– భారత్‌పై అమెరికా ఒత్తిడి
వాషింగ్టన్: భారత రిటైల్ రంగం, చిరు వ్యాపారాలు తీవ్ర ప్రమాదంలో పడేలా అమెరికా ఒత్తిడి ప్రారంభమైంది. తమ దేశానికి చెందిన అమెజాన్, వాల్‌మార్ట్ లాంటి ఈ-కామర్స్ సంస్థలపై ఇండియా విధిస్తోన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని పట్టుపడుతోందని డోనాల్డ్ ట్రంప్, పరిశ్రమ ఎగ్జిక్యూటివ్స్, లాబీయిస్టులు, యూఎస్ ప్రభుత్వ అధికారుల్ని ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై ఇటీవల 26 శాతం టారిఫ్‌ను విధించిన విషయం తెలిసిందే. దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా యూఎస్ ఈ కామర్స్ సంస్థలపై అమలు చేస్తోన్న పలు నిబంధనలను తొలగించాలని చర్చల్లో అమెరికా ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. భారత్‌కు చెందిన ఈ-కామర్స్ రంగంలోని సంస్థలకు ఇస్తున్న స్థాయిలోనే మిగితా అన్ని సంస్థలకు సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. గతేడాది వాల్‌మార్ట్ అధినేత మెక్‌మిలన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమై భారత్‌లో ఈ కామర్స్ కంపెనీలపై ప్రభుత్వం విధించిన నిబంధనలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. భారత్‌లో అన్ని సంస్థలకు ఒకే విధానాన్ని అమలు చేసేలా చూడాలని కోరారు.
భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.10 లక్షల కోట్లు)గా ఉంది. ఇందులో అమెజాన్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ కీలక వాటాను కలిగి ఉన్నాయి. అమెజాన్‌కు 4 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు 5 కోట్ల చొప్పున డైలీ యాక్టివ్ వినియోగదారులున్నారు. అమెజాన్ 32 శాతం, ఫ్లిప్‌కార్ట్ 38 శాతం చొప్పున మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
భారత్‌లో విదేశీ ఈ-కామర్స్ సంస్థలు ఇతరులు తయారు చేసిన వస్తువులను మాత్రమే విక్రయించాలని ప్రధాన నిబంధన ఉంది. విదేశీ యాజమాన్యంలోని ఆన్‌లైన్ కంపెనీలు ఇన్వెంటరీ కలిగి ఉండటంతో పాటు, వినియోగదారులకు నేరుగా అమ్మడంపై నిషేధాలు ఉన్నాయి. కాగా.. దేశీయ కంపెనీలు సొంతంగా తయారు చేసుకున్న ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వీలుంది. దీన్ని ప్రధానంగా అమెరికా తప్పు పడుతోంది. దీనిని టారీఫేతర అడ్డంకిగా అమెరికా ఆరోపిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పరిమితిని కూడా ఇలానే పోలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చల సమయంలో తమ దేశ ఈ-కామర్స్ దిగ్గజాల అభిప్రాయాలు, డిమాండ్‌లను అమెరికా చాలా జాగ్రత్తగా భారత్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్టు ఫైనాన్సీయల్ టైమ్స్ వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత ఈ-కామర్స్ మార్కెట్‌ను తమ సంస్థలకు అనుకూలంగా మరింతగా తెరవాలని భారత్‌పై ఒత్తిడి తీసుకొస్తోందని తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులను స్వాగతించవచ్చని.. అలాగని భారత రిటైల్ మార్కెట్‌ను ఇష్టానుసారం మార్చేసి చిరు వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బతీయడం ఎంత మాత్రం సరికాదని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ పేర్కొన్నారు. ఒక వేళ వాల్‌మార్ట్, అమెజాన్‌లకు భారత్ మార్కెట్‌లో ఆంక్షలు లేని అనుమతులు ఇస్తే ఇవి నేరుగా దుకాణాలు తెరిచి ఇక్కడి రిటైల్ మార్కెట్‌ను పూర్తిగా నాశనం చేయనున్నాయని రిటైల్ వర్తకుల ప్రధాన ఆందోళనగా ఉంది.
అమెజాన్, వాల్‌మార్ట్‌లపై నిబంధనలు తొలగించాలి
- Advertisement -
RELATED ARTICLES