పెట్టుబడిదారీ వ్యవస్థ నిలకడగా వృద్ధి సాధిస్తూ పోవాలంటే దానికి వెలుపలి నుంచి - అంటే పెట్టుబడిదారీ వృద్ధి క్రమానికి వెలుపలి నుంచి - ఉత్తేజపరచగల బాహ్య ప్రేరణ అవశ్యం. దీనికి కారణం ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడూ ఆకస్మిక పెరుగుదలను, ఆ వెంటనే ఆకస్మిక పతనాన్ని చవిచూస్తూ కొనసాగుతుంది. ఆ వ్యవస్థ పూర్తి సామర్ధ్యం వినియోగంలోకి వచ్చిన అనంతరం అధికోత్పత్తి సమస్య తలెత్తుతుంది. ఆ తర్వాత అది ఎదుర్కొనే పతనం దానంతట అదే అంతం కాదు. అటువంటి పతనం నుంచి ఆ వ్యవస్థ తనంతట తానే కోలుకోజాలదు. అటువంటి పరిస్థితుల్లో తాను ఏర్పాటు చేసుకున్న ఉత్పత్తి పరికరాలలో, యంత్రాలలో కొంత భాగాన్ని తానే ధ్వంసం చేసుకుని ఉత్పత్తి సామర్ధ్యాన్ని కుదించుకుని అధికోత్పత్తి సమస్య నుండి బైటపడేందుకు అది ప్రయత్నిస్తుందని మార్క్స్ భావించాడు. అయితే ఆ విధంగా పరికరాల్లో కొంత భాగాన్ని పనికిరాకుండా చేయడం వలన ఆ మేరకు పెట్టుబడిదారులు పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. పర్యవసానంగా ఆ మేరకు డిమాండ్ కూడా తగ్గుతుంది. అందుచేత సమస్య నుండి బటయ పడడానికి వీలు కాదు. అందుకే పెరిగిన ఉత్పత్తికి కావలసిన డిమాండ్‌ను తన వ్యవస్థకు వెలుపల నుంచి తెచ్చుకోడానికి పెట్టుబడిదారీ విధానం పూనుకుంటుంది. అప్పుడే తన లాభాల వేటను అది కొనసాగించగలుగుతుంది. ఈ ‘వెలుపలి మార్కెట్ల’ కోసం పూనుకునే క్రమమే అది సామ్రాజ్యవాద దశకు చేరుకోడానికి దారి తీసింది.
ఈ విధంగా వెలుపలి మార్కెట్లను చేజిక్కించుకునే క్రమమే ఇతర దేశాలను వలసలుగా మార్చేందుకు దారి తీసింది. ఆ వలసలలో అంతవరకూ ఉండిన చేతివృత్తులను, పరిశ్రమలను ధ్వంసం చేయడానికి దారి తీసింది. ఆ వలస దేశాలలోని చేతివృత్తులు కాని, స్థానిక పరిశ్రమలు కాని నాశనం కావడానికి బైటనుంచి సామ్రాజ్యవాద దేశాలు తెచ్చి గుమ్మరించిన సరుకుల పోటీ కారణం కాదు. నిర్బంధం ప్రయోగించడం ద్వారా సామ్రాజ్య వాదులు వలస దేశాల్లో తమ సరుకులకు అనుగుణంగా ఉండే మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలా నిర్బంధాన్ని ప్రయోగించడానికి వాళ్లకి ఆ వలస దేశాల మీద ఆధిపత్యం చెలాయించడం అవసరం అయింది. ఆ విధంగా తమ పెట్టుబడిదారీ వ్యవస్థకు వెలుపల ఉన్న ప్రాంతాల నుండి తమకు అవసరమైన ‘ఉత్తేజపరచగలిగిన’ ప్రేరణను పొందగలిగింది. దానితోబాటు అదనంగా ఆ ప్రాంతాల నుండి ఆహారధాన్యాలను, ముడి సరుకులను కూడా పొందగలిగింది.
అయితే, పెట్టుబడిదారీ వ్యవస్థకు వెలుపల ఉండే ప్రాంతాలకు పెట్టుబడిదారీ వ్యవస్థను ఇలా ఉత్తేజపరచగలిగే సామర్ధ్యం క్రమేణా ఇగిరిపోతుంది. ఒకసారి ఏదైనా ప్రాంతం పెట్టుబడిదారీ ఉత్పత్తులతో ఆక్రమించబడిన తర్వాత అక్కడ కూడా పెట్టుబడిదారీ పద్ధతుల్లో వృద్ధి ప్రారంభం అవుతుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే సరుకులకు కూడా ‘వెలుపలి’ మార్కెట్ అవసరమౌతుంది. అంతవరకూ పెట్టుబడిదారీ-పూర్వపు దశలో ఉండిన ప్రాంతాల మార్కెట్లన్నీ ఇలా ఇగిరిపోయి ఇక కొత్త మార్కెట్లు అనేవి ఎక్కడా లేకుండా పోయిన దశ వచ్చినప్పుడు ఇక పెట్టుబడి పోగుబడే క్రమం ముందుకు సాగదు. అటువంటి పరిస్థితి ఏర్పడే లోపే శ్రామికవర్గం ఆ వ్యవస్థను కూల్చివేయగలదని రోసా లగ్సెంబర్గ్ అభిప్రాయపడ్డారు.
జాన్ మేనార్డ్ కీన్స్ అనే ఇంగ్లీషు ఆర్థికవేత్త దీనికొక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అవసరమైన అదనపు డిమాండ్‌ను వెలుపలి నుండి పొందే బదులు రాజ్యమే పూనుకుని అదనపు ఖర్చు చేయడం ద్వారా ఆ డిమాండ్‌ను సృష్టించవచ్చునని ప్రతిపాదించాడు. రాజ్యం ఈ విధంగా చేయగల అదనపు ఖర్చును ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెంచుకోవచ్చు, లేదా తగ్గించుకోనూవచ్చు. అటువంటి సర్దుబాటు చేయగల సామర్ధ్యం ఉన్నప్పుడు ఇక పెట్టుబడిదారీ విధానం అధికోత్పత్తి సంక్షోభం తలెత్తకుండా నివారించగలుగు తుందని, అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థ పతనాన్ని నివారించవచ్చునని చెప్పాడు. దాంతో చాలామంది ఆర్థికవేత్తలు ఇక పెట్టుబడిదారీ విధానం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కో నవసరం లేని విధంగా స్థిరంగా నిలదొక్కుకుంటుందని ఆశిం చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించేవారు కూడా దాని ఆర్థిక వైరుధ్యాల ఊసు ఎత్తడం మాననుకుని ఆ వ్యవస్థ కొద్దిమంది మాత్రమే అంతకంతకూ ఎక్కువ సంపదను పోగేసుకుంటూ, ఎటువంటి సామాజిక బాధ్యతా లేకుండా ఎక్కువమందిని పేదరి కంలోకి నెట్టడం వంటి నైతిక అంశాల మీదనే కేంద్రీకరించడం ప్రారంభించారు.
అయితే ఈ విధంగా రాజ్యమే పెట్టుబడిదారీ వ్యవస్థకు కావలసిన ఆర్థిక ఉత్తేజాన్ని అందించి ప్రేరేపించడానికి కావలసిన అదనపు ఖర్చును చేయడం అనేది అన్ని సందర్భాల్లోను సాధ్యం కాదు. దేశంలోని సంన్నుల మీద అదనపు పన్నులు విధించి తద్వారా సేకరించిన ఆర్థిక వనరులను ఖర్చు చేసినప్పుడు, లేదా ద్రవ్యలోటును పెంచినప్పుడు మాత్రమే ఇది ఉత్తేజాన్ని మార్కెట్‌కు ఇవ్వగలుగుతుంది. అలా కాక, కార్మికుల మీద అదనపు పన్నులను విధిస్తే, దాని వలన మార్కెట్‌ను ఉత్తేజపరచడం సాధ్యం కాదు. ఎందుకంటే, కార్మికులు ఎటు తిరిగీ వారి ఆదాయాలను దాదాపు పూర్తిగా ఎప్ప టికప్పుడు ఖర్చు చేసేస్తూనే వుంటారు. ఆ ఆదా యాల్లో కొంత భాగాన్ని అదనపు పన్నుల రూపంలో ప్రభుత్వం సేకరించి తాను ఖర్చు చేయడం వలన మార్కెట్లో అదనంగా డిమాండ్ పెరిగేది ఏమీ ఉండబోదు. ఇక సంపన్నుల మీద పన్ను అదనంగా వేయడమో, ద్రవ్యలోటును పెంచడమో చేయడం తప్ప మార్కెట్లో డిమాండ్‌ను పెంచడానికి వేరే దారులేమీ లేవు.
