Magazines

వస్తున్నాయి..కార్మిక రథచక్రాలు..!

1 గంట క్రితం

The wheels of the workers' chariot are rolling in..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 5 నిమిషాల చదవడం

చెమట చుక్కలే ఇంధనంగా.. హక్కుల నినాదాలే చోదకశక్తిగా.. దేశమంతటా కార్మిక రథచక్రాలు కదం తొక్కు తున్నాయి. వేతనాల పెంపు కోసం ఒకచోట.. ఉద్యోగ భద్రత కోసం మరోచోట.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంకో చోట.. శ్రమజీవులు సమరశంఖం పూరిస్తున్నారు. గురుగ్రామ్‌ నుంచి నోయిడా వరకు.. తెలంగాణ విద్యుత్‌, ఆర్టీసీ నుంచి బ్యాంకుల వరకు.. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి అసంఘటిత కార్మికుల వరకు హక్కుల కోసం పోరుబాట పట్టారు. లాఠీలు, అరెస్టులు, నిర్బంధాలు ఎదురైనా వారి అడుగులు ఆగడం లేదు. పొట్ట నింపుకోవడానికి చెమటోడ్చే చేతులే ఇప్పుడు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పిడికిళ్లు బిగిస్తున్నాయి. అణచివేత ఎంత పెరిగితే.. ప్రతిఘటన అంతగా బలపడుతోంది. కార్మికుల కష్టాలు వ్యక్తిగత వేదనలుగా మిగలకుండా సమష్టి పోరాటాలుగా రూపాంతరం చెందుతున్నాయి.

2026 ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక సమ్మె ఈ ఐక్య పోరాటానికి బలమైన పునాదులు వేశాయి. ఆ స్ఫూర్తితో వేతనాలు, ఉద్యోగ భద్రత, పని గంటల తగ్గింపు, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్య మాలు మరింత విస్తరిస్తున్నాయి. ఈ పోరాటాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాలు లక్షమందితో డిసెంబర్‌ 1న ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. విడివిడిగా రగులుతున్న పోరాటాలు ఐక్య అగ్నిజ్వాలగా మారి, కేంద్ర ప్రభుత్వ కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాల్సిన తరుణమిది.

గురుగ్రామ్‌ నుంచి నోయిడా వరకు.. వేతనాల కోసం రణం

హర్యానాలోని గురుగ్రామ్‌, మానేసర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికుల ఆగ్రహం ఉద్యమంగా ఎగిసిపడింది. పెరుగుతున్న జీవన వ్యయం, అధిక పని గంటలు, కనీస వేతనాల అమలు వంటి సమస్యలు కార్మికులను రోడ్డెక్కిం చాయి. ఏప్రిల్‌ 9న ప్రభుత్వం కనీస వేతనాల బేస్‌ రేటును 35 శాతం పెంచినా, కనీస నెలవారీ వేతనం రూ.30 వేలు ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. వారిలో సుమారు 20 మంది మహిళలు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేకపోయిన ప్రభుత్వం కార్మికుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది.

ఈ సెగ పక్కనే ఉన్న నోయిడాకూ వ్యాపించింది. సుమారు 40 వేల మంది కార్మికులు వేతనాలు, మెరుగైన జీవన పరిస్థితుల కోసం ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు వ్యవస్థ, సామాజిక భద్రత లేకపోవడం, అధిక అద్దెలు, ఎల్పీజీ ధరల పెరుగుదల వారి జీవితాలను భారంగా మార్చాయి. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, 300 మందికి పైగా కార్మికులను అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించారు. అయినా ఉద్యమం వెనక్కి తగ్గలేదు. మానేసర్‌ ఘటనల అనంతరం భారీ పోలీసు నిర్బంధం కార్మికులను మరింత సంఘటితంగా నిలబడాల్సిన అవసరాన్ని చాటింది. యంత్రాల మధ్య నలిగే చేతులు.. బతుకుదెరువు కోసం అలుపెరుగక శ్రమించే మనుషులు.. తమ హక్కుల కోసం ఒక్కటైతే ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కోగలరని ఈ పోరాటాలు నిరూపిస్తున్నాయి.

