– మార్క్పిజాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి
– శ్రామికుల ఐక్యతను దెబ్బతీయడమే పెట్టుబడిదారుల కుట్ర
– కులాల మధ్య ఆధిపత్య పోరాటం దానిలో భాగమే : సీఐటీయూ సామాజిక న్యాయసాధన క్యాంపెయిన్ రాష్ట్ర సదస్సులో ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశంలో కార్మికవర్గ రాజ్యాధికారం ఏర్పడితే, తక్షణం అధికారాన్ని కోల్పోయేది అదానీ, అంబానీలతో పాటు బూర్జువా రాజకీయపార్టీలే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య వివరించారు. కార్మికవర్గానికి మార్క్సిజం అర్థమయ్యేలా చెప్పగలిగితే రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీన్ని విచ్ఛిన్నం చేయడానికి పెట్టుబడిదారీ దోపిడీ వర్గాలు శ్రామికులను కులం, మతం పేరుతో బహుజనులుగా విభజించి, అధికారంలో కొనసాగుతున్నాయని విశ్లేషించారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న సామాజిక న్యాయసాధన క్యాంపెయిన్ సందర్భంగా శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సమకాలీన పరిస్థితుల్లో రాజ్యాంగం- అంబేద్కర్- కార్మికవర్గ కర్తవ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. బహుజన రాజ్యాధికార నినాదం వినడానికి బాగున్నా, దాని లక్ష్యం కులాలమధ్య ఆధిపత్య పోరాటమేననీ, కులగణన నినాదాన్ని బీజేపీ మినహా అన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పంచుకోవాలని చెప్తున్నాయే తప్ప, అందరికీ ఉద్యోగాలు, ఉపాధి అనే మౌలిక విధానాన్ని విస్మరిస్తున్నాయని చెప్పారు. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే ఈ డిమాండ్ చేస్తున్నారనీ, దాన్ని పాలకవర్గాలు వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. కమ్యూనిస్టులను కూడా కుల, మత జాడ్యాలు వెంటాడుతున్నాయనీ, వాటి ఉచ్చులో పడితే మార్క్సిజం అర్థం కానట్టేనని విశ్లేషించారు. కార్మికవర్గ సిద్ధాంతాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగానే బహుజనరాజ్యం నినాదాన్ని ముందుకు తెస్తున్నారని చెప్పారు. శ్రామికులు ఐక్యం అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతమవుతుందనీ, అది జరక్కుండా జాగ్రత్త పడేందుకు సమాజాన్ని విభజించి, పాలిస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారులకు కులం అవసరం లేదనీ, కేవలం శ్రమైకజీవుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం ‘కులం’ అవసరాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. కులం ఉన్నంతకాలం వివక్ష ఉంటుందనీ, దాన్ని కొనసాగించడం కోసమే అస్తిత్వవాద ఉద్యమాలను పెట్టుబడిదారులు ప్రోత్సహిస్తున్నారని పలు ఉదాహరణలు వివరించారు. పాలకవర్గాల భావజాలం సమాజంలో విస్తరించి ఉన్నదనీ, దాన్ని తట్టుకోవడం కష్టమనీ, కానీ కమ్యూనిస్టులుగా దాన్నే మనం సాధించాల్సి ఉందని దిశానిర్దేశం చేశారు. కులవ్యవస్థతో పాటు అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. కేవలం కమ్యూనిస్టు మార్గంలోనే కులవ్యవస్థ, వివక్ష అంతమవుతాయనీ, ఆ విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దని చెప్పారు. అంతకుముందు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన కామ్రేడ్ బీటీ రణదివే వర్థంతి, కామ్రేడ్ విమల రణదివే జయంతి, జ్యోతిరావుపూలే జయంతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ వర్గపోరాటాలను ఉధృతం చేయడం కోసం క్యాలండర్‌ను ప్రకటించినట్టు చెప్పారు. కార్మికవర్గాన్ని ఐక్యం చేసి, పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడమే సీఐటీయూ లక్ష్యమని తెలిపారు. దీనికి కులం, మతం, భాష వంటి అనేక అవరోధాలు ఉన్నాయనీ, వీటిని పెట్టుబడిదారులే పెంచి పోషిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబేద్కర్‌ను ఆకాశానికెత్తుతూనే, ఆయన లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ సామాజిక న్యాయం పేరుతో సనాతనధర్మం, మనువాదాన్ని ముందుకు తెస్తున్నదనీ, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. దానికోసం మత ఘర్షణలు సృష్టిస్తూ, ప్రజల్లో విభజన భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మశాస్త్రాన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ కొద్దిమందికే ప్రయోజనాలు కల్పిస్తుందని చెప్పారు. కార్మికవర్గ దీర్ఘకాల ప్రయోజనాల కోసం భవిష్యత్‌లో మరిన్ని ఐక్య పోరాటాల అవసరం ఉందన్నారు. సదస్సులో సీఐటీయూ ఉపాధ్యక్షులు వీఎస్ రావు, కార్యదర్శులు జే వెంకటేష్, ఆర్ రమేష్, కే మాధవి, జే చంద్రశేఖర్, ఎమ్ వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ కాటంరాజు, రామ్మోహన్, పీ సుధాకర్, ఏ సునీత, ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్, శ్రవణ్‌కుమార్, మీనా, పీ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ వందన సమర్పణ చేశారు.
కార్మికవర్గ రాజ్యాధికారమే లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES