Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలు'ఆక్వా' ఆగం

‘ఆక్వా’ ఆగం

– అమెరికా సుంకంతో భారీగా పడిపోయిన రొయ్యల ధరలు
– ఆంధ్రప్రదేశ్‌ ట్రేడర్లే కావడంతో కొనుగోళ్లకు నిరాసక్తత
– రాష్ట్రంలో ఐదు లక్షలు.. ఖమ్మం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు
– గిట్టుబాటు కాక.. కొనే దిక్కులేక సంవత్సరాల తరబడి క్రాప్‌ హాలీడే
-ఏపీతో పాటు తెలంగాణ రైతుల పైనా ప్రభావం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
చేపలు, రొయ్యలు, చికెన్‌, ఇతరత్ర ఆహార పదార్థాల దిగుమతిపై అమెరికా సుంకం విధించడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగంపైనా పడింది. ముఖ్యంగా చేపలు, రొయ్యల పెంపకందారులపై ధరల ఎఫెక్ట్‌ అధికంగా ఉంది. ఏపీ సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో రొయ్యల పెంపకం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్‌ చేపట్టగా.. దీనిలో అధికభాగం ఎప్పటి నుంచో క్రాప్‌హాలిడేనే ఉంటోంది. కారణం గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్తకులు కావడంతో ఇక్కడికి వచ్చి కొనేందుకు ఆసక్తి చూపటం లేదు. అంతర్జాతీయంగా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటేనే వ్యాపారులు తెలంగాణ వరకు వచ్చి కొనుగోలు చేస్తారు. కానీ అమెరికా రొయ్యల దిగుమతిపై 26శాతం సుంకం విధించింది. అయితే ఇది అమల్లోకి రావడానికి 90 రోజుల వరకు ఆ దేశ అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ గడువు పెట్టారు. కానీ స్థానిక వ్యాపారులు అవేవీ పట్టించుకోకుండా తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు రొయ్యల పేరుతో మత్స్యశాఖ నుంచి రుణాలు పొంది చేపల పెంపకం చేపడుతున్నారు. కొందరు నిషేధిత ఫంగస్‌ చేపలను సైతం పెంచుతున్నారు. కొందరు సంవత్సరాల తరబడి క్రాప్‌హాలీడే తీసుకుంటున్నారు.
ఆంధ్రా సరిహద్దుల్లోనే ఎక్కువగా పెంపకం..
ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనే కొంత మేరకు రొయ్యల పెంపకం చేపడుతున్నారు. బోనకల్‌, చింతకాని, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, కల్లూరు, మధిర, సత్తుపల్లి తదితర మండలాల్లో మొత్తం వెయ్యి ఎకరాల వరకు ఆక్వా కల్చర్‌ సేద్యం ఉన్నట్టు మత్స్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఆంధ్రా సరిహద్దులోనే పెంచుతున్నారు. ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఏపీ సరిహద్దులో అక్కడక్కడా ఆక్వా కల్చర్‌ సాగవుతోంది. కొందరు రైతులు పొలాల్లోనే రొయ్యల పెంపకం చేపడుతున్నారు. మొత్తమ్మీద రొయ్యల పెంపకం వ్యయప్రయాసలతో కూడినది కావటం, పెట్టుబడి, శ్రమకు తగినట్టుగా లాభాలు లేకపోవడం, దొంగల భయం కూడా ఎక్కువగా ఉండటంతో దీనిపై రోజురోజుకు ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షులు దిగుమతి సుంకం విధించటంతో ఉన్న కొద్దిమంది రైతులు కూడా ఆక్వా కల్చర్‌ జోలికి వెళ్లని పరిస్థితి కనిపిస్తోంది.
పెట్టుబడి ఎక్కువ.. లాభాలు తక్కువ..
ఆక్వా కల్చర్‌లో పెట్టుబడి భారీగా అవుతోంది. కానీ దానికి తగినట్టుగా కనీస ధరలు కూడా రాని దుస్థితి ప్రస్తుతం ఉంది. ఈ క్రమంలోనే రైతులు క్రమేణా రొయ్యల పెంపకాన్ని వదిలివేస్తున్నారు. సుంకాల ప్రకటనకు ముందు కిలో రూ.470 ఉన్న ధరలు ప్రస్తుతం రూ.400 వరకే ఉన్నాయని రైతాంగం చెబుతోంది. కొనుగోలు చేసేది ట్రేడర్లే అయినా చివరకు సరుకు చేరేది వ్యాపారులకేనని రైతాంగం చెబుతోంది. వ్యాపారులు నిర్ణయించిన ధరకు ఒక్కపైసా కూడా ట్రేడర్లు ఎక్కువ పెట్టడం లేదని వాపోతున్నారు.. ఒక్కో రొయ్య పిల్లను 35 పైసల చొప్పున కొనాలి. ఎకరానికి రెండు లక్షలకు పైగా పిల్లలను వేయాలి. వీటిని 24 గంటల పాటు పర్యవేక్షించడానికి అనుక్షణం ముగ్గురైనా కూలీలు పనిచేయాలి. మూడు పూటలా దాణావేయాలి. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి. చెరువులో మురుగునీరు నిల్వ ఉండకుండా ఇన్లెట్‌తో ఉండాలి. రొయ్యలు తినడానికి ఆల్లే, క్రిమి లార్వా అందిస్తుండాలి. చెరువు నీళ్లలో రసాయనాలు, ఇతరత్ర క్రిమిసంహారక మందులు కలవకుండా చూసుకోవాలి. చెరువులో చేపలు, ఇతర ఉభయచరాలు లేకుండా చూసుకోవాలి. నీటి పీహెచ్‌ బ్యాలెన్స్‌ 10 కంటే తక్కువగా ఉండాలి. నీటిని ఎప్పటికప్పుడూ మారుస్తుండాలి. 38శాతం ప్రొటీన్‌ ఉన్న గుళికలు, ఆల్గే, క్రిమిలార్వా, పాచిని రొయ్యలకు ఆహారంగా ఇవ్వాలి. అన్నీ సక్రమంగా సమకూర్చితే మూడు నుంచి నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి అవుతుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సుంకం ప్రభావంతో ట్రేడర్లు ముందుకు రావట్లేదని రైతులు వాపోతున్నారు. స్థానిక మార్కెట్లో అమ్మటం, లేదంటే ఆంధ్రాలోని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేయటం మినహా మరో గత్యంతరం లేదని ఆక్వా కల్చర్‌ రైతాంగం వాపోతోంది.
ఆశాజనకంగా లేక చేపల పెంపకం : పోకల మురళి, ఖానాపురం, ముదిగొండ మండలం
ఆక్వా కల్చర్‌ ఆశాజనకంగా లేకపోవడంతో చేపల పెంపకం చేపట్టాం. మొత్తం ఐదు ఎకరాల్లో నీళ్లు ఉన్నాయి. మిగిలిన ఐదు ఎకరాల్లో నీళ్లు లేకపోవడంతో సీజనల్‌ వారీగా చేపడుతున్నాం. మహబూబాబాద్‌ జిల్లా మన్నెగూడెంలో మా బంధువులు స్టాంపే రొయ్యల పెంపకం చేపట్టారు. గిట్టుబాటు కాకపోవడంతో వాళ్లు కూడా ఈ ఏడాది నుంచి తెల్లచేప పెంపకం చేపడుతున్నారు. రొయ్యల పెంపకం అత్యంత సున్నితంగా ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఖర్చులు కూడా బాగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ధరలు ఉంటాయి. ఇప్పుడు అమెరికా సుంకం అంటున్నారు. కాబట్టి చాలా మంది ఆక్వా కన్నా చేపల పెంపకం బెటరని చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img