– ప్రొఫెసర్ హరగోపాల్ ఫార్మా భూముల్లో తెలంగాణ పీపుల్స్ జేఏసీ ప్రజా సంఘాల ప్రతినిధుల పర్యటన
– రాజ్యాంగానికి విరుద్ధంగా భూములకు ఫెన్సింగ్
– 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం
– ఫార్మాసిటీ పేరుకు బదులు ఫ్యూచర్ సిటీగా మార్చడం చట్ట వ్యతిరేకం
– ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి
– ఫార్మా విషయంలో రైతులను మోసం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం
– నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
– రైతులకు రైతు భరోసా, క్రాప్ లోన్లు ఇవ్వాలి
నవతెలంగాణ-యాచారం
హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లను ముఖ్యమంత్రి దిక్కరిస్తూ ఫార్మా భూములకు బలవంతంగా ఫెన్సింగ్ వేస్తున్నారని రాష్ట్ర పీపుల్స్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి ఫార్మా భూముల్లో తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు పర్యటించారు. అనంతరం రైతులు పండిస్తున్న పంట పొలాలను పరిశీలించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మా భూముల్లో రైతులు వ్యవసాయం చేస్తూ కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. కలుషితం లేని కూరగాయల తోటలు, వరి పంట, ఇతర వంటలు వేస్తూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఫార్మా పేరుతో హైకోర్టు ఆర్డర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం భూములకు ఫెన్సింగ్ వేస్తుందని అన్నారు. సుభిక్షమైన ప్రాంతంలో ఏదో పేరు చెప్పి కంపెనీలు తెస్తామని రైతుల నుంచి భూములను లాక్కొని వారిని రోడ్డున పడేయటం అన్యాయమన్నారు. ఇది అసలు అభివృద్ధి ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాక్టర్ వనమాల మాట్లాడుతూ.. గతంలో తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలతో పటాన్‌చెరు అంతా క్యాన్సర్ భయమయిందని తెలిపారు. ఇక్కడ ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో బతుకుతున్న వారిని కాలుష్య కంపెనీలు పెట్టడం దారుణమని అన్నారు. అడ్వకేట్ సాజిద్ మాట్లాడుతూ.. ఒకపక్క రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ చెపుతుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తూ భూములకు ఫెన్సింగ్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీపుల్స్ జేఏసీ జాయింట్ కన్వీనర్ రవి కన్నెగంటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మాటేమిటని ప్రశ్నించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూ చట్టానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఇక్కడి ప్రాంత ప్రజలను సీఎం మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధి మీరా సంఘమిత్ర మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని.. చట్టాన్ని తీసుకురావడం తేలికని, దాన్ని అమలుచేయడమే కష్టమని అన్నారు. ఫార్మాసిటీకి తీసుకున్న భూములు టీచర్ సిటీకి మార్చడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. పూర్తి వివరాలు ప్రజలకు ఇవ్వకుండా భయపెట్టి భూములను లాక్కొని భూసేకరణ జరిగిపోయింది అనటం కరెక్ట్ కాదని చెప్పారు. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రతినిధి డాక్టర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ప్రజలను ప్రభుత్వం మోసం చేయడం తగదని, వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీచర్ సిటీ ప్రతిపాదనను విరమించుకుని భూసేకరణను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ జేఏసీ ప్రతినిధులు అశోక్, కొండల్ రెడ్డి, రవీంద్ర, డా.ఉస్మాన్, మానవ హక్కుల వేదిక నరసింహ, చైతన్య మహిళా సంఘం జ్యోతి, శ్రీదేవి, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ బాధ్యులు కవుల సరస్వతి, కానమోని గణేష్, మైపాల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లింగం, సందీప్‌రెడ్డి, ఫార్మా బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES