– కేంద్రానికి మద్దతుగా ఉంటాం
– జమ్మూకాశ్మీర్‌లో అఖిలపక్ష సమావేశం నిర్ణయం
– ఇతర ప్రాంతాల్లోని కాశ్మీర్ విద్యార్థులకు, ప్రజలకూ రక్షణ ఇవ్వండి
– తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన పార్టీలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పహల్గాం దాడి నేరస్తులపై చర్యలకు కేంద్రానికి మద్దతుగా ఉంటామని జమ్మూకాశ్మీర్‌లోని అన్ని పార్టీలు ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. గురువారం శ్రీనగర్‌లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రవేశపెట్టన తీర్మానాన్ని పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ దాడిని ‘కాశ్మీరీయత్ విలువలు, భారతదేశం ఆలోచనపై ప్రత్యక్ష దాడి’ అని ఆయా పార్టీల నాయకులు అభివర్ణించారు. సమావేశం అనంతరం విలేకరులతో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ పహల్గామ్ దాడి నేపథ్యంలో కాశ్మీరీలను వేధింపుల నుంచి రక్షించాలని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరారు. అమాయక పౌరులపై జరిగిన అనాగరిక దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురయ్యామన్నారు. సమిష్టి సంఘీభావ స్ఫూర్తితో తీర్మానాన్ని ఆమోదించామన్నారు. క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదని, ఇవి కాశ్మీరీయత్ విలువలపై, ఈ ప్రాంత ఐక్యత, శాంతి, సామరస్యానికి చిహ్నంగా ఉన్న భారతదేశం ఆలోచనపై ప్రత్యక్ష దాడి అని ఆయన అన్నారు. నేరస్థులను న్యాయం ముందు నిలబెట్టడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పార్టీలు నిబద్ధతతో ఉన్నాయని అబ్దుల్లా వెల్లడించారు. ఏ ఉగ్రవాద చర్య కూడా వారి దృఢ సంకల్పాన్ని బలహీనపరచలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడిలో బాధిత కుటుంబాలకు నాయకులందరి తరఫున ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. పహల్గాంలో తన గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్లే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదులతో పోరాడి పర్యాటకులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాన్ని గుర్తుచేసుకుంటూ, అతని త్యాగానికి తీర్మానం నివాళులర్పించిందని అబ్దుల్లా తెలిపారు. ఈ తీర్మానం రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి, జమ్మూ కాశ్మీర్ శ్రేయస్సు, స్థిరత్వం కోసం సహకారంతో పనిచేయడానికి సమిష్టి సంకల్పాన్ని పునరుద్ఘాటించేందుకు చేశామని ఆయన వెల్లడించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత దేశవ్యాప్తంగా కాశ్మీరీ విద్యార్థులు, పౌరులపై పెరుగుతున్న వ్యతిరేకతను ప్రస్తావిస్తూ ఇంటి నుంచి దూరంగా ఉన్న కాశ్మీరీ విద్యార్థులు, పౌరులను రక్షించడానికి అచంచలమైన నిబద్ధతతో ముందుకు రావాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు, కమ్యూనిటీ నాయకులు, మత సంస్థలు, యువజన సంఘాలు, పౌర సమాజ సంస్థలు, మీడియా సంస్థలు జమ్మూ కాశ్మీర్ సామరస్యాన్ని దెబ్బతీసేలా చేసే చర్యలను ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత శాంతి, అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం కొనసాగించాలని అఖిలపక్ష సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు యూసఫ్ తరిగామి, కాంగ్రెస్, పీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల అగ్ర నాయకులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
అమాయక పౌరులపై దాడి అనాగరికం
- Advertisement -
RELATED ARTICLES