– తగ్గిన విద్యార్థి వీసాలు
– ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే 30 శాతం తగ్గుదల
– దరఖాస్తులతో పాటే పెరుగుతున్న తిరస్కరణలు
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే భారతీయులకు జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య 30 శాతం మేర తగ్గిపోయింది. అన్ని దేశాలకు కలిపి అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాలలో నమోదైన 4.75 శాతం తగ్గుదలతో పోలిస్తే ఇది బాగా ఎక్కువ. పైగా చైనా, వియత్నాం, జపాన్ విద్యార్థులకు జారీ చేసిన వీసాలతో పోలిస్తే మన విద్యార్థులకు జారీ చేసిన వీసాలు చాలా తక్కువగా ఉన్నాయి. భారతీయులు సహా వెయ్యి మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రద్దు చేసిన తరుణంలో వెలువడిన ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం అమెరికాలోని 170 కళాశాలలకు చెందిన 1,100 మంది విద్యార్థులు వీసాల రద్దుతో ఇబ్బందులు పడ్డారు.
న్యూఢిల్లీ: తమ వీసాలు రద్దు చేయడంపై పలువురు విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారిలో న్యూ హ్యాంప్‌షైర్‌లోని రివియర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందబోతున్న మణికంఠ పసుల కూడా ఉన్నారు. మిచిగాన్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేస్తున్న చిన్మయి దియోరేతో పాటు మరో నలుగురు కూడా దావాలు వేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. గతంలో చట్టాన్ని అనుసరించాలని సుద్దులు చెప్పిన కేంద్రం ఇప్పుడు బాధిత విద్యార్థులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాలలో సవాలు చేయాలని హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు సూచిస్తోంది.
ఇతర దేశాలతో పోలిస్తే…
ఫిబ్రవరిలో అమెరికా మొత్తంమీద 6,804 ఎఫ్-1 వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన 7,143 వీసాలతో పోలిస్తే 4.75 శాతం తగ్గుదల కన్పిస్తోంది. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 వీసాల సంఖ్య 1,179 నుండి 1,117కు (5.2 శాతం), జపాన్ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 500 నుండి 452కు (9.6 శాతం), వియత్నాం విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 326 నుండి 302కు (7.4 శాతం) తగ్గింది. భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 590 నుండి 411కు…అంటే ఏకంగా 30 శాతం తగ్గింది.
సుదీర్ఘ కాలం ఎదురు చూపులు
అదీకాక ఇతర దేశాల రాజధానులలో విద్యార్థులు వేచి చూసే కాలంతో పోలిస్తే ఢిల్లీలో విద్యార్థి వీసాల కోసం వేచి చూసే కాలం బాగా ఎక్కువగా ఉంది. ఎక్స్ఛేంజ్ విజిటర్లు సహా వీసాల కోసం భారతీయ విద్యార్థులు వేచి చూస్తున్న కాలం సగటున 58 రోజులుగా ఉంటోంది. ఈ సమయం టోక్యోలో 15 రోజులు, హనోరు, బీజింగ్‌లో కేవలం రెండు రోజులు మాత్రమే. ట్రంప్ దుందుడుకు విధానాల కారణంగా విద్యార్థి వీసాల సంఖ్య తగ్గిపోతోంది. ఇది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా ప్రభుత్వ విధానాల కారణంగా అంతర్జాతీయ విద్యార్థులు ఇబ్బందులు పడడం ఇది మొదటిసారి కాదు. కోవిడ్ సమయంలో అంతర్జాతీయ విద్యార్థి కార్యక్రమాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఆ తర్వాత వాటి సంఖ్య పెరిగింది. దానితో పాటే తిరస్కరణలూ పెరిగాయి. గత సంవత్సరం 41 శాతం విద్యార్థి వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వాస్తవానికి 2023, 2024లో ఐదు లక్షల మంది విద్యార్థులకు వీసాలు నిరాకరించారు.
అమెరికా చదువులొద్దు
- Advertisement -
RELATED ARTICLES