అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధించిన టారిఫ్‌లను రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లను నిలిపివేయాలని కోరుతూ 12కి పైగా రాష్ట్రాలు న్యూయార్క్‌లోని యుఎస్‌కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌ను ఆశ్రయించాయి. టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, అమెరికా ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించాయని మండిపడ్డాయి.
అమెరికా అధ్యక్షులు ట్రంప్ అమలు చేసిన విధానం చట్టబద్ధంగా అధికారాన్ని వినియోగించడానికి బదులుగా ఇష్టానుసారంగా వ్యవహరించినట్లుగా ఉందని దావాలో తెలిపాయి. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఆధారంగా తాను ఏకపక్షంగా సుంకాలు విధించవచ్చన్న ట్రంప్ వాదనను ఈ వ్యాజ్యం సవాలు చేసింది. సుంకాలు చట్టవిరుద్ధమని ప్రకటించాలని, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు వాటిని అమలు చేయకుండా నిరోధించాలని కోర్టును కోరాయి. ఒరెగాన్ , అరిజోనా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మయినె, మిన్నెసోటా, నెవాడా, న్యూమెక్సికో, వెర్మొంటో, న్యూయార్క్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.
ట్రంప్ టారిఫ్ పథకం పిచ్చిపట్టిన విధానం అని అరిజోనా అటార్నీ జనరల్ క్రిస్ మేయస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఆర్థిక నిర్లక్ష్యమే కాకుండా చట్టవిరుద్ధమని అన్నారు. సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, అత్యవసర పరిస్థితి విదేశాల నుండి అసాధారణమైన మరియు తీవ్రమైన ముప్పు ఎదురైనపుడు మాత్రమే అమెరికా అధ్యక్షులు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అమలు చేయగలరని వాదించారు. టారిఫ్‌ల విధింపుతో అధ్యక్షులు రాజ్యాంగ క్రమాన్ని ఉల్లంఘించారని, ఇది ఆమెరికా ఆర్థిక వ్యవస్థలో గందరగోళానికి దారితీసిందని పేర్కొన్నారు.
గతవారం కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో ట్రంప్ విధానాలపై డెమోక్రాట్ నేత, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ దావా వేసిన సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద దిగుమతి దారుగా ఉన్న తన రాష్ట్రం బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోనుందని పేర్కొన్నారు.