కాని ఆ విధంగా తమ మీద అదనపు పన్నులను విధించడాన్ని పెట్టుబడిదారులు అంగీకరించరు. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో, అది కూడా తాత్కాలికంగా మాత్రమే అందుకు వాళ్ళు తలొగ్గవచ్చు తప్ప తమ వద్ద నుండి ఎల్లకాలమూ ప్రభుత్వం ఆర్థిక వనరులను సేకరించే విధానాన్ని ఎన్నటికీ అంగీకరించరు. ద్రవ్యలోటును పెంచి ఖర్చు చేయడం కూడా వారికి అంగీకారం కాదు. పైగా ప్రపంచీకరణ అనంతరం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి బలపడిన తర్వాత కీన్స్ చేసిన ఈ సూచనలకు దాని నుండి పూర్తి వ్యతిరేకత వచ్చింది.
అందుచేత ఇప్పుడు నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ మాంద్యంలో పూర్తిగా దిగబడిపోయి చిక్కుల్లో పడివున్నప్పుడు రాజ్యం ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడేందుకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. నయా ఉదారవాద విధానాలు ఉనికిలోకి రాకముందు, అంటే బడా పెట్టుబడి ప్రధానంగా ఏ దేశానికి ఆదేశంలోనే వ్యవహరిస్తున్నప్పుడు, అంటే రాజ్యం హద్దుల్లోనే అది ఉన్నప్పుడు, రాజ్యానికి దానిని అదుపు చేయగల సామర్ధ్యం కొంత మేరకైనా ఉండేది. ఇప్పుడు అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిగా కేంద్రీకృతం అయిన తర్వాత రాజ్యానికి ఆ సామర్ధ్యం లేదు. అందుచేత కీన్స్ చెప్పిన పరిష్కారం ఇప్పుడు పని చేయదు.
అంటే, ఇప్పుడు రాజ్యం ఏమీ చేయలేదని నిర్ధారించకూడదు. సైనిక వ్యయం పెంచడం వంటి విషయాల్లో రాజ్యం పాత్ర ఉంటుంది. అలా పెరిగే వ్యయం వలన అదనపు డిమాండ్ కూడా ఏర్పడవచ్చు. నాటో దేశాలన్నీ తమ సైనిక వ్యయాలను తమ తమ జీడీపీలలో ఐదు శాతం వరకూ ఉండేలా పెంచాలని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సూచించాడు. ఒక్క స్పెయిన్ మినహా ఏ ఇతర నాటో సభ్య దేశమూ ఈ సూచనను గట్టిగా వ్యతిరేకించినది లేదు. అయితే, వీటిలో ఏ దేశమూ ఈ అదనపు సైనిక వ్యయం కోసం తమ బడ్జెట్ల ద్రవ్య లోటును పెంచినదీ లేదు. అవన్నీ ప్రజల సంక్షేమ పద్దుల్లో కోతలు పెట్టి సైనిక వ్యయాన్ని పెంచేందుకు పూనుకున్నాయి. అందువలన మొత్తం మీద చూసినప్పుడు అదనపు డిమాండ్‌ను సృష్టించినది ఏమీ లేదు. అందువలన ఆర్థిక మాంద్యం నుండి బైటపడే దారి దొరికినదీ లేదు.
మరి ఆర్థిక మాంద్యం నుండి బయటపడేందుకు నయా ఉదార పెట్టుబడిదారీ వ్యవస్థ ముందు ఉన్న దారి ఏది? డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న కొన్ని చర్యలను పరిశీలిస్తే మనకి సమాధానం దొరకవచ్చు. అలా పరిశీలించినప్పుడు లభించే సమాధానం ఒక్కటే. ‘ఈ వ్యవస్థ తనను తానే మింగివేస్తోంది’!
