– హిందూవులే లక్ష్యంగా ఉగ్రదాడి : బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎక్కడ దాక్కున్నా ఉగ్రదాడి నిందితులను కోలుకోలేని దెబ్బ కొడతామనీ, ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బదులిస్తామని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పెహల్గం దుర్ఘటనలో మరణించిన వారికి సంతాపసూచకంగా లక్ష్మణ్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్ర దాడిగా చూడకుండా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా సీడబ్ల్యూసీ విమర్శలు చేయడం తగదన్నారు. కాశ్మీర్‌లో టూరిజం పెరగడం జీర్ణించుకోలేక టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఈ ఘటనకు కారణం పాకిస్తాన్ అని ప్రపంచం మొత్తం అంటున్నదన్నారు. ఐడీ కార్డుల ఆధారంగా హిందూవులని నిర్ధారణ చేసుకుని మరీ చంపారని వాపోయారు. ముస్లింలంతా జీహాదీలు కాదనీ, జీహాదీలు మాత్రం ముస్లింలే అని విమర్శించారు. రాబర్ట్‌వాద్రా వ్యాఖ్యలు ఉగ్రవాదులను సమర్థించేలా ఉన్నాయని ఆరోపించారు. మజ్లీస్‌కు వంతపాడే పార్టీ బీఆర్‌ఎస్ అనీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఓటింగ్‌లో పాల్గొనద్దని కేటీఆర్ ఆదేశించడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని విమర్శించారు. ఉగ్రదాడిపై ట్విట్టర్ పిట్ట అసలు రెస్పాన్స్ కూడా అవ్వలేదన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే చిన్నాభిన్నమైందనీ, దాన్ని కప్పిపుచ్చు కోవడానికి ఇలాంటి దాడులకు తెగబడుతున్నదని విమర్శించారు. గతంలో సర్జికల్, ఎయిర్ స్ట్రైక్‌లు జరిగినా ఆ దేశానికి బుద్ధి రాలేదన్నారు.
ప్రపంచం ఆశ్చర్యపోయేలా బదులిస్తాం
- Advertisement -
RELATED ARTICLES