– సమాచారాన్ని తొలగించాలంటూ నోటీసులు
– గత ఆరు నెలల్లో 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు
– లక్షకు పైగా లింకులను బ్లాక్ చేయాలని హుకుం
– ధిక్కరిస్తే చట్టపరమైన రక్షణలకు స్వస్తి
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆన్‌లైన్ వేదికల గొంతు నొక్కుతోంది. గత సంవత్సరం అక్టోబర్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ వరకూ గూగుల్, యూట్యూబ్, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సహా 130 వేదికలకు ప్రభుత్వం సెన్సార్‌షిప్ ఆదేశాలు (కంటెంట్ నోటీసులు) జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) నేతృత్వంలోని సహయోగి పోర్టల్ కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. 2000వ సంవత్సరపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 79 (3) (బి) ప్రకారం జారీ అయిన ఈ నోటీసులు ఆయా వేదికలలోని సమాచారాన్ని నిరోధించే ఆదేశాలుగా పనిచేస్తాయి. ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ చేయడానికి సాధారణంగా చట్టంలోని 69 (ఏ) సెక్షన్‌ను వర్తింపజేస్తారు.
అయితే ఎలన్ మస్క్ యాజమాన్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయా లేదా అనేది తెలియరాలేదు. ఎందుకంటే ఎక్స్ వేదిక ఇంకా సహయోగ్ పోర్టల్‌లో చేరలేదు. నోటీసుల జారీని వేగవంతం చేసేందుకు ఈ పోర్టల్‌ను గత సంవత్సరమే ప్రారంభించారు. వాస్తవానికి దీనిని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదిక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సహయోగ్ పోర్టల్‌ను ‘సెన్సార్‌షిప్’ పోర్టల్‌గా అభివర్ణించింది. కాగా ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో 69 (ఏ) సెక్షన్‌ను ప్రయోగించి ఐటీ మంత్రిత్వ శాఖ వివిధ ఆన్‌లైన్ వేదికలకు 785 నోటీసులు జారీ చేసింది.
ఐటీ చట్టంలోని 79 (3) (బి) ప్రకారం ప్రభుత్వ సంస్థ నిర్ధారించిన సమాచారాన్ని బ్లాక్ చేయడంలో ఎక్స్ వంటి ఆన్‌లైన్ సంస్థలు విఫలమైతే వాటికి చట్టపరంగా ఎలాంటి రక్షణ లభించదు. ఈ సెక్షన్ కింద వేర్వేరు కారణాలతో ఆదేశాలు జారీ చేయవచ్చు. అదే సెక్షన్ 69 (ఏ) అయితే దేశ భద్రత, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన నేరాలకు మాత్రమే పరిమితమవుతుంది. అభ్యంతరకరంగా భావిస్తున్న సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఈ రెండు సెక్షన్లను ఉపయోగించుకొని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా ఆన్‌లైన్ వేదికలను ఆదేశించవచ్చు. అయితే సెక్షన్ 69 (ఏ) కింద కేంద్ర ప్రభుత్వం మాత్రమే నోటీసులు జారీ చేయగలదు. ఐటీ చట్టంలోని 79 (3) (బి) కింద కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నోటీసులు జారీ చేయవచ్చు. వీటిని అతిక్రమించి సమాచారాన్ని తొలగించని పక్షంలో మెటా, ఎక్స్, గూగుల్ వంటి కంపెనీలు చట్టపరమైన రక్షణను కోల్పోయే అవకాశం ఉంది.
సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఐటీ చట్టంలోని 79 (3) (బి) కింద ఆదేశాలు జారీ చేయడం గత రెండు సంవత్సరాల కాలంలో బాగా పెరిగిందని నిపుణులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకూ 65 ఆన్‌లైన్ వేదికలను సహయోగ్ పోర్టల్‌లో చేర్చింది. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నోడల్ అధికారులు, ఏడు కేంద్ర సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా పోర్టల్‌లో చేరారు. సహయోగ్ పోర్టల్ ద్వారా జారీ చేసిన ఆదేశాలు 130 కాగా ఒకే ఆదేశంతో అనేక లింకులను నిలువరించవచ్చు. ఉదాహరణకు గత సంవత్సరం మార్చి నుండి ఈ ఏడాది మార్చి వరకూ వాట్సప్, ఫేస్‌బుక్, స్కైప్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, ఎక్స్, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కంపెనీలకు 79 (3) (బి) కింద 426 నోటీసులు పంపారు. అయితే వాటి ద్వారా లక్షకు పైగా కంటెంట్లను బ్లాక్ చేయాల్సిందిగా హుకుం జారీ చేశారు. వీటిలో డీప్‌ఫేక్‌లతో పాటు అశ్లీలతల నుండి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం వరకూ వివిధ అంశాలకు చెందిన సమాచారం ఉంది.
ఎక్స్ వేదిక ఇప్పటికే సహయోగ్ పోర్టల్‌పై కోర్టులో వ్యాజ్యం వేసింది. అందులో చేరాల్సిందిగా తమ ప్రతినిధులు, ఉద్యోగులను నిర్బంధించకుండా రక్షణ కల్పించాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్ గురువారం విచారణకు వస్తుంది. ఐటీ చట్టంలోని రెండు సెక్షన్లలో రక్షణ చర్యలు వేర్వేరుగా ఉన్నాయి. సెక్షన్ 69 (ఏ) కింద నోటీసులు జారీ చేస్తే కంపెనీలు తమ వాదనను వినిపించవచ్చు. పైగా ఇది జాతీయ భద్రతకు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన నేరాలకు మాత్రమే పరిమితం. కానీ 79 (3) (బి)లో ఎలాంటి రక్షణ చర్యలు ఉండవు.
ఆన్‌లైన్ వేదికలపై ఉక్కుపాదం
- Advertisement -
RELATED ARTICLES