విద్యుత్‌ పోరాటం.. ఉద్యోగ హక్కుల నుంచి ప్రజాహక్కుల వరకు

తెలంగాణలో జనవరి 28న పదివేల మందికి పైగా విద్యుత్‌ ఉద్యోగులు మింట్‌ కాంపౌండ్‌ వద్ద మహాధర్నా నిర్వహిం చారు. ఆర్టిజన్‌, అన్‌ మ్యాన్డ్‌, పీస్‌రేట్‌ కార్మికుల సమస్యలు ఉద్యమానికి కేంద్రంగా మారాయి. సర్వీస్‌ రూల్స్‌, వేతన సవరణ, ఉద్యోగ భద్రత కోసం ఏప్రిల్‌ 8 నుంచి విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యో గులు సమ్మెకు దిగారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలంటూ నోటీసులు, చర్యల హెచ్చరికలు వచ్చిన ప్పటికీ అనేకమంది కార్మికులు పోరాటాన్ని కొనసాగించారు. జీవనోపాధిని పణంగా పెట్టి మరీ హక్కుల కోసం నిలబడటం వారి పోరాట నిబద్ధతకు నిదర్శనం.ఉత్తరప్రదేశ్‌, మహా రాష్ట్ర, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉద్యోగులు ప్రైవేటీకరణ, ఫ్రాంచైజీ విధానం, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మహారాష్ట్రలో డిస్కామ్‌ల ప్రైవేటీకరణ, ఫ్రాంచైజీలు, ఐపీఓలు, విద్యుత్‌ ఉత్పత్తి–ప్రసార రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్య లను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. 333 సబ్‌స్టేషన్లను అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నిర్వహించడాన్ని నిరసిస్తూ ఆగస్టు 5న నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు.

విద్యుత్‌ రంగ పరిరక్షణ అంటే ఉద్యోగుల భద్రత మాత్రమే కాదు.. ప్రజలకు చౌక విద్యుత్‌, రైతులకు సబ్సి డీలు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కూడా. అందుకే విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సైతం ఉద్యోగులతో చేతులు కలుపు తున్నాయి. హక్కుల కోసం మొదలైన పోరాటం ప్రజల ప్రయోజనాలను కాపాడే విస్తృత ఉద్యమంగా మారుతోంది.

హర్యానా మున్సిపల్‌ కార్మికుల 37 రోజుల సమ్మె మరో పోరాట దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఖాళీల భర్తీ, వేతనాలు, భద్రత, కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం వారు సమ్మెకు దిగారు. నెలకు పైగా సాగిన ఆందోళనతో అనేక నగరాల్లో చెత్త పేరుకుపోయి ప్రజారోగ్య సమస్య తలెత్తింది. చివరకు ప్రభుత్వం చర్చలకు దిగింది. కొన్ని డిమాండ్లపై హామీలు, స్వీపర్లకు నెలకు రూ.2,100 వేతన పెంపు లభించాయి. పట్టణాలను శుభ్రంగా ఉంచే కార్మికుల శ్రమ వెనుక ఉన్న కష్టాన్ని, వారి పోరాటాన్ని ఈ సమ్మె దేశం ముందుంచింది.

ఆర్టీసీ నుంచి బ్యాంకింగ్‌ వరకు.. 
హక్కుల కోసం సమరం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, యూనియన్‌ ఎన్నికలు, పీఎఫ్‌, సీసీఎస్‌ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత వారి ప్రధాన డిమాండ్లు. చర్చల అనంతరం ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది. కర్ణాటకలో కెఎస్‌ఆర్టీసీ, బీఎంటీసీ, ఎన్‌డబ్ల్యూకేఆర్టీసీ, కేకే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా సుదీర్ఘకాలంగా వివిధ రూపాల్లో పోరాటాలు కొనసాగిస్తున్నాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే కార్మికులే తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారి సమ్మెలు కేవలం ఉద్యోగుల సమస్యగా చూడలేం.. ప్రజా రవాణా వ్యవస్థ భవిష్యత్తుతోనూ ముడిపడి ఉన్నాయి. మరోవైపు బ్యాంకు ఉద్యోగులు ఐదురోజుల పనివారం, వేతనాలు, పెన్షన్‌, ఖాళీల భర్తీ, పని భారం తగ్గింపు, ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకత, ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. జనవరి 2026లో సుమారు ఎనిమిది లక్షల మంది పాల్గొన్న పోరాటం తర్వాత కూడా ఉద్యమం కొన సాగింది. సమ్మెలు, నిరసనలు, నిరవధిక సమ్మె హెచ్చరికలతో బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లపై పట్టుదలగా నిలుస్తున్నారు.

సూరత్‌ నుంచి మహారాష్ట్ర వరకు..

అసంఘటిత శ్రమశక్తి గళం

సూరత్‌ వస్త్ర పరిశ్రమలో ఆగస్టు 16న అమ్రోలి ప్రాంతంలోని వేదాంత ఎకో పార్క్‌-2లో రెండు ఎంబ్రాయిడరీ యూనిట్ల వద్ద ప్రారంభమైన నిరసనలు వేగంగా విస్తరించాయి. పన్నెండు గంటల పనికి బదులు ఎనిమిది గంటల పని, ఆదివారం సెలవు, వేతన పెంపు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు కోసం వేలాది మంది కార్మికులు ఆందోళన చేశారు. అమ్రోలి, కటార్గామ్‌, సచిన్‌, పిపోదరా, కడోదరా, ఉధ్నా, పాండేసరా ప్రాంతాలకు ఉద్యమం విస్తరించింది. యూనిట్లు మూతపడి ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్రోలీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆగస్టు 17న ఐదు వందల మంది కార్మికులపై కేసు నమోదు చేయగా, మూడు వందలకు పైగా కర్మాగారాలు మూతపడ్డాయి.

సెప్టెంబర్‌ 12న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కార్మికులు డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోజంతా యంత్రాల ముందు నిలబడి పనిచేసే కార్మికులకు విశ్రాంతి, న్యాయమైన వేతనం కావాలన్న డిమాండ్‌ కూడా పోరాటంగా మారాల్సి రావడం శ్రమజీవుల దుస్థితిని తెలియజేస్తోంది. కేసులు, నిర్బంధాల మధ్య కూడా తమ గొంతు వినిపించడం వారి తెగువకు నిదర్శనం.

మహారాష్ట్రలో ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, ఐసీడీఎస్‌ కార్యకర్తలు నెలకు రూ.30 వేల వేతనం, ఉద్యోగాల శాశ్వతీకరణ కోసం జూన్‌ 1న ముంబై ఆజాద్‌ మైదాన్‌లో భారీ నిరసన చేపట్టారు. కర్నాటకలో అంగన్‌వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని ఉద్యమం సాగింది. ఉత్తరప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తల పోరాటంతో నెలకు రూ.12 వేల గౌరవ వేతనం, రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.తెలంగాణలో ఆశా వర్కర్లు రూ.18 వేల స్థిర వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కోసం ఫిబ్రవరిలో హెల్త్‌ డైరెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. మార్చిలో జిల్లాల్లో ఉద్యమాలు, సెప్టెంబర్‌లో చలో అసెంబ్లీ నిర్వహించారు. ప్రజారోగ్యం, బాలల సంరక్షణలో కీలక పాత్ర పోషించే ఈ కార్యకర్తల శ్రమకు తగిన గుర్తింపు దక్కాలన్న డిమాండ్‌ నిర్బంధాలు, అరెస్టుల మధ్యనూ బలంగా వినిపిస్తోంది.

విడివిడి పోరాటాలు.. మహా ఉద్యమంగా!

కరోనా కాలంలో రైతులు పదమూడు నెలల పాటు ఢిల్లీని చుట్టుముట్టి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయించ గలిగారు. నీట్‌ పేపర్‌ లీకులపై, విద్యారంగంలో జవాబుదారీ తనం కోసం విద్యార్థులు ఉద్యమించారు. ప్రజా మద్దతుతో కూడిన సంఘటిత పోరాటం ప్రభుత్వ విధానాలను మార్చగలదని ఈ అనుభవాలు నిరూపించాయి.ఇప్పుడు దేశవ్యాప్తంగా రగులుతున్న కార్మిక పోరాటాల ముందున్న కర్తవ్యం కూడా అదే. ఒకచోట అరెస్టులు.. మరోచోట నిర్బంధాలు.. ఇంకోచోట ఉద్యోగాలు కోల్పోతామన్న భయం.. అయినా హక్కుల కోసం అడుగు ముందుకే వేస్తున్న శ్రమజీవుల స్ఫూర్తి దేశానికి దిక్సూచి కావాలి. ఒక్కో పరిశ్రమలో వినిపించే నినాదం దేశవ్యాప్త గర్జనగా మారాలి. కార్మికుల కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు ఐక్య ఉద్య మానికి పునాదులు కావాలి. రంగాలు వేరైనా సమస్యల మూలాలొక్కటే కాబట్టి పోరాటాలూ ఒక్కటవ్వాలి. కదులుతున్న కార్మికుల రథచక్రాలు ఆగకూడదు.. అణచివేతకు తలవంచని శ్రమజీవుల అడుగులు మరింత వేగం పుంజుకోవాలి. విడివిడి పోరాటాలు మరో మహాప్రస్థానంగా మారాలి. డిసెంబర్‌ 1 ఢిల్లీ ముట్టడి కార్మిక-కర్షక ఐక్యతకు, దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి నాందివాచకం కావాలి.

గీట్ల ముకుంద రెడ్డి, 94900 98857

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్