తక్కిన పెట్టుబడిదారీ దేశాల పట్ల సైతం అమెరికా వ్యవహరి స్తున్న విధానం అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట వేసేవిధంగా ఉంది. మరీ ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల విషయంలో ఇది కనిపిస్తోంది. ఈ దేశాల మార్కెట్లు గతంలో పెట్టుబడిదారీ-పూర్వపు దశలో ఉన్న కాలంలో ఆ దేశాలను తమ వలసలుగా ఆక్రమించుకుని తద్వారా తమ మార్కెట్లకు కావలసిన అదనపు ‘ఉత్తేజాన్ని’ సంగ్రహించాయి సామ్రాజ్యవాద దేశాలు. ఇప్పుడు దాని స్థానంలో అత్యంత సంపన్న పెట్టుబడిదారీ దేశాలు సాపే క్షంగా వెనుకబడ్డ మూడవ ప్రపంచ దేశాల మార్కెట్లను కబళించి అదనపు ‘ఉత్తేజాన్ని’ పొందేందుకు సిద్ధమయ్యాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థలో సాధారణ నియమం ప్రకారం పెట్టుబడిదారీ దేశాలన్నీ మార్కెట్ల కోసం పరస్పరం పోటీ పడతాయి. ఇది నిరంతరాయంగా సాగే పోటీగా ఉంటుంది. ఈ పోటీ ఉండడం న్యాయమే కదా అని అనుకునేవారు ఉన్నారు. ఇటువంటి పోటీకి, సామ్రాజ్యవాదానికి సంబంధం లేదని అనుకుంటారు వారు. కాని అది పూర్తిగా పొరపాటు అభిప్రాయం. వాస్తవానికి అటువంటి న్యాయమైన పోటీయే గనుక ఉండినట్టైతే ఇప్పుడు మూడవ ప్రపంచ దేశాలు అమెరికాను ఆ పోటీలో వెనక్కి నెట్టివేసి తాము ముందుకు దూసుకుపోగలిగిన స్థితిలో ఉన్నాయి (అమెరికన్ ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందించిన రంగాలలో తప్ప- అంటే తమ దేశపు రైతులకు అందించే భారీ సబ్సిడీల వంటివి). అందుచేత ఇప్పుడు అమెరికా తన దేశానికి వెలుపల ఉన్న మార్కెట్లను బలవంతాన, నిర్బంధంగా చేజిక్కించుకోడానికి పూనుకుంటోంది.
ఇలా బలవంతం చేసేందుకు అమెరికా రెండు పద్ధతులను ఉపయోగిస్తోంది. మొదటిది ‘ఏకపక్ష సుంకాలు (వన్ వే టారిఫ్స్). అంటే, తన దేశంలోకి మూడవ ప్రపంచ దేశాల నుండి వచ్చే సరుకులమీద అమెరికా సుంకాలను పెంచుతోంది. అదే సమయం లో ఆ మూడవ ప్రపంచ దేశాల లోకి తాను పంపే సరుకుల మీద పన్నులను పెంచకూడదంటూ ఆంక్షలు విధిస్తోంది. ఇక రెండవ పద్ధతి ‘బలవంతపు దిగుమతులు’ (వన్ వే ఇంపోర్ట్ ఆబ్లిగేషన్స్). ప్రతీ మూడవ ప్రపంచ దేశమూ అమెరికా నుండి తప్పనిసరిగా, తనకు అవసరం ఉన్నా లేకపోయినా, దిగుమతులు చేసుకోవల సిందేనంటూ ఆ దిగుమతుల లక్ష్యాలను అమెరికాయే ఏకపక్షంగా నిర్ణయిస్తోంది. కాని అదే సమయంలో తాను ఆ మూడవ ప్రపంచ దేశం నుండి దిగుమతి చేసుకునే సరుకుల పరిమాణానికి నిర్దిష్ట లక్ష్యం అంటూ ఏమీ లేదు.
అమెరికా-ఇండియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో ఈ రెండు అంశాలూ ఉన్నాయి. అయితే ఆ ఒప్పందాన్ని ఇటీవల అమెరికా లోని ఒక కోర్టు కొట్టివేసింది. అందుచేత మళ్ళీ మరొక దఫా చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందం దాదాపు పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఒప్పందం బహిర్గతం అయిన తర్వాత మనకి అందులో అమెరికా అనుసరిస్తున్న రెండు రకాల నిర్బంధ పద్ధతులనూ చూడవచ్చు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్






కామెంట్లు (0)