Tuesday, April 29, 2025
Homeజాతీయం'దాడులు ఆపేందుకు ప్రయత్నించి..

‘దాడులు ఆపేందుకు ప్రయత్నించి..

– ప్రాణాలు కోల్పోయిన గుర్రం స్వారీ యువకుడు
– అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం ఒమర్‌ అబ్దుల్లా
ఉగ్రవాదులు తెగబడినపుడు ఆ ప్రాంతంలో ఉన్న వారెవరైనా తన, మన బేధం లేకుండా ఆ దాడులు ఆపేందుకు ప్రయత్నించారనడానికి ఈ ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పర్యాటకులపై ముష్కరులు తూటాలు ఎక్కుపెట్టి కాల్పులు జరపటానికి సిద్ధమైనపుడు.. పాపం..చంపొద్దు అంటూ ఓ గుర్రం స్వారీ యువకుడు ప్రయత్నించాడు. కానీ ఆ దుర్మార్గులు అతన్నీ వదల్లేదు. మరో చోట 11 మంది కుటుంబ సభ్యులను ఓ కాశ్మీరి వ్యాపారి సురక్షితంగా కాపాడారు. మరోవైపు స్థానిక ఆటోడ్రైవర్లు, జనం పర్యాటకులకు అండగా నిలవటానికి ముందుకు రావటం విశేషం.
శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని ఆపేందుకు ఓ గుర్రం స్వారీ యువకుడు సయ్యద్‌ ఆదిల్‌ హుస్సేన్‌ షా ప్రయత్నించాడని సీఎం ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు కూడా మరణించాడని చెప్పారు. బుధవారం నిర్వహించిన సయ్యద్‌ ఆదిల్‌ హుస్సేన్‌ షా అంత్యక్రియల్లో ఒమర్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సీఎం మాట్లాడారు. ‘ఏం చెప్పను? మా అతిథులు సెలవులకు వచ్చారు. దురదృష్టవశాత్తు వారిని శవపేటికల్లో పంపాల్సిన దుస్థితి. ఈ యువకుడు (షా) జీవనోపాధి కోసం చాలా కష్టపడ్డాడు. పని కోసం ఇంటి నుంచి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతడి మృతదేహాన్ని కూడా శవపేటికలో తిరిగి ఇచ్చాం’ అని బాధపడుతూ తెలిపారు.
11 మంది కుటుంబ సభ్యులను కాపాడిన కాశ్మీరి వ్యాపారి
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహేంద్ర గఢ్‌ చిర్‌మిరీ, భరత్‌పుర్‌ ప్రాంతానికి చెందిన నాలుగు కుటుంబాలు వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ 18న చిన్నారులతో సహా విహార యాత్రకు వెళ్లాయి. 21న పహల్గాం పర్యటనకు వెళ్లినట్టు కుల్దీప్‌ బంధువు రాకేశ్‌ తెలిపారు. అయితే, కొండచరియలు విరిగిపడడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచి పోయిందని, ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారని వివరించారు. ఈ సమయంలోనే ఉగ్రదాడి జరగగా ఆ సమయంలో శివాన్ష్‌ జైన్‌, కుల్దీప్‌ స్తాపక్‌, అర్విందర్‌ అగర్వాల్‌, హ్యాప్పీ బద్వాన్‌ కుటుంబాలకు చెందిన 11మంది అక్కడే ఉన్నారు. భయపడిన వారు పరుగులు తీసినట్లు వెల్లడించారు. వీరిని గమనించిన స్థానిక కాశ్మీరి వ్యాపారి నజకత్‌ అలీ సమయస్ఫూర్తిని ప్రదర్శించి, పర్యాటకులు 11 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడినట్లు తెలిపారు. నజకత్‌ అలీ ప్రతి ఏడాది శీతాకాలంలో ఉన్ని దుస్తులు విక్రయించేందుకు చిర్‌మిరికి వస్తుంటాడని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img