతం సింగరేణిలో 36 వేల మందికి పైగా రెగ్యులర్ కార్మికులతో పాటు వేలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ప్రస్తుత నిర్ణయం లబ్ది చేకూరే అంశమే అయినా కేవలం మూడేండ్ల కాలపరిమితికే ఈ అవకాశాన్ని పరిమితం చేయడంతో 2023 కంటే ముందు అనారోగ్యం, కుటుంబ సమస్యలు, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. దరఖాస్తుల పరిశీలన పేరుతో ఏర్పాటైన హైపవర్ కమిటీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, కమిటీ పేరుతో దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గాలు డిమండ్‌ ‌చేస్తున్నాయి. ఇదే సందర్భంలో 2023 కంటే ముందు ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది కార్మికులనూ మానవీయ కోణంలో పునఃపరిశీలించాలని కోరుతున్నాయి.



​కంటితుడుపు చర్య మాత్రమే

కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేలా సింగరేణి యాజమాన్యం ఈ కంటితుడుపు చర్య చేపట్టింది. పునర్నియామకం పేరుతో 100 లోపు మస్టర్లు ఉన్న వారికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరిన అధికారిక సంఘం.. గతంలో 150 మస్టర్లు ఉన్న వారిని తొలగించేందుకు తీసుకొచ్చిన జీవోను రద్దు చేయించక పోవడం బాధాకరం. 2026 చివరి నాటికి డిస్మిస్ అయ్యే కార్మికుల సంఖ్య 600 వరకు ఉండవచ్చు. రాబోయే కాలంలో వారి వైపు నుంచి కూడా పునర్నియామక డిమాండ్ రానుంది.

వంద మందికి ఉద్యోగం ఇచ్చి వేల మందిని డిస్మిస్ చేయించేలా సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తోంది. కార్మికులను డిస్మిస్ చేసేలా జీవోలను ప్రోత్సహించడం, తిరిగి ఉద్యోగం ఇప్పించినట్టు నటించడం, దీనిని ఆసరా చేసుకొని సెటిల్మెంట్లు చేయడం కొన్ని కార్మిక సంఘాలకు అలవాటు గా మారింది. ఇది చాలా విచారకరం. కార్మికులంతా ఇలాంటి విధానాలను వ్యతిరేకించాలి. నిబంధనలను సడలించి మానవీయ కోణంలో డిస్మిస్ అయిన ప్రతి కార్మికుడికీ ఉద్యోగం ఇచ్చి శాశ్వత పరిష్కారం చూపించాలి.

- తుమ్మల రాజిరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్