Wednesday, April 30, 2025
Homeజాతీయంకేంద్రానికి ఆర్బీఐ మరో బొనంజా

కేంద్రానికి ఆర్బీఐ మరో బొనంజా

– రూ.2.5 లక్షల కోట్ల డివిడెండ్‌..!
– రిజర్వు బ్యాంక్‌ సామర్థ్యానికి దెబ్బ
న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మరోమారు మోడీ ప్రభుత్వ ఖజానాను భారీగా నింపనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను ఆర్బీఐ రూ.2.5 లక్షల కోట్ల పైగా డివిడెండ్‌ను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది గతేడాది చెల్లించిన రూ. 2.1 లక్షల కోట్ల కంటే ఎక్కువ కానుంది. ప్రతీ సారి కేంద్ర ఒత్తిళ్లకు ఆర్బీఐ తన వద్ద ఉన్న మిగులు నిధులను ధారపోయడం ద్వారా సంక్షోభ సమయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ చేతులెత్తేసే ప్రమాదం ఉంది. రూపాయి మారకం రేటును కాపాడటానికి రిజర్వు బ్యాంక్‌ డాలర్లను అమ్మడం, లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ఖజానాకు డివిడెండ్‌ రూపంలో ఇవ్వనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.2.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ డివిడెండ్‌ చెల్లించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. రూపాయి మారకం రేటును కాపాడటానికి ఆర్బీఐ రికార్డు స్థాయిలో డాలర్‌ అమ్మకాలు చేపట్టడం, పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా సంపాదించిన వడ్డీ ఆదాయం ఈ భారీ డివిడెండ్‌ అవకాశాలను పెంచాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక విదేశీ బ్యాంకింగ్‌ గ్రూప్‌ ఏకంగా ఈ డివిడెండ్‌ రూ.3.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని కూడా అంచనా వేయడం గమనార్హం. బ్యాకింగ్‌, పెట్టుబడుల రెగ్యూలేటరీ, ప్రభుత్వ రుణాలు నిర్వహించే ఆర్బీఐ 2024-25కు గాను తన వద్ద ఉన్న మిగులు నిధులను మే చివరలో ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో బదిలీ చేయనుంది. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించడానికి సహాయపడతాయి. ప్రభుత్వ వ్యయం బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచనుంది. ముఖ్యంగా ఆర్థిక మందగమనం కారణంగా పన్ను వసూళ్లు తగ్గిన నేపథ్యంలో ఈ అధిక డివిడెండ్‌తో కేంద్రానికి ఆర్థిక మద్దతు లభించనుందని ఎమ్‌కారు గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌ మాధవి అరోరా పేర్కొన్నారు. ఈ దఫా డివిడెండ్‌ రూ. 2.8 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. గతేడాది కంటే అధికంగా డివిడెండ్‌ను అందించే అవకాశాలున్నాయని ఎఎన్‌ జడ్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ ఎకనమిస్‌, ఎఫ్‌ఎక్స్‌ స్ట్రాటజిస్ట్‌ ధీరజ్‌ నిమ్‌ తెలిపారు. ఈ డివిడెండ్‌ రూ. 2.5 లక్షల కోట్ల నుంచి రూ. 3.5 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు.
ఆర్బీఐ స్వయంప్రత్తికి దెబ్బ
అధిక డివిడెండ్‌ వల్ల ప్రతికూల ప్రభావాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగులు బదిలీ కోసం ఆర్బీఐ తన ఆకస్మిక నిల్వలను(కంటింజెన్సీ రిజర్వులు) వాడుకోవడం ద్వారా ఆర్థిక సంక్షోభాలకు సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రతిసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి మిగులు బదిలీ చేస్తుంటే కేంద్రం డిమాండ్‌కు ఆర్బీఐ తలొగ్గుతోందని స్పష్టమవుతోంది. ఇది ఆర్‌బిఐ స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగులు బదిలీలు కేంద్రానికి తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లకు దారితీసాయని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img