Wednesday, April 30, 2025
Homeజాతీయంఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనలో ప్రధాని సభకు 5 లక్షల మంది

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనలో ప్రధాని సభకు 5 లక్షల మంది

– ఏడు రోడ్లు గుర్తింపు
– 2న సాయంత్రం నాలుగు
– గంటలకు సమావేశం
– గంటలోపు ముగింపు
అమరావతి :
అమరావతి పునర్నిర్మాణ పనులకు వచ్చే నెల 2న ప్రధాని శంకుస్థాపన చేయనున్న సందర్భంగా సుమారు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సోమవారం ఉదయం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సిఎస్‌ విజయానంద్‌, నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ హాజరయ్యారు. పర్యటన విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం గెలుపు తరువాత తొలిసారి ప్రధాని రాజధానికి వస్తున్న సభ కావడంతో ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ ఎత్తున జన సమీకరణ ద్వారా ఘనస్వాగతం పలకాలని భావిస్తోంది. సుమారు ఐదు లక్షల మంది జనాభా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు నుండి ఏడు రోడ్లను గుర్తించారు. వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో సభా వేదికను నిర్మించనున్నారు. అక్కడ నుండి విట్‌ యూనివర్సిటీ, వెలగపూడి, మందడం, ఐనవోలు, నేలపాడు వెళ్లేందుకు దారులు ఉన్నాయి. గతంలో కృష్ణాయపాలెం నుండి సెక్రటేరియట్‌కు ఉన్న రోడ్డును కూడా పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్‌కు పెద్దగా సమస్య లేకుండా ఉండేలా చూస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం వెలగపూడి, కరకట్ట దగ్గర్లో పార్కింగు ఏర్పాటు చేశారు. సభ వేదికకు నాలుగువైపులా ఒక్కోచోట వెయ్యి వాహనాలు ఆపేలా పార్కింగును గుర్తించారు. ఎక్కడికక్కడ స్థలాలు ఖాళీగా ఉండటంతో పార్కింగు సమస్య పెద్దయెత్తున ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కరకట్ట వెంట అదనపు రోడ్డును విస్తరిస్తున్నారు. అమరావతికి వెళ్లే మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు, నీరుకొండ వైపు నుండి అన్ని రోడ్లనూ పునరుద్ధరించారు. అలాగే ఎక్కడికక్కడ నీరు, మజ్జిగ, ఇతర వసతులూ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లనూ పూర్తిచేసి అధికారులను నియమించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌తోపాటు, రైతుల నుండి కూడా ప్రధానికి బొకే ఇప్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో రైతులు, ప్రజలు సభకు వెళ్లేలా సమావేశాలు పూర్తి చేశారు. దూర ప్రాంతం కూడా కాకపోవడంతో తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, గుంటూరు, విజయవాడ నగరాల నుండి పెద్దయెత్తున జనసమీకరణ చేయనున్నారు. మే రెండో తేదీన సాయంత్రం మూడు గంటలకు ప్రధాని అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. హెలిప్యాడ్‌ నుండి రోడ్‌షో ద్వారా నాలుగు గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. ఐదు గంటలకు సభ ముగించనున్నారు. వేసవి దృష్ట్యా సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img