Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుబీసీలకు, దళితులకు బీజేపీ వ్యతిరేకం

బీసీలకు, దళితులకు బీజేపీ వ్యతిరేకం

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– చార్మినార్‌ వద్ద అంబేద్కర్‌ జయంతి వేడుకలు
నవతెలంగాణ – ధూల్‌ పేట్‌

బీసీలకు, దళితులకు బీజేపీ వ్యతిరేకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ కులం ఎంత జనాభా ఉంది, వారి ఆర్థిక, విద్య పరిస్థితి ఏంటని తెలియాలంటే దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని సీపీఐ(ఎం)తో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. దీనికి బీజీపీ వ్యతిరేకంగా ఉందన్నారు. కులగణన జరిగితేనే వారి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటానికి, సంక్షేమ పథకాలు, నిధులు కేటాయించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు ఇక్కడ బీసీలకు అనుకూలమంటారు.. అక్కడికెళ్లి దేశంలో కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడతారన్నారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందన్నారు. దేశంలో మహిళా చట్టాలను అమలు చేయని దుస్థితి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్నైనా నమ్ముకునే అవకాశం వారికుందన్నారు. కానీ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మత మార్పిడి పేరుతో మైనార్టీల స్వేచ్ఛను ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకుంటోందని చెప్పారు. వక్ఫ్‌ బోర్డు సవరణ పేరుతో వక్ఫ్‌ బోర్డుకు ఆస్తులివ్వాలంటే ఇస్లాంను పుచ్చుకుని 5 ఏండ్లు అయిన వారికే అది సాధ్యమనే చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇంతకుముందు వక్ఫ్‌ బోర్డు వారి ఆస్తులు వారి ఆధీనంలో ఉండేవని, ఇప్పుడు కలెక్టర్‌ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలో రిజర్వేషన్‌లు నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలపై దాడులు, లైంగికదాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బా స్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు డిజి.నర్సింహారావు, నాయకులు ఉడుత రవీందర్‌, ఉరపాటి రమేష్‌, ధర్మ నాయక్‌, శోబాన్‌ నాయక్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు విఠల్‌, నాగేశ్వర్‌, శ్రావణ్‌ కుమార్‌, మీనా, అబ్దుల్‌ సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చార్మినార్‌ వద్ద అంబేద్కర్‌ జయంతి ర్యాలీ చేపట్టగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నాయకులు పోలీసులతో మాట్లాడి శాంతియుతంగా ముందుకు సాగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img