Wednesday, April 30, 2025
Homeమానవికాలుష్యంతో ప్రమాదం

కాలుష్యంతో ప్రమాదం

కొంత మంది శుభ్రత అంటూ పదే పదే చేతులు కడుక్కుంటారు. ఇంట్లో దుర్వాసనను దూరం చేయాడానికి పర్‌ఫ్యూమ్‌లను వాడేస్తుంటారు. క్రిములు నశిస్తాయని ఇంటిని క్లీన్‌ చేసే నీటిలో ఫ్లోర్‌ క్లీనర్లు కలుపుతుంటారు. ఇలా సౌకర్యం, శుభ్రం, సౌందర్యం పేరుతో వాడే వస్తువులన్నీ ఇంటిని అత్యంత కాలుష్య ప్రదేశంగా మార్చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలో దీర్ఘకాలంలో అనేక అనారోగ్యాలకు గురయ్యేలా చేస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోని కాలుష్యానికి ఎక్కువగా మహిళలే గురవుతారని ఇటీవల కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుండె, గర్భధారణ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ల బారినా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 లక్షల మంది మహిళలు, చిన్నారులు ఇండోర్‌ కాలుష్యం బారిన పడుతున్నారు.
అన్నీ కాలుష్య కారకాలే
హోం క్లీనర్లు, గ్యాస్‌ స్టవ్‌, ఫర్నిచర్‌, షాంపూలు, క్రీములు, డ్రయ్యర్లు, ఏసీ, ఫ్రిజ్‌, పెయింట్లు, దుప్పట్లు, కార్పెట్లు, కర్టెన్లు, పెంపుడు జంతువులు, వంటగదిలో వెలువడే వాయువులు, వాడుకునే ఉపకరణాలు, తేమ, ఆఖరికి కొన్ని రకాల మొక్కలు అన్నీ కాలుష్య కారకాలే. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ అదే నిజం అంటున్నారు నిపుణులు. వీటి వల్లే వాయు కాలుష్య కారకాలైన టోలీన్‌, జైలీన్‌, బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటివి ఆరుబయట కన్నా ఇంట్లోనే రెండు నుండి ఐదు రెట్లు ఎక్కువగా విడుదలవుతున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీతో పాటు ఇటీవల విడుదలైన ‘హైదరాబాద్‌ ఎమిషన్స్‌’ రిపోర్టూ, ఆ మధ్య ‘ఐఐటీ రూర్కీ’, మహారాష్ట్రలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ’లు చేసిన సంయుక్త అధ్యయనం కూడా ఈ విషయాన్నే వెల్లడించింది.
అవసరం లేనిదే వద్దు
అందం కోసం ఈ మధ్య కాలంలో చాలామంది క్రీములూ, షాంపూలూ, మేకప్‌ సామగ్రిని తెగ వాడేస్తుంటారు. వీటిల్లోని అమోనియా, ఫార్మాల్డిహైడ్‌, థాలేట్స్‌, పారాబెన్స్‌, పీఎఫ్‌ఏఎస్‌ వంటివి పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు శ్వాసకోశ సమస్యలకీ కారణం అవుతుంటాయి. అందుకే అవసరం లేనిదే ఇలాంటి ఉత్పత్తులు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మాయిశ్చర్‌ కోసం కొబ్బరి, నువ్వుల నూనెలు వాడితే జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపిస్తాయని చెబుతున్నారు.
సహజ పరిమళ ద్రవ్యాల వాడకం
దుమ్ము వస్తుందనో, భద్రత కోసమనో, ఎండ పడుతుందనో కొందరు ఇంటి తలుపులు, కిటికీలూ మూసే ఉంచుతుంటారు. దీంతో గోడలూ, బాత్రూముల్లో తేమచేరి హనీ చేసే సూక్ష్మజీవులకు ఆవాసాలుగా మారతాయి. వీటివల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. అందుకే ఈ చెడు వాసనను తరిమికొట్టడానికి కృత్రిమ పరిమళ ద్రవ్యాలు కాకుండా సహజంగా పూలు, నూనెలతో సుగంధాలు వెదజల్లేలా చేయాలని సూచిస్తున్నారు. ఇంకా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
చల్లగాలి కోసం
ప్రస్తుతం వేడి నుంచి ఉపశమనం కోసం అంతా ఏసీ గదుల్లో ఉంటున్నారు. ఇక వేసవి కాలం ప్రారంభ కావడం మొదలు కూలర్లను తెగ వాడేస్తున్నారు. ఇలాంటి అలవాట్లతో గదులు కాలుష్యభరితంగా మారిపోతున్నాయి. ఇలాంటి పద్ధతి కాకుండా సహజంగా ఇంటిని చల్లబరిచే మొక్కలు, షేడ్‌ నెట్‌లు, వట్టివేళ తెరల్ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇంట్లోనే సహజంగా గాలిని శుద్ధి చేసేందుకు నాసా ధ్రువీకరించిన ఇంగ్లిష్‌ ఐవీ, మనీప్లాంట్‌, ఫిలడెండ్రాన్‌, ఆంథూరియం, పీస్‌ లిల్లీ వంటి వాటిని పెంచుకోవడం మేలని సలహా ఇస్తున్నారు.
కాస్త వినెగర్‌, బేకింగ్‌ సోడాతో
ఇంటి పరిశుభ్రత కోసం వాడే బాత్రూమ్‌ క్లీనర్లు, డిటర్జెంట్లు అన్నింట్లోనూ రసాయనాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో మూత్రపిండాలు, కాలేయం, నాడీ వ్యవస్థలపైనా ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటికి బదులుగా మరిగించి వడకట్టిన లీటరు కుంకుడుకాయ రసంలో కాస్త వినెగర్‌, బేకింగ్‌ సోడా కలిపి డిష్‌ వాషర్‌గా వాడుకోవచ్చు. ఈ మిశ్రమానికి లెమన్‌, లావెండర్‌, సిట్రనెల్లా వంటి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ రెండు చుక్కలు, కాస్త రాళ్ల ఉప్పుని చేర్చి ఫ్లోర్‌ క్లీనర్‌గానూ ఉపయోగించొచ్చనని నిపుణులు అంటున్నారు. దీన్నే దుస్తులను శుభ్రం చేయడానికి వాడొచ్చని సూచిస్తున్నారు.
వ్యర్థ పదార్థాలు నిల్వ లేకుండా
ఇంటిలో తిరిగే చీమలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు సహజంగానే కాలుష్య వాహకాలు. ఇక దోమల్ని అరికట్టడానికి వాడే రెపల్లెంట్‌లూ శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే బొద్దింకల్ని అరికట్టేందుకు బయోక్లీనర్‌గా పనిచేసే వినెగర్‌ని వాడటం మంచిదని సూచిస్తున్నారు. దోమలను అరికట్టడానికి కిటికీల దగ్గర నాలుగు వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి పెట్టండి. లేకుంటే లీటర్‌ నీటిలో సిట్రనెల్లా, యూకలిప్టస్‌, లెమన్‌ గ్రాస్‌ ఆయుల్స్‌ రెండు చుక్కల చొప్పున కలిపి ఇల్లంతా స్ప్రే చేయండి. ఇంట్లో నీరు, ఆహార వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. నిద్రపోయే ప్రదేశంలో మాసిన దుస్తుల్ని లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img