
రాజేంద్రప్రసాద్, నటి అర్చన కాంబినేషన్‌లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రెండో పాటను హీరో రవితేజ ఆవిష్కరించి, యూనిట్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య చేసిన ఈ సినిమా చూడండి.. డెఫినెట్‌గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు, ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె మొదటి చూపులో…తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో..’ అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, ‘సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’లో ‘మౌనమేలనోయి ‘పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్‌కి రెహమాన్ మంచి సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్, విభావరితో ఈ పాట పాడించారు. రాజమండ్రిలో ఈశ్వర్ నత్య దర్శకత్వంలో హీరో, హీరోయిన్లు రూపేష్,ఆకాంక్ష సింగ్‌లపై ఈ పాటను చిత్రీకరించాం’ అని అన్నారు.