ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో రిజర్వేషన్లు, మెరిట్, ప్రమోషన్లపై న్యాయమూర్తి లేవనెత్తిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు రావడం స్వాగతించదగిన విషయం. అయితే ఈ చర్చ రిజర్వేషన్లను బలహీనపరిచే దిశగా కాకుండా రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే దిశగా సాగాలి. రిజర్వేషన్లను వ్యతిరేకించే ముందు ఈ దేశంలో శతాబ్దాలుగా కొనసాగిన కులవివక్ష, అంటరానితనం, సామాజిక అణచివేతను ప్రశ్నించాలి. తరతరాలుగా విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరం చేయబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించకుండా కేవలం మార్కుల ఆధారంగా మెరిట్ గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం? ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ ప్రతిభతో ఓపెన్ కేటగిరీ కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించి ఎంపికైతే వారిని రిజర్వేషన్ కేటగిరీలోకి నెట్టకూడదు. ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలి. ఓపెన్ కేటగిరీ అనేది అన్ని కులాల అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. మెరిట్‌తో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వల్ల ఆయా వర్గాల రిజర్వేషన్ ఖాళీలు తగ్గకూడదు. సుప్రీంకోర్టు కూడా ఈ న్యాయసూత్రాన్ని స్పష్టం చేసింది.
అందుకే నియామకాల్లో, ప్రమోషన్లలో రోస్టర్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. రిజర్వేషన్ ఖాళీలను సక్రమంగా భర్తీ చేయాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి. మెరిట్‌కు గుర్తింపు ఇవ్వడం, రిజర్వేషన్లను రక్షించడం రెండూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలే. రిజర్వేషన్ల వల్ల జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించేవారు, దళితులపై దాడులు, గిరిజనుల భూముల ఆక్రమణలు, విద్యాసంస్థల్లో కులవివక్ష, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల గురించి కూడా మాట్లాడాలి. సామాజిక అసమానతలు కొనసాగుతున్నంతకాలం రిజర్వేషన్ల అవసరం ఉంటుంది. మరోవైపు ఎన్నికల సమయంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి గురించి మాట్లాడే పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదు? ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ రిజర్వేషన్ల అమలుకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదు? ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు ప్రశ్నించాలి.
రిజర్వేషన్లు ఎవరికో ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. అవి భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయహక్కులు. ఆర్టికల్ 14, 15, 16, 16(4A), 335ల స్ఫూర్తికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలి. మార్క్సిస్టు దృక్పథం ప్రకారం ఆర్థిక దోపిడీతోపాటు సామాజిక అణచివేతను కూడా నిర్మూలించాలి. కార్మికులు, కర్షకులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు ఐక్యంగా నిలబడి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి.రిజర్వేషన్ల అమలు కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతో పూర్తయ్యే ప్రక్రియ కాదు. విద్య, ఉపాధి, ప్రమోషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అన్ని రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన భాగస్వామ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం లేకుండా సమానత్వం సాధ్యం కాదు. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, నియామకాల అమలుపై నిరంతర ప్రజా పర్యవేక్షణ అవసరం. రాజ్యాంగ హక్కులను కాగితాలకే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేయించుకోవడం ప్రజాస్వామ్య శక్తుల బాధ్యత. మన పోరాటం ఏ కులానికి వ్యతిరేకం కాదు. కులవివక్షకు, అసమానతలకు, దోపిడీకి వ్యతిరేకం. మెరిట్‌కు గుర్తింపు ఇవ్వాలి. రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయాలి. రోస్టర్ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాలి. రాజ్యాంగ హక్కులను కాపాడాలి. కులవివక్ష లేని సమాజం నిర్మించాలి. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కలిగిన సమసమాజాన్ని సాధించాలి.
- అండ్ర మాల్యాద్రి,
9490300366






కామెంట్లు (0)