– పర్యాటకులే లక్ష్యంతో టూరిజానికి ఎఫెక్ట్
– నిరాధార వార్తలతో ‘బీజేపీ పరివారం’ దుష్ప్రచారాలు
– ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ పోస్ట్‌లు
– భద్రతా లోపమా? ప్రోటోకాల్ ఉల్లంఘనా?
– కేంద్రం వైఫల్యం స్పష్టం!
– సర్వత్రా వెల్లువెత్తుతున్న ప్రశ్నలు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ చరిత్రలో మరో విషాదకరమైన ఘటన జరిగి నేటితో మూడ్రోజులైంది. మనోహరమైన ప్రకృతి అందాన్ని కలిగిన పహల్గాం లోని సుందరమైన బైసారన్ గడ్డి మైదానం ఉగ్రవాదుల దాడిలో రక్తమోడింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇప్పుడు ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పలువురుని భయభ్రాంతులకు గురి చేసింది. పుల్వామా భయానక ఉగ్రదాడి తర్వాత జరిగిన అతిపెద్ద ముష్కర దుశ్చర్య ఇదే కావటం గమనార్హం. ఈ ఘటన తర్వాత.. విదేశీ పర్యటనలో ఉన్న మోడీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఆర్టికల్-370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న మోడీ సర్కారు వాదనలను ఈ ఘటన సవాలు చేస్తున్నది.
బీజేపీ రాజకీయం..
అమర్‌నాథ్ యాత్ర టార్గెట్‌గా ముష్కరులు
ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. పర్యాటకులనే లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడటం. అయితే, ఈ దాడిని అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన దాడులతో ముడిపెట్టొద్దు. ఎందుకంటే.. అమర్‌నాథ్ యాత్రను బీజేపీ వంటి రాజకీయపార్టీలు రాజకీయంతో ముడిపెడుతూ పరోక్షంగా దాడులకు దారి తీస్తుంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. 1990 నుంచి 99 మధ్య ఈ యాత్ర ప్రశాంతంగానే జరిగేది. 2000 నుంచి 2017 మధ్య దాడులు పెరిగాయి. 2000, ఆగస్ట్ 2న పహల్గామ్‌లోని అమర్‌నాథ్ తీర్థయాత్ర స్థావర శిబిరంపై జరిగిన దాడిలో 10 మంది యాత్రికులు సహా కనీసం 21 మంది పౌరులు మరణించారు. 2001లో అమర్‌నాథ్ మందిరం సమీపంలో ఒక ఉగ్రవాది గ్రెనేడ్లు విసిరి కాల్పులు జరపటంతో 13 మంది యాత్రికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 2002లో నువ్వాన్ శిబిరంపై జరిగిన దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మరణించారు. 30 మంది గాయపడ్డారు. 2017, జులైలో అమర్‌నాథ్ మందిరం నుంచి తిరిగి వస్తున్న బస్సుపై అను మానిత ఉగ్రవాదులు దాడి చేయటంతో ఏడుగురు యాత్రికులు మరణించారు. 19 మంది గాయపడ్డారు.
కాషాయదళం తీరుతో అమాయకులు బలి
అమర్‌నాథ్ తీర్థయాత్రను ఆరెస్సెస్- బీజేపీలు రాజకీయం చేయటం, హిందూ గుర్తింపునకు చిహ్నంగా ప్రోత్సహించటం వంటి చర్యలతో ఉగ్రవాదులు సవాలుగా తీసుకోవటం, ఫలితంగా అమాయకపు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమర్‌నాథ్ వంటి యాత్రను మినహాయిస్తే చాలా ఏండ్ల తర్వాత ఇప్పటి వరకు పర్యాటకులు దాడులకు గురి కాలేదు. 1990ల మధ్యలో హౌస్‌బోట్‌లో ఉన్న ఏడుగురు ఇజ్రాయెల్ పర్యాటకులపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఇందులో ఒకరిని చంపి, ముగ్గురిని గాయపరిచారు. శ్రీనగర్‌లో విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని తొలిసారి జరిగిన దాడిగా దీనిని పలువురు అభివర్ణించారు. 1995, జులై 4న ఆరుగురు విదేశీ పర్యాటకులను ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు కిడ్నాప్ చేశారు.
కాశ్మీరీల సంఘీభావం
ఈ నేపథ్యంలో మంగళవారం పహల్గాంలో జరిగిన రక్తపాతం తీవ్ర ఆందోళనను కలిగించింది. కాశ్మీర్‌లో ఈ ఘటన ప్రతిధ్వనించింది. సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఖండనలు, సంతాపాలతో నిండిపోయింది. కాశ్మీర్‌లో కొందరు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించగా.. మరికొందరు బంద్‌కు పిలుపునిచ్చి నిరసనను వ్యక్తం చేశారు. పర్యాటకులను కాల్చి చంపిన ముష్కరుల దుశ్చర్యను కాశ్మీరీలు తీవ్రంగా ఖండించారు. లోయలో పర్యాటక పరిశ్రమ దాదాపు 15 నుంచి 20 శాతం మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక వనరు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో పర్యాటకానికి కొత్త ఊపు వచ్చిందని మోడీ సర్కారు పలు సందర్భాల్లో చెప్పింది. ఉగ్రదాడులు తగ్గిపోయాయని పార్లమెంటులో సైతం వివరిం చింది. ఇప్పుడు అదే కాశ్మీర్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రవాదులు దాడులకు తెగబడటం మోడీ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుత ఈ దాడితో పర్యాటకం పడిపోయే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు.
పూర్తి వాస్తవాలు ఇంకా రావాల్సి ఉన్నా..
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నది. సమాచారం ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ.. ఒక వర్గం మీడియా, బీజేపీ అనుబంధ సామాజిక మాధ్యమ ఖాతాలు నిరాధార వార్తలను, కథనాలను ప్రచారం చేస్తున్నాయి. ఆడవారి నుంచి మగవారిని వేరు చేసి.. మగవారిని చంపారని కొన్ని వార్తా కథనాలు చెప్పాయి. ఇక మతం ఆధారంగా హిందువులను చంపారని మరికొన్ని కథనాలు వచ్చాయి. అయితే, ఉగ్రవాదులను చూశామని చెప్తున్నవారి వివరాలు పబ్లిక్‌డొమైన్‌లో ఇప్పటి వరకైతే లేవనీ, అలాంటపుడు ఇలాంటి వార్తలను ఎలా నమ్మగలమని విశ్లేషకులు చెప్తున్నారు.
అనేక ప్రశ్నలు.. అనుమానాలు
పహల్గామ్‌దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఇది నిఘా వైఫల్యమా? భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘనా? లేక ఈ రెండింటి కారణాలతో జరిగిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వెయ్యి మందికి పైగా సందర్శకులు ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం తగినంత భద్రతతో లేకపోవటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తున్నది. గతేడాది కాలంగా జమ్మూలో ఉగ్రవాదం తిరిగి పుంజుకోవటం ఆందోళన కలిగిస్తున్నది. పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలు నిఘా వ్యవస్థ, భద్రతా పర్యవేక్షణ క్షీణిస్తున్నదని సూచిస్తు న్నాయి. గతంలో జరిగిన దాడుల నుంచి.. అవసరమైన పాఠాలను నేర్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ విషాదం మరోసారి భద్రతా యంత్రాంగంలోని దుర్బలత్వాన్ని ఎత్తి చూపుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్రం వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకు.. పాక్‌ను టార్గెట్‌గా చేసుకుంటూ ఖండనలు, వార్తలు, ప్రచారాలు జరుగుతున్నాయనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు కథనాలతో కాశ్మీరీలకు ఇబ్బందులు
ఈ పరిస్థితులు కాశ్మీరీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా, భారత్‌లోని ఒక వర్గం మీడియా ‘ఈ ఘటనపై ప్రతీకారం తీర్చుకోవాలి’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో టీవీలలో చర్చలు జరుపుతుండటం పట్ల కూడా వారు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, దాని అనుబంధ హిందూత్వ సంస్థలు, సంఘాలు సోషల్ మీడియాలో మతం ఆధారంగా విషం చిమ్ముతున్న విధానం కాశ్మీరీలనే కాకుండా.. యావత్ దేశంలోని ముస్లింలను తీవ్ర ఇబ్బందికి, అసౌకర్యానికి గురి చేస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘ఉగ్రవాదానికి ఒక మతం ఉన్నది’, ‘పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఇక్కడా జరపాలి’, ‘మరొక సర్జికల్ స్ట్రైక్‌కు సమయం ఆసన్నమైంది’, ‘ప్రతీకారం తీర్చుకోవాలి’.. ఇలా అనేక వార్తలతో హిందూత్వ పరివారం రెచ్చగొట్టే చర్యలకు దిగింది.
పహల్గాం ఉగ్రదాడితో ఆందోళన
- Advertisement -
RELATED ARTICLES