ఏడాది క్రితం ఏర్పడిన ఫ్రెంచి మైనారిటీ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోనుందా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను అధికారంలో ఉన్న సెబాస్టియన్ లీకోర్ను సర్కార్‌కు కేవలం 211 మంది సభ్యులు మద్దతు మాత్రమే ఉంది. ప్రతిపక్షాల సంఖ్య 366గా ఉంది. లోటు బడ్జెట్‌ను భారీగా తగ్గించనున్నట్లు లీకోర్ను రెండు వారాల క్రితం ప్రకటించాడు. అంతకంటే ముందే కోతలను ప్రారంభించటంతో పాఠశాలల విద్యార్థులు సెప్టెంబరు 17 నుంచి ఆందోళన ప్రారంభించారు. అది చినికి చినికి గాలివానలా మారి దేశమంతటా లక్షలాది మందిని వీధుల్లోకి తెస్తున్నది. ఈ ఆందోళనను దమనకాండతో అణచివేయాలని చూస్తుండటంతో ఉపాధ్యాయులు, కార్మికవర్గం కూడా వారికి మద్దతు ఇస్తున్నది. మంగళవారం అనేక పట్టణాల్లో జరిగిన ప్రదర్శనల్లో లక్ష లాది మంది విద్యార్థులు, ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈనెల 17న మరింత పెద్దఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు.
విద్యారంగంలో సంస్కరణల పేరుతో పాఠశాలల మూత, నిధుల కోత వంటి చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. శిథిల మౌతున్న పాఠశాలల భవనాలు, మరమ్మ తుల లేమి, టీచర్లు, ఇతర సిబ్బంది కొరత, తరగతుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కిక్కిరిసిపోవటం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆందోళనకు దిగినవారిలో ఆరువేల మంది నిరసనకారులను అరెస్టు చేస్తే వారిలో 85శాతం మంది 18 సంవత్సరాలలోపు వయస్సు వారే ఉన్నారు. ఒకరికి కన్ను పోయింది, అనేక మందికి కాళ్లు చేతులు విరిగాయంటే దమనకాండ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
విచ్చలవిడిగా లాఠీల ప్రయోగం, బాష్పవాయు గోళాల ప్రయోగం, రబ్బరు బుల్లెట్లతో కాల్పులకు తెగబడ్డారు. ప్రభుత్వం యుద్ధానికి చేస్తున్న ఖర్చు నిలిపివేసి పాఠశాలల వంటి వాటికి ఖర్చు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
అనేక దేశాల్లో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ పశ్చిమ దేశాలు జరిగిన ఉదంతాలను ఆయుధాలుగా చేసుకోవటం తెలిసిందే. అల్లుడికి బుద్ధిచెప్పిన మామ అదే తప్పుడు పనిచేసినట్లు ఫ్రెంచి ప్రభుత్వ తీరును ఇరాన్ ఎత్తి చూపింది. విద్యార్థుల నిరసన సందర్భంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నా రంటూ విచారణ జరపాలని ఇరాన్ డిమాండ్ చేసింది. టెహరాన్‌లోని ఫ్రెంచి రాయబారిని ఇరాన్ విదేశాంగశాఖ పిలిపించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తాము నిరసిస్తున్నట్లు తెలిపింది. తమ పాఠశాలలను కాపాడాలంటూ వీధుల్లోకి వచ్చిన పిల్లలపై ఫ్రెంచి పోలీసులు వ్యవహరించిన తీరును యావత్ ప్రపంచం వీక్షించి నివ్వెరపోయింది. పోలీసులు రవాణా బస్సులు, ట్రామ్ ఇతర సేవలను నిలిపివేశారు. విద్యార్థులపై యుద్ధానికి దిగుతున్నట్లు ప్రవర్తించారు. గత శతాబ్దిలో 1968లో అదే ఫ్రాన్సులో విద్యార్థులపై దమనకాండకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఆ దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మూడింట రెండువంతుల మంది కార్మికులు సమ్మె జరిపి ప్రదర్శనలు చేశారు. చివరకు నాటి అధ్యక్షుడు డీ గాల్ ప్రదర్శనల ధాటికి భయపడి పశ్చిమ జర్మనీకి వెళ్లాడంటే ప్రజాగ్రహం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వెంటనే తిరిగి వచ్చి పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు ఆదేశించాడు. ఇప్పుడు అధ్యక్షుడు మక్రాన్ ఏం చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల వెనుక కమ్యూనిస్టు కుట్ర ఉందని నయా ఫాసిస్టు పార్టీ నేషనల్ రాలీ(ఆర్‌ఎన్), మక్రాన్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తూ ఆందోళన అణచివేతను సమర్థిస్తున్నాయి.
వామపక్ష ఫ్రాన్స్ అన్‌బౌవ్‌డ్ పార్టీ(ఎల్‌ఎఫ్‌ఐ) దీని వెనుక ఉందని మంత్రివర్గ సమావేశానికి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. పార్లమెంటులో 71 స్థానాలతో ఈ పార్టీ మూడవ స్థానంలో ఉంది. ఈ పార్టీల ఎంపీల పర్యవేక్షణలో హింసాకాండ జరిగిందని నయాఫాసిస్టు ఆర్‌ఎన్ పార్టీ నేత మారినే లీపెన్ ఆరోపించింది. రాజకీయంగా ముప్పు ఉందని తెలిసినప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్‌లో రక్షణ రంగానికి మినహా మిగిలిన శాఖల్లో 54 బిలియన్ల యూరోల వరకు పథకాలకు కోతలు విధించ నున్నట్లు ప్రధాని లీకోర్ను ప్రకటించాడు. వాటిలో పెన్షన్ల పెంపుదల నిలిపివేత, పన్నుల పెంపు వంటి అంశాలు కూడా ఉన్నాయి.
ఆర్‌ఎన్ పార్టీ అయితే 125 బిలియన్ల వరకు కోత విధించాలని, కార్పొరేట్లపై ఎలాంటి భారం మోపవద్దని సూచిం చింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించాయి. వర్తమాన సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 0.5శాతం మాత్రమే ఉంటుందని అంచనా. మరోవైపు గతేడాది కంటే రుణాలపై వడ్డీ చెల్లింపు నాలుగోవంతు పెరిగి 65 బిలియన్ యూరోలకు చేరింది. అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల ప్రభావం, పశ్చిమాసియా సంక్షోభంతో పాటు చైనా మార్కెట్‌ను కోల్పోవటంతో ఫ్రాన్స్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది!
రాజకీయ సంక్షోభ దిశగా ఫ్రాన్స్! !
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)